భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తొలి రెండు మ్యాచుల్లో పరాజయం పాలై పాయింట్ల పట్టికలో చిట్టచివరన నిలిచింది. కానీ తర్వాతి రెండు మ్యాచుల్లో ఘన విజయం సాధించి ఇప్పుడు నాలుగో స్థానంలో కొనసాగుతోంది. టీమిండియా, దక్షిణాఫ్రికాతో ఘోర పరాజయం తర్వాత శ్రీలంక, పాకిస్థాన్ జట్లతో ఘన విజయం సాధించి మళ్లీ సెమీస్ రేసులోకి వచ్చింది. ఆటలో చివరి బంతి వరకు పోరాడడం ఆస్ట్రేలియాకు వెన్నతో పెట్టిన విద్య. ఓటమిని ఆస్ట్రేలియన్లు అంత తేలిగ్గా ఒప్పుకోరు. దానికి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనే ఘటనే నిదర్శనం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కంగారులు... వార్నర్, మార్ష్ విధ్వంసంతో 367 పరుగులను సాధించారు. అనంతరం పాక్‌కు కూడా అదిరే ఆరంభం లభించింది. పాక్ విజయం దిశగా సాగుతున్న వేళ జరిగిన ఓ ఆసక్తికర ఘటన... ఆసిస్ ఆటగాళ్లు గ్రౌండ్‌లో ఎంత చిత్తశుద్ధితో ఉంటారో తెలుపుతోంది.
ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నమెంట్‌లో ఫీల్డింగ్ చాలా ముఖ్యం. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ సులువైన మూడు క్యాచ్‌లను జారవిడిచి తగిన మూల్యం చెల్లించుకుంది. కానీ ఆస్ట్రేలియా పాక్‌కు అంత తేలిగ్గా పరుగులు ఇవ్వలేదు. మైదానంలో చురుగ్గా కదిలి పరుగులు చేసేందుకు పాక్ బ్యాటర్లు కష్టపడేలా చేసింది. కంగారు బ్యాటర్ స్టీవ్ స్మిత్ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు డైవ్ చేస్తూ ఓ బంతిని ఆపేశాడు. ఈ ప్రయత్నంలో స్మిత్ మోకాలికి గాయమై రక్తం కారింది. అది ప్యాంట్‌కు అంటుకుని బయటకు స్పష్టంగా కనిపించింది కూడా. కానీ స్టీవ్ స్మిత్ మైదానాన్ని వీడడానికి ఇష్టపడలేదు. మోకాలికి రక్తం కారుతున్నా అలాగే ఫీల్డింగ్ చేశాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 14వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు బంతిని ఆపేందుకు స్టీవ్ స్మిత్ డైవ్ చేశాడు. ఆ డైవ్ చేసే సమయంలో స్మిత్ మోకాలికి రక్తగాయమైంది. ఆయినా స్మిత్ ఆ నొప్పితో ఫీల్డింగ్ చేశాడు.
ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 62 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసి ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లు రెండు జట్లు 672 పరుగులు నమోదు చేశాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బౌలింగ్ తీసుకున్నాడు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్షల్ విధ్వంసంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. 368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆరంభంలో లక్ష్యం దిశగా పయనించింది. కానీ ఆసిస్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో పాక్ 305 పరుగులకే పరిమితమైంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయంతో ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. పాకిస్థాన్ అయిదో స్థానానికి పడిపోయింది.
డేవిడ్ వార్నర్ 140 బంతులుఎదుర్కొని 168 పరుగులు చేశాడు. 108 బంతులు ఎదుర్కొన్న మిచెల్ మార్ష్ 10 భారీ సిక్సులు, 9 ఫోర్లతో 121 పరుగులు చేశాడు. హరీస్ రౌఫ్ వేసిన తొమ్మిదో ఓవర్లో 24 పరుగులు పిండుకున్నారు. ఆ ఓవర్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సుతో 24 పరుగులు వచ్చాయి. అప్పటినుంచి ఆసిస్ బ్యాటింగ్ జెట్ స్పీడ్‌తో సాగింది. క్రీజులో కాస్త కుదురుకున్నాక విధ్వంసాన్ని మొదలుపెట్టిన ఈ ఇద్దరు ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 33 ఓవర్లపాటు వికెట్ పడకుండా బ్యాటింగ్ చేసి తొలి వికెట్‌కు 259 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.