Asia Cup 2023 Final: ఆసియా కప్ - 2023 ప్రారంభమైన ముహుర్తమే బాగోలేనట్టుగా ఉంది.   బాలారిష్టాలను దాటుకుని  రెండు దేశాలలో  నిర్వహించతలపెట్టిన ఈ టోర్నీకి ఆది నుంచి అడ్డంకులే. ఆసియా కప్ ప్రారంభానికి ముందు  భద్రతా కారణాలు, సరిహద్దు వివాదాల కారణంగా   పాకిస్తాన్, శ్రీలంకలలో ఆడుతున్న ఈ టోర్నీకి వర్షాలు షాకుల మీద షాకిస్తున్నాయి. అదేదో పగబట్టినట్టు వర్షం కేవలం భారత్ ఆడే మ్యాచ్‌ల మీద  తన ప్రతాపాన్ని చూపిస్తున్నది.  వరుసగా మ్యాచ్‌లు వర్షార్పణం అవుతుండటంతో  ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.   షెడ్యూల్ ప్రకారం  ఆసియా కప్ - 2023 ఫైనల్‌ను కొలంబోలోనే నిర్వహించాల్సి ఉన్నా  వర్షాల నేపథ్యంలో వేదిక మార్పు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 


కొలంబోలో గత కొన్నిరోజులుగా వానలు దంచికొడుతున్నాయి. సూపర్ - 4లో భారత్ - పాక్ మ్యాచ్ పావు వంతు ఆటైనా సాగకుండానే వరుణుడు  మ్యాచ్‌ను ముంచెత్తాడు.  ఈ మ్యాచ్‌కు  సోమవారం రిజర్వ్ డే ఉన్నా  ఇవాళ కూడా కొలంబోలో వర్షాలు కురిసే అవకాశాలు 80 శాతానికంటే ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్ కూడా ఇలాగే తుడిచిపెట్టుకుపోతే ఇప్పటికే  ఆగ్రహంగా ఉన్న అభిమానులు ఏసీసీని ఆటాడుకోవడం ఖాయం.  


ఇదివరకే యూఏఈని కాదని శ్రీలంకలో మ్యాచ్‌ల నిర్వహణ, శ్రీలంకలో భారత్ ఆడుతున్న మ్యాచ్‌లన్నీ వర్షార్పణం అవుతుండటం అభిమానుల ఓపికను పరీక్షిస్తున్నాయి.  దీంతో  ఫైనల్ వేదికను మార్చేందుకు  ఏసీసీ సమాయత్తమవుతున్నట్టు తెలుస్తున్నది. ఈనెల 17న ఫైనల్‌ను కొలంబోలో కాకుండా   క్యాండీ (పల్లెకెలె) లో గానీ హంబన్‌టోటాలో గానీ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.  


 






అయితే ఈ నిర్ణయం కూడా అభిమానులను నిరాశకు గురిచేసేదే. పల్లెకెలెలో  గత వారం భారత్ ఆడిన రెండు మ్యాచ్‌లకూ వర్షం తన ప్రతాపాన్ని చూపించింది. భారత్ - పాక్ మ్యాచ్ ఫలితం తేలకపోగా భారత్ - నేపాల్ మ్యాచ్‌లో ఓవర్లను కుదించాల్సి వచ్చింది. అటువంటిది పోయి పోయి మళ్లీ క్యాండీలోనే ఫైనల్ నిర్వహిస్తే మాత్రం  దానికంటే తెలివితక్కువ పని మరోటి ఉండదని అభిమానులు వాపోతున్నారు.  ప్రస్తుతం వానాకాలం సీజన్‌లో శ్రీలంక దక్షిణ ప్రాంతంలో వర్షాలు దంచికొడుతున్నాయి. కొలంబోతో పాటు పల్లెకెలె కూడా   దక్షిణాది నగరాలే. కాగా నేడు భారత్ - పాకిస్తాన్ రిజర్వ్ డే కూడా తుడిచిపెట్టుకుపోతే దీనిపై   ఏసీసీ కీలక నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తున్నది.  






భారత్ - పాక్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉన్నా వర్షం ముప్పు అయితే ఉంది. సోమవారం ఉదయం కాస్త ఎండ కాసినా 11 నుంచి మళ్లీ కొలంబోలో వాన దంచికొడుతోంది.  స్థానిక వాతావరణ శాఖ అంచనాల ప్రకారం..   మధ్యాహ్నం 3 గంటల వరకూ కొలంబోలో వర్షాలు పడే అవకాశం  49 శాతం ఉండగా   సాయంత్రం 4 నుంచి 6 వరకూ  73 శాతం ఉంది.  ఇక రాత్రి 8 తర్వాత అయితే వర్షం కురిసే అవకాశాలు వంద శాతం ఉన్నాయి. అంటే ఈ లెక్కన చూస్తే ఇవాళ కూడా మ్యాచ్ జరిగే  అవకాశాలు దాదాపు లేనట్టే.  




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial