World Cup Final 2023: క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్‌-ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ ఫైనల్‌(IND vs AUS Final 2023) మ్యాచ్‌ కోసం బీసీసీఐ(BCCI), ఐసీసీ(ICC) సంయుక్తంగా భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ మెగా టోర్నీని ఘనంగా ముగించడమే లక్ష్యంగా పకడ్బందీగా ఏర్పాట్లను చేస్తోంది. రేపు(ఆదివారం) భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తో పాటు ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్‌ మార్లెస్‌( Richard Marles )  కూడా అహ్మదాబాద్‌ మైదానానికి రానున్నారు. ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా వన్డే ప్రపంచకప్‌ గెలిచిన అన్ని జట్ల కెప్టెన్లను కూడా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కే ప్రత్యేక ఆకర్షణ నిలిచేలా ఇప్పటివరకు ప్రపంచకప్‌ గెలిచిన కెప్టెన్లందరినీ ఈ ఫైనల్‌ మ్యాచ్‌కు ఆహ్వానించింది. 1975 నుంచి 2019 వరకు ప్రపంచకప్‌ గెలిచిన అన్ని జట్లను ఈ తుదిపోరుకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. క్లైవ్‌ లాయిడ్‌, కపిల్‌ దేవ్‌, ధోనీ, అలెన్‌ బోర్డర్‌, స్టీవ్‌ వా, పాంటింగ్‌, మైకేల్‌ క్లార్క్‌, ఇయాన్‌ మోర్గాన్‌ సహా వరల్డ్‌ కప్‌ గెలిచిన కెప్టెన్లంతా మ్యాచ్ చూసేందుకు రానున్నారు. వీరి రాకతో ఫైనల్‌ మరింత ఘనంగా మారిపోనుంది. వీరికోసం ప్రత్యేకమైన బ్లేజర్‌ను బీసీసీఐ తయారు చేయించింది.


1975,1979లో ప్రపంచకప్‌ గెలిచిన వెస్టిండీస్‌ జట్టు నాయకుడు క్లైవ్ లాయిడ్ (live Lloyd), 1983లో తొలిసారి భారత్‌కు కప్పు అందించిన టీమిండియా కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌(Kapi Dev), 1987లో కంగారులకు తొలిసారిగా కప్పు అందించిన అలన్ బోర్డర్(Allen Border), 1996లో కప్పు అందించిన శ్రీలంకకు చెందిన అర్జున రణతుంగ(Arjun Ranatunga), 1999లో మరోసారి ఆస్ట్రేలియాకు కప్పు అందించిన స్టీవ్ వా(Steve Waugh), 2003, 2007లో టైటిల్‌ను అందించిన రికీ పాంటింగ్(Ricky Ponting ), 2011లో మరోసారి కప్పు అందించిన మహేంద్ర సింగ్‌ ధోనీ(MS. Dhoni), 2015లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ మైఖేల్ క్లార్క్(Michael Clarke), 2019లో తొలిసారి కప్పు అందించిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్(Eoin Morgan) (2019) ఈ మ్యాచ్ చూసేందుకు రానున్నారు. అయితే 1992లో పాకిస్థాన్‌ కప్పు కైవసం చేసుంది. అప్పటి కెప్టెన్‌గా ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌‌(Imran Khan)కు కూడా ఆహ్వానం వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మ్యాచ్‌ చూసేందుకు ఆయన రాలేరు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఇక ఫైనల్‌ మ్యాచ్ చూసే సమయంలో ఈ లెజెండరీ కెప్టెన్లంతా ఓ స్పెషల్‌ బ్లేజర్‌ ధరిస్తారని తెలుస్తోంది. అందుకోసం ఇప్పటికే బీసీసీఐ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. వీరితోపాటు అమితాబ్‌ బచ్చన్‌ (Amitab Bachchan)సహా.. ఎంతో మంది సెలబ్రెటీలు కూడా మ్యాచ్‌కు హాజరవుతారని సమాచారం.


 గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. 12 ఏళ్ల తర్వాత ఫైనల్‌ చేరిన భారత జట్టు.. పుష్కరకాల నిరీక్షణను తెరదించాలని, కప్పును సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న టైటిల్‌ పోరులో ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. కలను నెరవేర్చుకునేందుకు కేవలం ఒక్క అడుగు దూరంలో టీమిండియా ఉంది. భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా.... అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్లయినా ఆస్ట్రేలియన్లను మట్టికరిపించి ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. కోట్లాది మంది క్రికెట్‌ అభిమానుల కల తీర్చడానికి, ప్రపంచకప్‌ ట్రోఫీని ముచ్చటగా మూడోసారి ముద్దాడేందుకు టీమ్‌ఇండియా అడుగు దూరంలో ఉంది. ఈ టోర్నీలో అజేయంగా దూసుకెళ్తున్న రోహిత్‌ సేన సగర్వంగా ఫైనల్‌కు చేరింది. రేపు తుది పోరు జరగనుండగా ఈ మ్యాచ్‌ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు.. అహ్మదాబాద్‌కు పోటెత్తుతున్నారు.