David Warner Retirement: శతాధిక టెస్టులు ఆడిన  ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్  క్రికెట్‌లో  ఒక ఫార్మాట్ నుంచి తప్పుకునే సమయం ఆసన్నమైంది.   గత రెండేండ్లకాలంగా  సుదీర్ఘ ఫార్మాట్‌లో విఫలమవుతున్న  వార్నర్..  వచ్చే ఏడాది  టెస్టుల నుంచి తప్పుకోనున్నట్టు తెలిపాడు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌కు ముందు  వార్నర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.  


సిడ్నీలోనే.. 


2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వార్నర్ రిటైర్మెంట్ గురించి ఆప్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  ‘వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్ కప్ నా చివరి టోర్నీ నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నా. . ఆ మేరకు నేను నా ఫ్యామిలీకి కూడా మాటిచ్చాను. ఇదే విధంగా నేను పరుగులు చేయగలిగితే ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది  పాకిస్తాన్‌తో సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగబోయే  టెస్టు నా ఆఖరిది అవుతుంది.   ఆ తర్వాత జరిగే వెస్టిండీస్ సిరీస్ లో అయితే కచ్చితంగా ఆడను..’ అని  చెప్పాడు. 


2024 జనవరిలో  పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.  సిడ్నీ వేదికగా  ఇక్కడ జరిగే మ్యాచ్‌లో  తాను రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు.  సుదీర్ఘ కెరీర్‌లో  103 టెస్టులు ఆడిన వార్నర్.. 45.57 సగటుతో ఏకంగా 8,158 పరుగులు చేశాడు.   ఇందులో 25 సెంచరీలు, 34 అర్థ శతకాలూ ఉన్నాయి. వార్నర్ అత్యధిక స్కోరు 335 నాటౌట్‌గా ఉంది.  


 






36 ఏండ్ల వార్నర్.. గడిచిన రెండేండ్లలో 17 టెస్టులు ఆడి   ఒక్క సెంచరీ మాత్రమే సాధించాడు.  వాస్తవానికి   గతేడాదే వార్నర్‌ను టెస్టు జట్టు నుంచి తప్పిస్తారని వార్తలు వచ్చాయి.  కానీ  పరిమిత ఓవర్ల క్రికెట్‌లో  నిలకడగా రాణించడంతో  వార్నర్ భాయ్‌ను కొనసాగించారు.  ఇక ప్రస్తుతం  భారత్‌తో జరిగే  డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు  ఈనెల 16 నుంచి  ఇంగ్లాండ్‌తో జరిగే యాషెస్ టెస్టులో రాణించడం  వార్నర్‌కు అత్యావశ్యకం.   ఇప్పటికే  క్రికెట్ ఆస్ట్రేలియా - డేవిడ్ వార్నర్ నడుమ  ఉప్పు-నిప్పుగా ఉన్న సంబంధాలు మరింత చెడిపోకుండా ఉండాలంటే వార్నర్‌కు రాబోయే  టెస్టు సిరీస్‌లు అత్యంత కీలకం.   


టీ20 వరల్డ్ కప్ తర్వాత గుడ్ బై..!


టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్న తర్వాత  వార్నర్.. పరిమిత  ఓవర్ల క్రికెట్‌కు కూడా గుడ్ బై చెప్తానని  చెప్పాడు.  2024  లో యూఎస్, వెస్టిండీస్ వేదికగా  పొట్టి ప్రపంచకప్ జరగాల్సి ఉంది.  ఇందులో ఆడి అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్ బై చెప్పాలనేది వార్నర్ ఆలోచన.  మరి సెలక్టర్లు అతడిని కొనసాగిస్తారా..? అనేది మిలియన్ డాలర్ల  ప్రశ్న. పరిమాత ఓవర్ల ఫార్మాట్ లో  వార్నర్..  142 వన్డేలు, 99 టీ20లు ఆడాడు.  వన్డేలలో  45 సగటుతో 6,030 పరుగులు చేసిన అతడు టీ20లలో 2,894 రన్స్ సాధించాడు. వన్డేలలో 19 సెంచరీలు చేసిన  వార్నర్.. టీ20లలో కూడా ఒక సెంచరీ చేశాడు.  


అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఇండియన్ ప్రీమియర్ ‌లీగ్ లో కూడా వార్నర్‌కు ఘనమైన రికార్డులే ఉన్నాయి.  2009 నుంచి  ఢిల్లీ, హైదరాబాద్ ఫ్రాంచైజీలకు ఆడిన వార్నర్..  176 మ్యాచ్‌లలో  6,397 పరుగులు సాధించాడు.   ఐపీఎల్‌లో ఆరు వేల పరుగులు  చేసిన బ్యాటర్లలో కోహ్లీ, ధావన్ తర్వాత స్థానం వార్నర్‌దే.