Shaheen Afridi vs Babar Azam: ఆసియా కప్ - 2023లో   సూపర్ - 4లోనే నిష్క్రమించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టులో అలజడి. ఆ జట్టు సారథి బాబర్ ఆజమ్, స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిది మధ్య  డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర వాగ్వాదం జరిగినట్టు పాకిస్తాన్ మీడియా కోడై కూస్తున్నది.   మూడు రోజుల క్రితం శ్రీలంకతో జరిగిన  మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఓడిన పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి  డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడుతుండగా ఈ గొడవ జరిగినట్టు సమాచారం. 


ఏం జరిగింది..? 


లంకతో మ్యాచ్‌లో  గెలుపు దగ్గరిదాకా వచ్చి ఆఖరి బంతికి  ఓడింది పాకిస్తాన్. మ్యాచ్ ముగిసిన తర్వాత  డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టు ప్రదర్శనను ఉద్దేశించి మాట్లాడుతూ కాస్త ఘాటుగానే స్పందించాడట.  ఈ టోర్నీలో  కొందరు కీలక ఆటగాళ్ల ప్రదర్శన స్థాయికి తగ్గట్టుగా లేదని ఇది ఇలాగే కొనసాగితే   వారిని సాగనంపే దిశగా నిర్ణయాలుంటాయని బాబర్ వ్యాఖ్యానించాడు. ‘మీరు ఇలాగే ఆడితే  త్వరలోనే జట్టు నుంచి చోటు కోల్పోతారు.  వరల్డ్ కప్ మీకు ఆఖరి ఛాన్స్.. తీరు మార్చుకోకుంటే  మీరు మారుతారు’ అని  కరాఖండీగా చెప్పేశాడట. వ్యక్తిగతంగా కూడా కొంతమంది ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ  వారిపై పరుష పదజాలంతో  విరుచుకుపడ్డట్టు సమాచారం. 


బాబర్ మాట్లాడుతుండగానే షహీన్  మధ్యలో కల్పించుకుని..  ‘బాగా బౌలింగ్, బ్యాటింగ్ చేసినవారిని  మెచ్చుకుంటే బాగుంటుంది కదా..’అని చెప్పాడట. అప్పటికే ఆగ్రహంగా ఉన్న బాబర్  తాను మాట్లాడుతుండగా  డిస్ట్రబ్ చేసిన షహీన్ పట్ల మరింత  కోపంతో.. ‘ఎవరు  బాగా ఆడుతున్నారు..? ఎవరు ఆడటం లేదు..? అనేది నాకు తెలుసు. నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు’ అని  బదులిచ్చాడట..  ఇది షహీన్‌కు కూడా ఆగ్రహాన్ని కల్పించి  అతడు కూడా తన స్వరాన్ని సవరించుకుని  కెప్టెన్‌కు ఎదురెళ్లాడట.. అయితే  వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఇద్దరికీ సర్ధి చెప్పి  ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించినట్టు   పాక్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.  ఆసియా  కప్ నుంచి నిష్క్రమించిన తర్వాత పాక్ ఆటగాళ్లు  జాలీగా  హోటల్‌ను వీడుతుంటే బాబర్ మాత్రం నిరాశగా  అక్కడ్నుంచి వెళ్తున్న విజువల్స్ ఈ అనుమానాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. 


 






ఒత్తిడిలో బాబర్.. 


పాక్ సారథిపై కొంతకాలంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ2‌0లలో అతడి ఆటతీరు, కెప్టెన్సీ, మెగా టోర్నీలలో వైఫల్యం అతడిని వేలెత్తి చూపే దిశగా మార్చాయి.  గత రెండు టీ20 వరల్డ్ కప్‌లలోనూ  సెమీస్ చేరినా  పాకిస్తాన్ కప్ మాత్రం కొట్టలేకపోయింది. అదీగాక స్వదేశంలోనే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో టెస్టు సిరీస్‌లలో ఓడింది.  గతేడాది ఆసియా కప్ ఫైనల్‌కు చేరినా లంక చేతిలో ఓడింది.  తాజాగా  సూపర్ - 4 దశలోనే నిష్క్రమించడం, భారత్‌తో మ్యాచ్‌లో దారుణ పరాజయంతో బాబర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు.  బ్యాటింగ్ పరంగా వన్డేలలో వరల్డ్ నెంబర్ వన్ హోదాను అనుభవిస్తున్నా ఇటీవల కాలంలో అతడు  అగ్రశ్రేణి జట్లపై ‘వా’ అనిపించిన ప్రదర్శనలైతే కాదు. నేపాల్, అఫ్గాన్, జింబాబ్వే వంటి జట్లపై  మాత్రం బాబర్ చెలరేగి ఆడతాడు.  సోషల్ మీడియాలో  బాబర్‌ను చాలామంది ‘జింబాబర్’ అని కూడా అంటారు.  


 






నసీమ్ షా ఔట్.. 


వరల్డ్ కప్ ముందున్న నేపథ్యంలో పాక్ జట్టులో  ఐక్యత కోల్పోయే దిశగా  ఇలాంటి గొడవలు  కావడం  అది జట్టు ప్రదర్శన మీద ప్రభావం చూపేదే. అసలే ఆసియా కప్‌లో నసీమ్ షా, హరీస్ రౌఫ్, అఘా సల్మాన్‌లకు గాయాలై జట్టు సతమతమవుతుండగా తాజాగా ఈ వివాదం పాక్ క్రికెట్‌ను మరింత కుదిపేసేదే.  తాజా రిపోర్డుల ప్రకారం ఆసియా కప్‌లో భుజం గాయమై దుబాయ్‌లో ఉన్న నసీమ్  కోలుకోవడానికి కనీసం మూడు నాలుగు నెలలైనా పట్టే అవకాశం ఉందని తెలుస్తున్నది. దీంతో అతడు వరల్డ్ కప్ మొత్తానికి దూరం కానున్నాడు.   మరి ఈ గండం నుంచి పాకిస్తాన్ ఎలా గట్టెక్కుతుంది..? వరల్డ్ కప్‌లో ఎలా ఆడుతుందనేది  ఆసక్తికరంగా మారింది. 












ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial