Nepal in Asia Cup:
నేపాల్ క్రికెట్ టీమ్ అద్భుతం చేసింది! చరిత్రలో తొలిసారి ఆసియాకప్‌కు (Asia Cup 2023) అర్హత సాధించింది. ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ 2023 విజేతగా అవతరించింది. ఫైనల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టును చిత్తు చేసింది. ఆసియాకప్‌లో భారత్, పాకిస్థాన్ గ్రూప్‌లో చేరింది.
కీర్తిపుర్‌లోని త్రిభువన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలో మెన్స్ ప్రీమియర్ కప్ ఫైనల్ జరిగింది. వర్షం రావడంతో ఈ మ్యాచు రెండు రోజుల పాటు నిర్వహించారు. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 33.1 ఓవర్లకు 117 పరుగులకు ఆలౌటైంది. ఆసిఫ్ ఖాన్ (46; 54 బంతుల్లో 7x4, 1x6) ఒక్కడే రాణించాడు. మహ్మద్ వసీమ్ (11), ఆర్యన్ లక్రా (13). బసిల్ హమీద్ (10), జునైద్ సిద్దిఖి (10) రెండంకెల స్కోరు అందుకున్నారు. రాజ్‌భన్సీ 7.1 ఓవర్లు వేసి 14 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. సందీప్ లామిచాన్, కరన్ కేసీకి తలో రెండు వికెట్లు దక్కాయి.
ఛేజింగ్‌లో నేపాల్ మొదట తడబడింది. ఓపెనర్లు కశాల్ భూర్టెల్ (1), ఆసిఫ్ షేక్ (8) వెంటవెంటనే ఔటయ్యారు. కెప్టెన్ రోహిత్ పౌడెల్ (1) సైతం త్వరగానే పెవిలియన్ చేరిపోయాడు. దాంతో నేపాల్ 22 కే 3 వికెట్లు చేజార్చుకుంది. ఇలాంటి డేంజర్ సిచ్యువేషన్లో గుల్షన్ ఝా (67*; 84 బంతుల్లో 3x4, 5x6) అదరగొట్టాడు. మొదట్లో ఆచితూచి ఆడుతూ దొరికిన బంతుల్ని బౌండరీకి పంపించాడు. కళ్లుచెదిరే సిక్సర్లు బాదేశాడు. అతడికి భీమ్ షక్రీ (36*; 72 బంతుల్లో 4x4) అండగా నిలిచాడు. చక్కగా స్ట్రైక్ చేశాడు. 30.3 ఓవర్లకు టార్గెట్ ఛేదించి రికార్డు సృష్టించారు. తొలిసారి నేపాల్‌ను ఆసియాకప్‌కు తీసుకెళ్లారు.
ఈ విజయంతో భారత్, పాకిస్థాన్ ఉన్న గ్రూప్-ఏలోకి నేపాల్ వచ్చింది. సెప్టెంబర్లో దాయాది దేశాలతో తలపడనుంది. ఆసియా మెన్స్ ప్రీమియర్ టోర్నీలో ఓడిన యూఏఈ జులైలో ఏసీసీ ఎగమర్జింగ్ టీమ్స్ ఏసియాకప్‌ను ఆడాల్సి ఉంటుంది. అక్కడ ఐదు జట్లతో తలపడాల్సి ఉంటుంది.