AUS vs SA 2nd Test: క్రికెట్ లో నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న ఆటగాడు బౌలర్ బంతి వేయకముందే క్రీజు నుంచి బయటకు వచ్చినప్పుడు అతడిని బౌలర్ ఔట్ చేయడాన్ని మొన్నటివరకు మన్కడింగ్ అని పిలిచేవారు. దీనిపై చాలా విమర్శలు ఉన్నాయి. అలా ఔట్ చేయడం క్రికెట్ నిబంధనల ప్రకారం కరెక్టే అయినప్పటికీ.. క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ దానిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలే దానికి మన్కడింగ్ నుంచి రనౌట్ గా మార్చారు.
ఈ రనౌట్ కు కొందరు అభిమానులు, క్రికెట్ పండితులు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు మాత్రం ఇది అన్యాయమంటూ వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ బౌలర్ బంతి వేయకముందే నాన్ స్ట్రైకర్ క్రీజు దాటి అదనపు ప్రయోజనం పొందుతున్నాడనే దానిలో ఎంతో కొంత వాస్తవమైతే ఉంది. ఇప్పటికీ కొంతమంది బౌలర్లు బ్యాటర్ అలా మొదటిసారి క్రీజు దాటితే హెచ్చరించి వదిలేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఈరోజు ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచులో జరిగింది.
మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ మ్యాచ్ ఈరోజు ముగిసింది. ఈ టెస్టులో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్.. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న ప్రొటీస్ బ్యాటర్ డి బ్రూయిన్ ను హెచ్చరించాడు. తను బంతి వేయకముందే బ్రూయిన్ క్రీజు దాటటంతో బంతి వేయడం ఆపి అతడిని హెచ్చరించాడు. 'మీ క్రీజులో ఉండండి. అది అంత కష్టమైన పని కాదు' అని స్టార్క్ అతనితో అన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఆసీస్- సౌతాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్ వివరాలు
మెల్ బోర్న్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. బాక్సింగ్ డే టెస్టులో సౌతాఫ్రికా పై ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 3 టెస్టుల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తో కైవసం చేసుకుంది.
దక్షిణాఫ్రికా ఓటమి- భారత్ కు లాభం
ఆస్ట్రేలియాతో చేతిలో దక్షిణాఫ్రికా ఘోర ఓటమి భారత్ కలిసొచ్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ రేసులో సౌతాఫ్రికా వెనుకబడింది. ఈ భారీ విజయంతో ఆసీస్ దాదాపు ఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్నట్లే. ఇక ఈ ఓటమితో సౌతాఫ్రికా పాయింట్ల పట్టికలో 72 పాయిట్లంతో 54.55 శాతం నుంచి 50 శాతానికి పడిపోయింది. బంగ్లాదేశ్ పై విజయంతో టీమిండియా 99 పాయింట్లు సాధించింది. 58.93 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది.