Tilak Varma Asia cup 2023: 


నేరుగా ఆసియాకప్‌లో అరంగేట్రం చేయడం కలగా అనిపిస్తోందని టీమ్‌ఇండియా యువ కెరటం తిలక్‌ వర్మ అంటున్నాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎప్పుడూ తన వెన్నంటే ఉన్నాడని పేర్కొన్నాడు. ఐపీఎల్‌ ఆరంభంలో ఆందోళన చెందానని తెలిపాడు. అప్పుడు రోహిత్‌ శర్మే తనతో మాట్లాడి భయం పోగొట్టాడని వివరించాడు. ఆసియాకప్‌కు ఎంపికైన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.


'రోహిత్‌ భయ్య నన్నెంతో ప్రోత్సహించాడు. నాకు అండగా నిలిచాడు. ఐపీఎల్‌ సమయంలోనూ అంతే. మొదట్లో కొంత నర్వస్‌గా అనిపించింది. అప్పుడు నా దగ్గరికి వచ్చి ఆట గురించి మాట్లాడాడు. క్రికెట్‌ను ఎంజాయ్‌ చేయాలని చెప్పాడు. ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించమని చెప్పాడు. ఎప్పుడు మాట్లాడాలని అనిపించినా రమ్మన్నాడు. చిన్న సందేశం పంపించినా అందుబాటులోకి వస్తానని మాటిచ్చాడు. మాట్లాడిన ప్రతిసారీ ఆటను ఆస్వాదించాలనే చెప్పేవాడు. నేనిప్పుడు అదే చేస్తున్నాను' అని తిలక్‌ వర్మ అన్నాడు. అతడు మాట్లాడిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో పోస్టు చేసింది.


'నేరుగా ఆసియాకప్‌లో అరంగేట్రం చేస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. అదీ వన్డేల్లో అస్సలు ఊహించలేదు. టీమ్‌ఇండియాకు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాలని నేనెప్పుడూ కలగంటాను. ఒకే ఏడాదిలో టీ20, వన్డేల్లో ఆడుతున్నాను. ఆసియాకప్‌నకు పిలుపు రావడంతో కల నిజమైంది. మెగా టోర్నీకి నేను సిద్ధమవుతున్నాను' అని తిలక్‌ వర్మ అన్నాడు.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో తిలక్‌ వర్మ మెరుపులు మెరిపించాడు. 2022లో టోర్నీలో అరంగేట్రం చేశాడు. 14 మ్యాచుల్లో 36.09 సగటు, 131 స్ట్రైక్‌రేట్‌తో 397 పరుగులు చేశాడు. ఇక 2023లలో 11 మ్యాచుల్లో 42.88 సగటు, 164 స్ట్రైక్‌రేట్‌తో 343 పరుగులు చేశాడు. మిడిలార్డర్లో ముంబయి ఇండియన్స్‌కు వెన్నెముకగా మారాడు. అతడు క్రీజులోకి వచ్చిన ప్రతిసారీ వేగంగా పరుగులు చేశాడు. లెఫ్ట్‌ హ్యాండర్‌ కావడం, దూకుడుగా ఆడటంతో అతడి టీమ్‌ఇండియాలో అవకాశం వచ్చింది.


వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీసులో తిలక్‌ వర్మ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆడిన ప్రతి మ్యాచులోనూ తన పరిణతి, పట్టుదలతో మెప్పించాడు. 57.66 సగటు, 139 సగటుతో 173 పరుగులు చేశాడు. ఐర్లాండ్‌లో మాత్రం ఇంకా తన స్థాయి ఇన్నింగ్స్‌ ఆడలేదు. బౌలింగ్‌ చేయగలగడం, ఫీల్డింగ్‌లో చురుగ్గా ఉండటం, బ్యాటింగ్‌లో అదరగొట్టడంతో సెలక్షన్‌ కమిటీ అతడికి వన్డేల్లో చోటిచ్చింది. అవసరాన్ని బట్టి 4, 5 స్థానాల్లో అతడిని ఆడించే అవకాశం ఉంది.


భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమి, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ప్రసిద్ధ్‌ కృష్ణ


రిజర్వు ఆటగాడు: సంజూ శాంసన్‌