Kolkata Knight Riders vs Punjab Kings: ఐపీఎల్‌ 2023 సీజన్ 53వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై పంజాబ్ కింగ్స్ మంచి స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ (PBKS) 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్ (57: 47 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తికి మూడు వికెట్లు దక్కాయి.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను అవుట్ చేసి హర్షిత్ రాణా మొదటి వికెట్ పడగొట్టాడు. కాసేపటికే వన్ డౌన్ బ్యాటర్ భానుక రాజపక్స కూడా డకౌట్ అయ్యాడు. లియాం లివింగ్‌స్టోన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. దీంతో పంజాబ్ 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అప్పటికి పవర్ ప్లే కూడా పూర్తి కాలేదు.


ఆ తర్వాత శిఖర్ ధావన్‌కు జితేష్ శర్మ జత కలిశాడు. వీరు నాలుగో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. అయితే కీలకమైన దశలో వీరిద్దరూ అవుటయ్యారు. శామ్ కరన్ కూడా విఫలం అయ్యాడు. చివర్లో రిషి ధావన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్ వేగంగా ఆడారు. దీంతో పంజాబ్ కింగ్స్ చివరి ఐదు ఓవర్లలో 55 పరుగులు చేసింది. మొత్తం 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు సాధించింది. కోల్‌కతా బ్యాటర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణాకు రెండు వికెట్లు దక్కాయి. సుయాష్ శర్మ, నితీష్ రాణాలు చెరో వికెట్ తీసుకున్నారు.




పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎనిమిదో స్థానంలోనూ, పంజాబ్ కింగ్స్ ఏడో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గెలిస్తే పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరనుంది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలిస్తే ఐదో స్థానానికి చేరనుంది. భారీ తేడాతో గెలిచి నెట్ రన్‌రేట్ మెరుగుపరుచుకుంటే నాలుగో స్థానానికి కూడా చేరుకునే అవకాశం ఉంది.


పంజాబ్ కింగ్స్ తుది జట్టు
ప్రభ్‌సిమ్రన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్


పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
నాథన్ ఎల్లిస్, సికందర్ రాజా, అథర్వ తైడే, మోహిత్ రాథీ, మాథ్యూ షార్ట్


కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి


కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
అనుకూల్ రాయ్, నారాయణ్ జగదీషన్, జేసన్ రాయ్, లాకీ ఫెర్గూసన్, కుల్వంత్ ఖేజ్రోలియా