Asia Cup 2023 Team India Squad:


ఆసియాకప్‌ 2023కి టీమ్‌ఇండియాను ఎంపిక చేశారు. రిజర్వు ఆటగాడితో కలిపి 18 మంది పేర్లను ప్రకటించారు. గాయాలతో సుదీర్ఘ కాలం దూరమైన కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ మెగా టోర్నీలో పునరాగమనం చేస్తున్నారు. హైదరాబాదీ యువకెరటం, టీ20 క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్న తిలక్‌ వర్మకు చోటు దక్కింది. అతడు వన్డేల్లో ఇప్పటి వరకు అరంగేట్రం చేయకపోవడం గమనార్హం. ఫాస్టు బౌలర్లు జస్ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ టోర్నీకి ఎంపికయ్యారు.


చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ సోమవారం దిల్లీలో సమావేశమైంది. ఫిట్‌నెస్‌ రిపోర్టులు పరిశీలించిన తర్వాత కమిటీ జట్టును ప్రకటించింది. ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌లోనూ దాదాపుగా వీళ్లూ ఉంటారని సంకేతాలు ఇచ్చింది. వన్డేల్లో ఇప్పటి వరకు అరంగేట్రం చేయని తిలక్‌ వర్మను ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. లెఫ్ట్‌ రైట్‌ కాంబినేషన్లో అతడు కీలకం కానున్నాడు. జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, ప్రసిద్ధ్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌ పేస్‌ అటాక్‌లో కీలకం. ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్య, శార్దూల్‌ ఠాకూర్‌ వీరికి సాయంగా ఉంటారు.


అనుభవజ్ఞుడైన లెగ్ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కలేదు. మరో మణికట్టు మాంత్రికుడు కుల్‌దీప్‌ యాదవ్‌పై సెలక్షన్‌ కమిటీ నమ్మకం ఉంచింది. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ స్పిన్‌ డిపార్ట్‌మెంట్లో కీలకం కానున్నారు. ఆఫ్‌ స్పిన్నర్‌కు చోటివ్వకపోవడం సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. రెండో వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌కు చోటు లభించింది. సంజూ శాంసన్‌ను కాదని సెలక్టర్లు అతడికే ఓటేశారు. అయితే కేఎల్‌ రాహుల్‌ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో సంజూను రిజర్వు ప్లేయర్‌గా తీసుకున్నారు.


'మేం 18 మందిని ఎంపిక చేశాం. ప్రపంచకప్‌లోనూ దాదాపుగా వీళ్లే ఉంటారు. గాయాల నుంచి కోలుకొని కొందరు కీలక ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. వాళ్లు అంచనాలు అందుకుంటారని మా విశ్వాసం. ఆసియాకప్‌లో వారికి కొన్ని మ్యాచులు దొరుకుతాయి. ఐసీసీ ప్రపంచకప్‌నకు ముందు చిన్న క్యాంప్‌ ఏర్పాటు చేస్తాం. ఏదేమైనా అప్పుడూ ఈ ఆటగాళ్లే ఉంటారు' అని అజిత్‌ అగార్కర్‌ అన్నాడు.


'కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ రిహాబిలిటేషన్‌ నుంచి వస్తున్నారు. కొన్నాళ్ల క్రితం వీరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రేయస్‌ 100 శాతం ఫిట్‌గా ఉన్నాడు. రాహుల్‌కు చిన్న గాయం ఉంది. అసలైంది కాదు. అందుకే సంజూను రిజర్వు ఆటగాడిగా తీసుకున్నాం. ఏదో ఒక దశలో అతడి ఫిట్‌నెస్‌ రిపోర్టు వస్తుంది. ఆ లోపు అతడి పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధిస్తాడని మేం ఆశిస్తున్నాం. ఆరంభంలో లేకున్నా రెండు, మూడు మ్యాచుల ముందే ట్రాక్‌లోకి వస్తాడు. శ్రేయస్‌ 100 శాతం ఫిట్‌గా ఉండటం గుడ్‌ న్యూస్‌' అని అగార్కర్‌ పేర్కొన్నాడు.


ఆటగాళ్లు ఏదో ఒక స్థానానికి పరిమితం కావొద్దని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పిలుపునిచ్చాడు. ఏ స్థానంలో పంపించినా ఆడాలని సూచించాడు. 'జట్టుకు ఫ్లెక్సిబిలిటీ అవసరం. అందరూ అన్ని స్థానాల్లో ఆడాల్సి ఉంటుంది. నేనీ స్థానంలో బాగా ఆడతాను, ఆ స్థానంలో బాగా ఆడతాను అని చెప్పొద్దు. ప్రతి ఒక్కరికీ మేమిదే సందేశం పంపించాం. 3-4 ఏళ్ల నుంచీ ఇలాగే చెబుతున్నాం. ఆరో స్థానంలో వచ్చే బ్యాటర్‌ నాలుగులో ఎందుకు ఆడుతున్నాడో బయట ఉన్నవాళ్లు అర్థం చేసుకోకపోవచ్చు. ఒకర్ని ఒక చోటే ఆడించి జట్టును హ్యాండీక్యాప్డ్‌ చేయలేం. ఓపెనింగ్‌ నుంచి ఎనిమిది వరకు ఎవరైనా ఆడొచ్చు' అని హిట్‌మ్యాన్‌ స్పష్టం చేశాడు.


ఆసియాకప్‌ ఈ నెల 30 నుంచి మొదలవుతుంది. పాకిస్థాన్‌, శ్రీలంకలో మ్యాచులు జరుగుతున్నాయి. భారత్‌ అన్ని మ్యాచులను శ్రీలంకలోనే ఆడుతుంది. సెప్టెంబర్‌ 2న పల్లెకెలెలో టీమ్‌ఇండియా పాకిస్థాన్‌తో తలపడుతుంది.


భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమి, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ప్రసిద్ధ్‌ కృష్ణ


రిజర్వు ఆటగాడు: సంజూ శాంసన్‌