Australia Fielders With Most Catches In Test Cricket: లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) మ్యాచ్‌లో కంగారూ జట్టు విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఐదో రోజు ఆస్ట్రేలియా వెటరన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ స్లిప్‌లో విరాట్ కోహ్లీ ఇచ్చిన ముఖ్యమైన క్యాచ్ పట్టాడు. ఈ ఒక్క క్యాచ్‌తో ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ స్మిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు.


ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో, ఐదో రోజు ఆటలో బ్యాటింగ్‌కు వచ్చిన భారత జట్టు గెలవాలంటే మరో 280 పరుగులు చేయాల్సి ఉంది. విరాట్ కోహ్లి, అజింక్య రహానే కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఇంతలో స్కాట్ బోలాండ్ వేసిన బంతి ఆఫ్ స్టంప్ బయటకు వెళ్లింది. దాన్ని విరాట్ కోహ్లి కవర్ డ్రైవ్ ఆడబోగా అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ వైపు వెళ్లింది. స్టీవ్ స్మిత్ తన కుడివైపు గాలిలో డైవింగ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ పట్టాడు.


ఈ క్యాచ్‌తో స్టీవ్ స్మిత్ టెస్టు క్రికెట్‌లో తన 157 క్యాచ్‌లను కూడా పూర్తి చేశాడు. దీంతో ఆస్ట్రేలియా తరఫున ఈ ఫార్మాట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన మూడో ఆటగాడిగా నిలిచాడు. రికీ పాంటింగ్ 196 క్యాచ్‌లతో, మార్క్ వా 181 క్యాచ్‌లతో అతని కంటే ముందున్నారు.


భారత్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లోనూ స్టీవ్ స్మిత్ అద్భుతమైన బ్యాటింగ్ కూడా ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తరఫున స్టీవ్ స్మిత్ మొదటి ఇన్నింగ్స్‌లో 121 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. ట్రావిస్ హెడ్‌తో కలిసి 285 పరుగుల ముఖ్యమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచాడు. దీని ఆధారంగా ఆస్ట్రేలియా జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగుల స్కోరును అందుకోగలిగింది. రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్‌ 34 పరుగులు సాధించాడు.


ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ టైటిల్‌ను ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్లో భారత్‌పై 209 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియాకు రూ. కోట్లలో ప్రైజ్ మనీ వచ్చింది. ఓటమి పాలైనప్పటికీ భారత్‌కు భారీ మొత్తం లభించింది.


ఆస్ట్రేలియాకు ఈ విజయంతో దాదాపు రూ. 13.2 కోట్లు వచ్చాయి. అదే సమయంలో టీమ్ ఇండియా రూ.6.5 కోట్లు దక్కించకుంది. వీరితో పాటు టాప్ 9 జట్లకు కూడా మంచి మొత్తం దక్కింది. ఆదివారం లండన్‌లోని ఓవల్‌లో భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 2014 తర్వాత ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో భారత్‌కు ఇది నాలుగో ఓటమి.


ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ టైటిల్‌ను గెలుచుకున్న జట్టు కోసం ICC 1.6 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని ప్రకటించింది. దీని ప్రకారం ఆస్ట్రేలియాకు దాదాపు రూ. 13.2 కోట్లు వచ్చాయి. అదే సమయంలో ఫైనల్‌లో ఓటమి చవి చూసిన టీమిండియా దాదాపు రూ.6.5 కోట్లు దక్కించుకుంది.


ఇవి కాకుండా పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు రూ.3.72 కోట్లు వచ్చాయి. నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ రూ. 2.89 కోట్లు దక్కించుకుంది. ఐదో నంబర్‌లో ఉన్న శ్రీలంకకు రూ. 1.65 కోట్లు లభించాయి.