Asia Cup 2023: ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలై దాదాపు వారం గడిచిపోయినా.. అంతకంటే ముందే ఆరు దేశాలు  పాల్గొనే ఆసియా కప్ షెడ్యూల్ పై క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్ - పాకిస్తాన్ జట్లు మూడు సార్లు (ఇరు జట్లు ఫైనల్ చేరితే)  తలపడే ఈ క్రేజీ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ గురించి  ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ వారాంతంలో గానీ వచ్చే వారం ప్రారంభంలో గానీ ఆసియా కప్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. 


ఇదే విషయమై  బీసీసీఐ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ఆసియా కప్ షెడ్యూల్  లో కొన్ని లాస్ట్ మినట్ ఛేంజెస్  పూర్తయ్యాయి.  ముసాయిదా షెడ్యూల్ ను ఇప్పటికే సభ్య దేశాలకు షేర్ చేశారు.  ఈ వారాంతం లేదా వచ్చేవారం ఆరంభంలో పూర్తి స్థాయి  షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది..’ అని చెప్పాడు. 


ఇండియా - పాక్ మ్యాచ్ తోనే అసలు సమస్య.. 


ఆసియా కప్ లో ఇతర మ్యాచ్ ల సంగతి ఎలా ఉన్నా  ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ గురించే అసలు చర్చ అంతా..  అన్నీ కుదిరి  భారత్, పాక్ లు  ఈ టోర్నీలో ఫైనల్ చేరితే  దాయాదులు 15 రోజుల వ్యవధిలో  మూడు సార్లు తలపడతారు.  హైబ్రిడ్ మోడల్ ప్రకారం.. భారత్ మ్యాచ్ లు  అన్నీ శ్రీలంకలో జరుగనున్నాయి. అయితే శ్రీలంకో ఆగస్టు - సెప్టెంబర్ వర్షాలు అధికంగా కురుస్తాయి.  లంకలో కొలంబో వేదికగా ఈ రెండు జట్ల మధ్య  మ్యాచ్ ను నిర్వహిస్తే  అది  వర్షార్పణం అయితే  అది ఇరు జట్ల అభిమానులతో పాటు ఏసీసీకి రెవెన్యూ పరంగా కూడా  తీరని నష్టం.  అందుకే  కొలంబో కాకుండా దంబుల్లా వేదిక అయితే  ఎలా ఉంటుందనే విషయంలో   క్లారిటీ రావాల్సి ఉంది. 


ఆగస్టు 31 నుంచి  సెప్టెంబర్ 17 వరకూ   పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ నిర్వహిస్తామని ఏసీసీ ఇదివరకే తెలిపింది. పాకిస్తాన్ లో నాలుగు మ్యాచ్ లు,  శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్ లు  జరుగనున్నాయి. పాక్ లో నాలుగు మ్యాచ్ లు ముగిసిన తర్వాత టోర్నీ నేరుగా లంకకు షిఫ్ట్ అవనుంది.  డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో లంక.. స్వదేశంలో   టోర్నీని ఆడనుండటం ఆ జట్టుకు లాభించేదే.  ఆరు దేశాలతో  ఈ టోర్నీ జరుగనుంది. 


ఆసియా కప్ లో పాల్గొనబోయే ఆరు దేశాలు : 


- భారత్
- పాకిస్తాన్ 
- నేపాల్ 
- శ్రీలంక 
- బంగ్లాదేశ్ 
- అఫ్గానిస్తాన్ 


 






ఈ ఏడాది భారత్ లో వన్డే వరల్డ్ కప్ జరగాల్సి ఉన్నా  దానికంటే   ఎక్కువగా గడిచిన 9 నెలలుగా ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ వర్గాలలో ఆసియా కప్ గురించే  చర్చ జరిగింది. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల ఆరోపణలు, ప్రత్యారోపణలు,  కౌంటర్లు, విమర్శలతో అసలు ఈ టోర్నీ జరుగుతుందా..? లేదా..? అన్నది  అనుమానంగానే మారింది. కానీ ఎట్టకేలకు హైబ్రిడ్ మోడల్  అంటూ  పీసీబీ తీసుకొచ్చిన ప్రతిపాదనకు  బీసీసీఐతో పాటు  ఏసీసీ కూడా అంగీకారం తెలిపింది. ఇటీవలే పాకిస్తాన్  క్రికెట్ బోర్డు (పీసీబీ) కాబోయే ఛైర్మన్ నజమ్ సేథీ కూడా  ఆసియా కప్ లో హైబ్రిడ్ మోడల్ ను వ్యతిరేకించినా   తర్వాత  మాట మార్చి  అది తన వ్యక్తిగత అభిప్రాయమని  కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial