ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతోంది. భారత్‌పై ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో విజయం సాధించి గదను కూడా సొంతం చేసుకుంది. వరుసగా రెండో ఫైనల్లో కూడా భారత్‌కు నిరాశే ఎదురైంది. 2021 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన టీమిండియా, 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవి చూసింది. పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీల ఆకలి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఉన్న నాలుగు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న మొదటి జట్టుగా నిలిచింది.


తిరుగులేని ఆధిపత్యం
1987, 1999, 2003, 2007, 2015 సంవత్సరాల్లో ఆస్ట్రేలియా ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లను గెలుచుకుంది. 2006, 2009 సంవత్సరాల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. 2021లో అందని ద్రాక్షగా నిలిచిన టీ20 వరల్డ్ కప్‌ను కూడా దక్కించుకుంది. ఇప్పుడు 2023లో భారత్‌పై గెలిచి ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ విజేతగా కూడా నిలిచింది.


టీమిండియా ఇలా...
ఇక భారత్ విషయానికి వస్తే... 1983, 2011లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. 2007లో టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. 2002లో శ్రీలంకతో కలిసి ఛాంపియన్స్ ట్రోఫీని పంచుకుంది. కానీ 2013లో విజేతగా నిలిచింది. 2010, 2011, 2017, 2018, 2019 సంవత్సరాల్లో టెస్టు ఛాంపియన్ షిప్ గదను గెలుచుకుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో విజయం సాధిస్తే అన్ని ట్రోఫీలూ గెలుచుకున్న మొదటి జట్టుగా నిలిచేది.


మరోవైపు ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ గదను సొంతం చేసుకొనేందుకు నాలుగో ఇన్నింగ్స్‌లో 444 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమ్‌ఇండియా అందులో కనీసం ముప్పావు స్కోరైనా చేయలేదు. రెండో ఇన్నింగ్సులో 63.3 ఓవర్లు ఆడి 234 పరుగులకే ఆలౌటైంది. ఏకంగా 209 పరుగుల తేడాతో ఓడిపోయింది. విరాట్‌ కోహ్లీ (49; 78 బంతుల్లో 7x4), అజింక్య రహానె (46; 108 బంతుల్లో 7x4), రోహిత్‌ శర్మ (43; 60 బంతుల్లో 7x4, 1x6) టాప్‌ స్కోరర్లు. చెతేశ్వర్‌ పుజారా (27; 47 బంతుల్లో 5x4), శ్రీకర్ భరత్‌ (23; 41 బంతుల్లో 2x4) ఏదో మోస్తరు స్కోర్లు చేశారు.


ఆదివారం 'నమ్మకం' కాన్సెప్ట్‌తో బరిలోకి దిగింది టీమ్‌ఇండియా! చేతిలో 7 వికెట్లున్నాయి. క్రీజులో విరాట్‌ కోహ్లీ (44), అజింక్య రహానె (20) మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. విజయం సాధించాలంటే మరో 280 పరుగులు చేయాలి. ఇది చిన్న టాస్కేమీ కాదు! అలాగని ఆ స్థాయి ఆటగాళ్లు మన దగ్గర లేకపోలేదు! ఆఖరి రోజు ఒక్కటంటే ఒక్క సెషన్‌ వికెట్ నష్టపోకుండా ఆడుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో!


ఆఖరి రోజు ఓవర్‌ నైట్ స్కోరు 164/3తో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా 70 పరుగులైనా చేయలేదు. ఆట మొదలైన పావు గంటకే విరాట్‌ కోహ్లీ ఔటయ్యాడు. స్కాట్‌ బొలాండ్‌ దేహానికి దూరంగా విసిరిన బంతిని ఆడి స్లిప్‌లో స్టీవ్‌ స్మిత్‌ చేతికి చిక్కాడు. ఆడాలా వద్దా అన్న డౌట్‌తో ఆడి పెవిలియన్‌ చేరాడు. అప్పటికి స్కోరు 179/4. ఇదే పెద్ద షాక్‌ అనుకుంటే బంతి వ్యవధిలోనే రవీంద్ర జడేజా (0) ఔటవ్వడం గమనార్హం. కాస్త ఆఫ్సైడ్‌ వెళ్లిన బంతి జడ్డూ బ్యాటు అంచుకు తగిలి కీపర్‌ కేరీ చేతుల్లో పడింది. ఈ సిచ్యువేషన్లో జింక్స్‌, కేఎస్ భరత్ నిలదొక్కుకొనేందుకు ప్రయత్నించారు. అయితే జట్టు స్కోరు 212 వద్ద రహానెను స్టార్క్‌ ఔట్‌ చేశాడు. మరో పరుగుకే శార్దూల్‌ ఠాకూర్‌ (0) డకౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత భరత్‌, ఉమేశ్ (1), సిరాజ్‌ (1) ఔటవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు.