David Warner Record:  బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ ద్విశతకంతో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. అలాగే భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును ఒకటి వార్నర్ అందుకున్నాడు. 


మెల్ బోర్న్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ద్విశతకంతో మెరిశాడు. ఇది అతనికి వందో టెస్ట్. దాదాపు 3 సంవత్సరాల తర్వాత వార్నర్ టెస్టుల్లో మూడంకెల స్కోరును అందుకున్నాడు. ఈ ఫార్మాట్ లో అతనికిది 25వ సెంచరీ. ఈ శతకంతో వార్నర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును ఒకటి సమం చేశాడు. సచిన్ ఓపెనర్ గా ఆడుతూ 45 శతకాలు సాధించాడు. తను చేసిన 100 సెంచరీల్లో 45 ఓపెనర్ గా చేసినవే. అలాగే డేవిడ్ వార్నర్ కూడా వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో కలిపి ఓపెనర్ గా 45 శతకాలు బాదాడు. దీంతో టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. 


ఎంసీజీ గ్రౌండ్ లో ద్విశతకం బాదిన డేవిడ్ వార్నర్ అనేక రికార్డులను సమం చేశాడు. అలాగే కొన్ని రికార్డులను నెలకొల్పాడు. అవేంటో చూద్దామా...



  • వందో టెస్ట్ ఆడుతూ డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడు డేవిడ్ వార్నర్. ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ వార్నర్ కన్నా ముందున్నాడు. 

  • వందో టెస్టులో శతకం సాధించిన పదో ఆటగాడిగా నిలిచాడు. 

  • టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 

  • వందో టెస్టులో సెంచరీ చేసిన రెండో ఆస్ట్రేలియా ఆటగాడిగా వార్నర్ రికార్డ్. అతని కన్నా ముందు రికీ పాంటింగ్ ఉన్నాడు. 


బ్యాట్ తోనే సమాధానం


మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో దక్షిణాఫ్రికాతో టెస్టులో ఓపెనర్ గా దిగిన వార్నర్... డబుల్ సెంచరీని అందుకున్నాడు. నాణ్యమైన ప్రొటీస్ బౌలింగ్ ను ఎదుర్కొంటూ అతడు చేసిన ఈ ద్విశతకం ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచింది. టెస్టు జట్టులో నుంచి తీసేయాలంటూ వస్తున్న విమర్శలకు తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడీ విధ్యంసక బ్యాట్స్ మెన్. మొత్తం 254 బంతులు ఎదుర్కొని 200 పరుగులు చేశాడు. అందులో 16 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ ద్విశతకంతో అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్ ఆటగాడు జోరూట్ తర్వాత వందో టెస్టులో డబుల్ సెంచరీ బాదిన ప్లేయర్ గా గుర్తింపు పొందాడు.