Sydney Test Updates: అంతా అయిపోయింది.. భారత అభిమానులు ఏం జరగకూడదని కోరుకున్నారో.. అదే జరిగిపోయింది. తమ వైఫల్యంతో బ్యాటర్లు బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)ని పువ్వుల్లో పెట్టి మరీ ఆస్ట్రేలియాకు అప్పగించారు. పదేళ్లుగా టీమిండియా వద్దే భద్రంగా ఉన్న బీజీటీ.. తొలిసారిగా కంగారూ గడప తొక్కనుంది. సిడ్నీలో జరిగిన ఐదో టెస్టులో ఆసీస్ 6 వికెట్లతో ఘనవిజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 162 పరుగుల టార్గెట్ ను 27 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 162/4తో ఛేదించింది.
ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (45 బంతుల్లో 41, 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్లో బ్యాటర్లంతా సమష్టిగా రాణించడంతో ఆసీస్ బీజీటీని ఎగరేసుకుపోయింది. మ్యాచ్ లో పది వికెట్లు తీసిన బోలాండ్ కు ప్లేయర్ ఆప్ ద మ్యాచ్, సిరీస్ లో 32 వికెట్లు తీసిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
రెండో ఇన్నింగ్స్ లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ వేయని లోటు స్పష్టంగా కనిపించింది. భారత్ కేవలం ముగ్గురు పేసర్లతోనే అటాకింగ్ కు దిగి మూల్యం చెల్లించుకుంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ ను 3-1తో సొంతం చేసుకుంది. అలాగే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు దాదాపుగా చేరుకుంది. ఇక ఈ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. గత రెండు సార్లు ఫైనల్ కు చేరిన టీమిండియా, ఈసారి లీగ్ దశకే పరిమితమైంది.
7.5 ఓవర్లలో ఖేల్ ఖతం..
ఇక ఓవర్ నైట్ స్కోరు 141/6తో ఆదివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. 39.5 ఓవర్లలో 157 పరుగులకు కుప్పకూలింది. కేవలం ఏడు బంతుల్లోనే చివరి మూడు వికెట్లను భారత్ కోల్పోవడం గమనార్హం. తొలుత ఆట ప్రారంభమైన కాసేపటికే కీపర్ క్యాప్ ఇచ్చి రవీంద్ర జడేజా (13) ఔటయ్యాడు. దీంతో ఎనిమిదో వికెట్ కు నమోదైన 18 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కాసేపటికే వాషింగ్టన్ సుందర్ (12)ను కమిన్స్ బౌల్డ్ చేయడంతో భారత ఆశలకు తెరపడింది. మహ్మద్ సిరాజ్ (4)ను బోలాండ్ పెవలియన్ కు పంపగా, చివరి వికెట్ గా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా డకౌటయ్యాడు. అతడిని కూడా బోలాండే బలిగొన్నాడు. దీంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్ 4 పరుగుల ఆధిక్యం కలుపుకుని ఆసీస్ కు 162 పరుగుల టార్గెట్ ను భారత్ నిర్దేశించింది. బౌలర్లలో బోలాండ్ (6/45) భారత పతనాన్ని శాసించాడు. కమిన్స్ కు మూడు వికెట్లు దక్కాయి. బ్యూ వెబ్ స్టర్ ఒక వికెట్ తీశాడు.
అదిరే ఆరంభం..
పిచ్ పై నెమ్మదిగా ఆడితే మొదటికే మోసం వస్తుందని డిఫరెంట్ గేమ్ ప్లాన్ తో వచ్చిన ఆసీస్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. బుమ్రా బౌలింగ్ లో లేకపోవడం కూడా వారికి కలిసొచ్చింది. శామ్ కొన్ స్టాస్ (17 బంతుల్లో 22, 3 ఫోర్లు) వేగంగా ఆడి భారత బౌలర్ల లయను దెబ్బ తీశాడు. అతను ఔటైన తర్వాత మార్నస్ లబుషేన్ (6), స్టీవెన్ స్మిత్ (4) వికెట్లను తీసిన భారత్ మ్యాచ్ పై ఆశలను రేకెత్తించింది. అయితే ఓ ఎండ్ లో స్థిరంగా నిలబడిన ఖవాజా.. ట్రావిస్ హెడ్ (34 నాటౌట్) సాయంతో నాలుగో వికెట్ కు కీలకమైన 46 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొలప్పాడు. ఆఖరికి ఖవాజాను సిరాజ్ ఔట్ చేసినా, బ్యూ వెబ్ స్టర్ (39 నాటౌట్) తో కలసి హెడ్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు. వీరిద్దరూ కలిసి అబేధ్యమైన ఐదో వికెట్ కి 58 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ మూడు వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్ కు ఒక వికెట్ దక్కింది.