Asia Cup 2023: 


రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఎదుగుదలలో ఎంఎస్‌ ధోనీ పాత్ర ఎంతైనా ఉందని గౌతమ్‌ గంభీర్‌ అంటున్నాడు. మొదట్లో ఇబ్బంది పడుతున్న అతడిని మహీ ప్రోత్సహించాడని పేర్కొన్నాడు. మిడిలార్డర్లో ఆడుతున్న అతడిని ఓపెనింగుకు మార్చాడని గుర్తు చేశాడు. అందుకే హిట్‌మ్యాన్‌ సైతం కుర్రాళ్లను అలాగే ప్రోత్సహించాలని సూచించాడు. శ్రీలంకపై విజయం తర్వాత గౌతీ మీడియాతో మాట్లాడాడు.


టీమ్‌ఇండియాకు ఎంపికైన తొలినాళ్లలో రోహిత్‌ శర్మ (Rohit Sharma) మిడిలార్డర్లో ఆడేవాడు. అవకాశాలు వచ్చినప్పటికీ ఎందుకో ఇబ్బంది పడేవాడు. త్వరగా ఔటయ్యేవాడు. కుదురుకొనేవాడు కాదు. దాంతో అప్పటి కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ (MS Dhoni) అతడి బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చాడు. ఓపెనింగ్‌ చేయించాడు. అప్పుడు మొదలైన హిట్‌మ్యాన్‌ పరుగుల వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆసియాకప్‌ సూపర్‌ 4 టీమ్‌ఇండియా మంగళవారం శ్రీలంకపై విజయం సాధించింది. ఇదే పోరులో రోహిత్‌ వన్డేల్లో 10,000 పరుగుల మైలురాయి అందుకున్నాడు.


'రోహిత్‌ శర్మ పదివేల పరుగులు పూర్తి చేయడం సులభం కాదు. కెరీర్లో అతడెన్నో ఎత్తుపల్లాలు చవిచూశాడు. ఆ పరిస్థితిని అనుభవించిన హిట్‌మ్యాన్‌.. కెప్టెన్‌గా కుర్రాళ్లను ప్రోత్సహించాలి. ఇబ్బంది పడుతున్న యువకులను గమనించి అండగా నిలవాలి. రోహిత్‌ శర్మ ఈ రోజు ఇంత ఎదిగాడంటే అది ఎంఎస్‌ ధోనీ వల్లే' అని గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు.


'ఆరంభంలో ఇబ్బంది పడుతున్న రోహిత్‌ను ఎంఎస్‌ ధోనీ ప్రోత్సహించాడు. వరుసగా అవకాశాలు కల్పించాడు. తన వారసత్వాన్ని నిలబెట్టుకోవాలంటే అతడూ ఇదే పని చేయాలి. పరుగులు మాత్రమే కాదు ఇబ్బంది పడుతున్న కుర్రాళ్లను ప్రోత్సహించాలి. అతడు యువ ఆటగాళ్లను ఎలా ప్రోత్సహిస్తాడన్నది ఆసక్తికరం' అని గౌతీ పేర్కొన్నాడు.


రోహిత్‌ శర్మ ప్రతిభను తాను మొదట్లోనే గుర్తించానని గౌతమ్ గంభీర్ అన్నాడు. కొన్నేళ్ల క్రితమే తన టీమ్‌పై అతడు మెరుగ్గా ఆడాడని గుర్తు చేసుకున్నాడు. 'ఒక దేశవాళీ మ్యాచులో రోహిత్‌ నా జట్టుపై ఆడాడు. మొదట్లో మేం 350 పరుగులు చేశాం. అతడి జట్టు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు హిట్‌మ్యాన్‌ ఐదో డౌన్లో దిగాడు. 130 పరుగులు చేసిన తన జట్టును గెలిపించాడు. ఈ అబ్బాయి ఎవరని అప్పుడే వసీమ్ జాఫర్‌ను అడిగాను. అతడో ప్రత్యేకమైన ఆటగాడని గుర్తించాను' అని గౌతీ వెల్లడించాడు.


రోహిత్ @ 10 వేలు


- వన్డేలలో పదివేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న  రెండో క్రికెటర్ రోహిత్. ఈ ఘనతను  అందుకోవడానికి హిట్‌మ్యాన్‌కు 241 ఇన్నింగ్స్ అవసరం పడ్డాయి. అంతకుముందు  విరాట్ కోహ్లీ  205 ఇన్నింగ్స్‌లలోనే  పదివేల పరుగుల క్లబ్‌లో చేరాడు.   భారత క్రికెట్ దిగ్గజం  సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్, గంగూలీ   263 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించారు. భారత క్రికెట్ జట్టులో సచిన్ (18,426), విరాట్ (13,027), గంగూలీ (11,363), ద్రావిడ్ (10,889), ఎంఎస్ ధోని (10,773)  తర్వాత స్థానం రోహిత్‌ (10,031)దే..


- రోహిత్‌కు  ఆసియా కప్ - 2023లో ఇది వరుసగా మూడో అర్థ సెంచరీ. తద్వారా అతడు ఈ టోర్నీ చరిత్రలో 10 కంటే ఎక్కువగా ఫిఫ్టీ ప్లస్  స్కోర్లు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు.    శ్రీలంకతో మ్యాచ్‌లో చేసిన  53 పరుగులతో  ఈ టోర్నీలో  రోహిత్ 10 అర్థ శతకాలు పూర్తి చేశాడు.   ఆసియా కప్‌లో రోహిత్  ఖాతాలో ఓ సెంచరీ కూడా ఉంది.   25 ఇన్నింగ్స్‌లలో 10 అర్థ శతకాలు ఒక శతకంతో  ఉన్న  రోహిత్.. కుమార సంగక్కర (8 హాఫ్ సెంచరీలు, నాలుగు సెంచరీలు - 12) తర్వాత ఫిఫ్టీ ప్లస్ స్కోరు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.