Asia Cup 2023 Final: ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్ 16వ ఎడిషన్ కాగా ఇందులో ఏకంగా 12వ సారి లంక ఫైనల్ ఆడుతుందంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ జట్టుకు ఈ టోర్నీ అంటే ఎంత క్రేజో... ఇతర టోర్నీలు, వరల్డ్ కప్‌లు, ద్వైపాక్షిక సిరీస్‌లలో విజయాల సంగతి ఎలా ఉన్నా ఆసియా కప్ వచ్చిందంటే మాత్రం శ్రీలంకలోని అత్యుత్తమ ఆట బయటకు వస్తుంది. అప్పటిదాకా స్లీప్ మోడ్‌లో ఉండే లంకేయులు ఒక్కసారిగా ఫుల్ యాక్టివేట్ మోడ్‌కు వచ్చేస్తారు. గతేడాది ఆ జట్టు ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది అయితే కీలక ఆటగాళ్లు నలుగురు మిస్ అయినా దాదాపు బౌలింగ్‌లో సెకండ్ స్ట్రింగ్ బౌలర్లతో ఆడుతున్నా ఆ జట్టు ఫైనల్‌కు చేరిందంటేనే లంకేయుల పట్టుదలను అర్థం చేసుకోవచ్చు.
1984 నుంచి మొదలైన ఆసియా కప్‌లో శ్రీలంక ఫైనల్ చేరని సందర్భాలు మూడంటే మూడు మాత్రమే. అది 2012, 2016, 2018లలో.. మిగిలిన ప్రతి ఎడిషన్‌లోనూ లంక లేని ఆసియా కప్ ఫైనల్ లేదు. గతేడాది అయితే ఆసియా కప్ ఆతిథ్య హక్కులు ఉన్నప్పటికీ లంకలో తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తి టోర్నీని నిర్వహించేందుకు డబ్బులు లేక యూఏఈలో దీనిని నిర్వహించారు. శనక సారథ్యంలోని లంక అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫైనల్ చేరడమే గొప్ప అనుకుంటే ఏకంటా ట్రోఫీని సొంత దేశానికి తీసుకెళ్లింది.
ఆసియా కప్‌లో లంకను తేలికగా తీసుకుంటే భారత్‌కు తిప్పలు తప్పవు. ఈ విషయం మనకు ఇదివరకే సూపర్ - 4లో చాలా గట్టిగానే తెలిసొచ్చింది. కొలంబోలోని స్పిన్ పిచ్‌పై ప్రపంచ శ్రేణి భారత బ్యాటర్లందరూ లంక వేసిన స్పిన్ ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడారు. పదికి పది వికెట్లు స్పిన్నర్లకే దక్కాయి. నేటి మ్యాచ్‌లో కూడా స్పిన్‌ను ధీటుగా ఎదుర్కోకుంటే భారత్‌కు షాకిచ్చేందుకు లంక ఏ చిన్న అవకాశాన్ని కూడా కోల్పోదు.
వీరి ఆట కీలకం..
- స్టార్ ఆటగాళ్లు లేకపోయినా లంక ఇప్పటికీ ప్రమాదకరమే. ఓపెనర్లలో పతుమ్ నిస్సంక, వన్ డౌన్‌లో వచ్చే కుశాల్ మెండిస్, మిడిలార్డర్‌లో సమరవిక్రమ, చరిత్ అసలంక చాలా కీలకం. ఆసియా కప్ - 2023లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో మెండిస్ (253), సమరవిక్రమ (215) లు రెండు, మూడు స్థానాలలో నిలిచారు. నిస్సంక కూడా ధాటిగా ఆడగల సమర్థుడు. ఈ ముగ్గురూ నిలదొక్కుకుంటే భారత్‌కు కష్టాలు తప్పవు. సమరవిక్రమ మిడిలార్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. కుశాల్.. అఫ్గాన్, పాకిస్తాన్‌పై 90 ప్లస్ స్కోర్లు చేసి తృటిలో సెంచరీలు కోల్పోయాడు. ఈ ముగ్గురినీ ఎంత త్వరగా ఔట్ చేస్తే భారత్‌కు అంతమంచిది.
- లంకలో 8వ నెంబర్ వరకూ బ్యాటింగ్ చేయగల సమర్థులు ఉన్నారు. మిడిలార్డర్‌లో అసలంక, ధనంజయ డిసిల్వతో పాటు కెప్టెన్ దసున్ శనకలు బ్యాటింగ్‌లో కుదురుకుంటే భారీ స్కోర్లు చేయగలరు. ఇక 20 ఏండ్ల ఆల్ రౌండర్ దునిత్ వెల్లలాగె భారత్‌తో మ్యాచ్‌లో తొలుత ఐదు వికెట్లు పడగొట్టి ఆ తర్వాత బ్యాటింగ్‌లో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
- వెల్లలాగె బౌలింగ్ పట్ల కూడా భారత్ అప్రమత్తంగా ఉండాలి. స్పిన్‌కు అనుకూలిస్తున్న కొలంబో పిచ్‌పై మొన్నటి మ్యాచ్‌లో ఈ కుర్రాడు రోహిత్, గిల్, కోహ్లీ, కెఎల్ రాహుల్ వంటి స్టార్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. బౌలింగ్‌లో వెల్లలాగె తో పాటు భారత్.. యువ పేసర్ మతీశ పతిరన పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. తనదైన యార్కర్లతో రెచ్చిపోతున్న ఈ యువ సంచలనం మలింగను మరిపించే పనిలో ఉన్నాడు. తనదైన యార్కర్లతో రెచ్చిపోతున్న ఈ కుర్రాడిని అడ్డుకోవడం భారత బ్యాటర్లకు సవాల్ వంటిదే.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial