Asia Cup 2023: మరో మూడు రోజుల్లో మొదలుకాబోయే ఆసియా కప్‌లో తమ దేశానికి పర్యటించే అతిథులకు భద్రతపరంగా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఉండేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నది. పర్యాటక జట్ల ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందితో పాటు అభిమానుల భద్రతకు భరోసానిస్తూ ఏకంగా పాకిస్తాన్ ఆర్మీనే రంగంలోకి దించింది. ఆసియా కప్ జరుగబోయే లాహోర్, ముల్తాన్‌లలో పాకిస్తాన్ ఆర్మీతో పాటు అత్యంత శక్తివంతమైన పంజాబ్ రేంజర్స్‌ను కూడా బరిలోకి దింపనుంది.
పాకిస్తాన్‌కు చెంది Geo TVలో వచ్చిన సమాచారం మేరకు.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అభ్యర్థన మేరకు ఆ దేశ ఆపద్ధర్మ ప్రభుత్వం పాక్ ఆర్మీతో పాటు పంజాబ్ రేంజర్స్ కనుసన్నల్లో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నది. ఈ రెండే గాక అవసరమైతే అత్యవసరంగా సేవలందించే క్విక్ రియాక్షన్ ఫోర్సెస్ (క్యూఆర్ఎఫ్)ను కూడా సిద్ధం చేసింది. పాకిస్తాన్ ఆర్మీతో పాటు పంజాబ్ రేంజర్స్‌కు కూడా తమ క్యూఆర్ఎఫ్ టీమ్‌ను సిద్ధం చేశాయి.
పాకిస్తాన్‌లో మ్యాచ్‌ల నిర్వహణ అంటే సవాల్‌తో కూడుకున్నది. 2009లో ఆ దేశ పర్యటనకు వెళ్లిన శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్‌పై తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డ ఉదంతం తర్వాత ఆ దేశానికి ప్రయాణించడానికే ఇతర దేశాలు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాయి. గత దశాబ్దంలో అయితే జింబాబ్వే, వెస్టిండీస్ వంటి చిన్న జట్లు మినహా పాకిస్తాన్‌కు అగ్రశ్రేణి జట్లు పర్యటించలేదు. ఒకరకంగా పాకిస్తాన్‌లో 1996 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఇంత భారీ స్థాయి టోర్నీ జరగడం కూడా ఇదే ప్రథమం అని చెప్పకతప్పదు. పాకిస్తాన్‌కు వచ్చేందుకు ఏ దేశం కూడా సాహసం చేయకపోవడంతో దుబాయ్ వేదికగా ఆ జట్టు ఇతర జట్లతో మ్యాచ్‌లు ఆడింది. 2021లో న్యూజిలాండ్ వన్డేలు ఆడేందుకని వచ్చి రావల్పిండిలో మరికొద్దిసేపైతే మ్యాచ్ ప్రారంభమవుతుందనగా భద్రతా కారణాల రీత్యా ఆగమేఘాల మీద తమ దేశానికి పయనమైంది. ఎట్టకేలకు 2022లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లు పాకిస్తాన్‌లో పర్యటించాయి.
ఇక ఆసియా కప్ - 2023 విషయంలో కూడా ఆతిథ్య హక్కులున్నా అసలు ఆ దేశంలో మ్యాచ్‌లు జరుగుతాయా..? లేదా..? అన్నది ఓ డ్రామాను తలపించింది. భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్‌కు వెళ్లబోమని బీసీసీఐ కరాకండీగా చెప్పేసింది. తటస్థ వేదికలలోనే ఆడతామని చెప్పి తన మాటను నెగ్గించుకుంది. బీసీసీఐ ఒత్తిడితో ఆసియా కప్‌ను రెండు దేశాలలో నిర్వహిస్తున్నది ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ). భారత మ్యాచ్‌లు అన్నీ శ్రీలంక వేదికగానే జరుగుతాయి. ఇక పాకిస్తాన్ వేదికగా జరుగబోయే నాలుగు మ్యాచ్‌లలో జట్లకు పటిష్ట భద్రత కల్పించాలని పీసీబీ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఆసియా కప్‌ను నిర్వహించడం పాకిస్తాన్‌కు చాలా కీలకం. ఈ నాలుగు మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహిస్తేనే 2025లో ఆ దేశంలో జరగాల్సి ఉన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి లైన్ క్లీయర్ అవుతుంది. ఏదైనా తేడా వస్తే మాత్రం పాకిస్తాన్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు ఇతర జట్లు రావడం మళ్లీ గగనమే అవుతోంది. అందుకే మ్యాచ్‌లకు భారీ భద్రత కలిగించాలని పాక్ ప్రభుత్వం కూడా ఆయా వర్గాలకు ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial