Asia Cup 2023, Sri Lanka, Pakistan: ఆసియా కప్ 2023 టోర్నమెంట్ ఈ మధ్యకాలంలో నిరంతరం ముఖ్యాంశాలలో ఉంటుంది. టోర్నీ కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు భారత్ నిరాకరించింది. అటువంటి పరిస్థితిలో, తటస్థ వేదిక ఎంపిక తెరపైకి వచ్చింది. ఇప్పుడు వినిపిస్తున్న కథనాల ప్రకారం శ్రీలంక రాబోయే ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వవచ్చని తెలుస్తోంది. టోర్నీని పాకిస్థాన్ నుంచి మార్చేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సిద్ధమైంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ వెళ్లబోదని బీసీసీఐ సెక్రటరీ జై షా ఇప్పటికే స్పష్టం చేశారు.


ఈ నెలాఖరులోగా టోర్నీ వేదికపై తుది నిర్ణయం తీసుకోవచ్చు. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు ఈవెంట్‌ను వేదిక మార్పునకు మద్దతు ఇస్తాయని భావిస్తున్నారు. టోర్నమెంట్‌లో పాకిస్థాన్ పాల్గొనడంపై ఇప్పటికీ అస్పష్టత ఉంది. ఈ ఈవెంట్‌ను పాకిస్తాన్ బహిష్కరించవచ్చని వార్తలు వస్తున్నాయి. టోర్నీని స్వదేశంలో నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తి చూపుతోంది. ఏసీసీలోని ఇతర సభ్య దేశాల నుంచి బీసీసీఐకి మద్దతు లభిస్తోంది. ప్రస్తుతానికి ఈ నిర్ణయం లాంఛనప్రాయంగా కనిపిస్తోంది.


ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ లేకపోవడంతో టోర్నమెంట్ కోసం పాకిస్తాన్‌కు వెళ్లడానికి బీసీసీఐ నిరాకరించిన తరువాత పీసీబీ ఆసియా కప్‌ను నిర్వహించడానికి హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదించింది. భారతదేశం ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహిస్తారు. సెప్టెంబర్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చాలా వేడిగా ఉంటుంది. ఇటీవల జరిగిన ఏసీసీ సభ్యుల అనధికారిక సమావేశంలో ఒమన్ కూడా టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రతిపాదించింది. అయితే పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని శ్రీలంకను వేదికగా పరిగణించారు.


త్వరలో నిర్ణయం
విపరీతమైన వేడిలో ఆటగాళ్లను ప్రమాదంలో పడేసేందుకు జట్లు సిద్ధంగా లేవు. మరోవైపు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చేందుకు శ్రీలంక క్రికెట్ ఆసక్తి చూపింది. రాబోయే వారాల్లో ఏసీసీ తుది నిర్ణయానికి రానుంది. శ్రీలంక ఆసియా కప్ 2023 నిర్వహిస్తే దంబుల్లా, పల్లెకెలె వేదికలుగా ఉండవచ్చు. కొలంబోలో సాధారణంగా సెప్టెంబర్‌లో వర్షాలు ఎక్కువగా పడతాయి. ఇది వచ్చే ప్రపంచకప్‌పై ప్రభావం చూపుతుంది. 


మరో వైపు నేపాల్‌ క్రికెట్‌ టీమ్‌ అద్భుతం చేసింది! చరిత్రలో తొలిసారి ఆసియాకప్‌కు (Asia Cup 2023) అర్హత సాధించింది. ఏసీసీ మెన్స్‌ ప్రీమియర్‌ కప్‌ 2023 విజేతగా అవతరించింది. ఫైనల్లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ జట్టును చిత్తు చేసింది. ఆసియాకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ గ్రూప్‌లో చేరింది.


కీర్తిపుర్‌లోని త్రిభువన్‌ యూనివర్సిటీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ మైదానంలో మెన్స్‌ ప్రీమియర్‌ కప్‌ ఫైనల్‌ జరిగింది. వర్షం రావడంతో ఈ మ్యాచు రెండు రోజుల పాటు నిర్వహించారు. మొదట బ్యాటింగ్‌ చేసిన యూఏఈ 33.1 ఓవర్లకు 117 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్‌లో నేపాల్‌ మొదట తడబడింది. 22 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకున్న పరిస్థితుల్లో గుల్షన్ ఝా (67*; 84 బంతుల్లో 3x4, 5x6) అదరగొట్టాడు. అతడికి భీమ్‌ షక్రీ (36*; 72 బంతుల్లో 4x4) అండగా నిలిచాడు. 30.3 ఓవర్లకు టార్గెట్‌ ఛేదించి రికార్డు సృష్టించారు. తొలిసారి నేపాల్‌ను ఆసియాకప్‌కు తీసుకెళ్లారు.


ఈ విజయంతో భారత్‌, పాకిస్థాన్‌ ఉన్న గ్రూప్‌-ఏలోకి నేపాల్‌ వచ్చింది. సెప్టెంబర్లో దాయాది దేశాలతో తలపడనుంది. ఆసియా మెన్స్‌ ప్రీమియర్‌ టోర్నీలో ఓడిన యూఏఈ జులైలో ఏసీసీ ఎగమర్జింగ్‌ టీమ్స్‌ ఏసియాకప్‌ను ఆడాల్సి ఉంటుంది. అక్కడ ఐదు జట్లతో తలపడాల్సి ఉంటుంది.