Rohit Sharma Record: భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ ఇటీవలే వన్డేలలో పదివేల పరుగులు పూర్తి చేశాడు. ఈ క్రమంలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించినవారిలో సచిన్ రికార్డును బ్రేక్ చేసిన హిట్‌మ్యాన్ తాజాగా మాస్టర్ బ్లాస్టర్‌కు చెందిన మరో రికార్డునూ అధిగమించేందుకు సిద్ధమయ్యాడు. ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు (వన్డే ఫార్మాట్‌లో) చేసిన భారత ఆటగాడిగా నిలవడానికి రోహిత్‌కు 33 పరుగుల దూరంలో ఉన్నాడు. భారత్ - శ్రీలంక మధ్య జరుగబోయే ఫైనల్ మ్యాచ్‌లో 33 పరుగులు చేస్తే హిట్‌మ్యాన్ కొత్త చరిత్ర సృష్టించినట్టే.. వన్డేలలో రోహిత్‌కు ఇది 250వ మ్యాచ్.
ఆసియా కప్ ఆడుతూ భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్ అందరికంటే ముందున్నాడు. సచిన్ తన కెరీర్‌లో 23 ఆసియా కప్ మ్యాచ్‌లలో 21 ఇన్నింగ్స్ ఆడి 971 పరుగులు సాధించాడు. 51.10 సగటుతో రెండు సెంచరీలు, ఏడు అర్థ సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్.. 27 మ్యాచ్‌లు ఆడి 26 ఇన్నింగ్స్‌లలో 939 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ (పాకిస్తాన్‌పై) 9 అర్థ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుత ఎడిషన్‌లో రోహిత్ 3 అర్థ సెంచరీలు సాధించడం గమనార్హం.
ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన టాప్ - 5 బ్యాటర్లు (భారత్ నుంచి)
- సచిన్ : 23 మ్యాచ్‌లలో 971 పరుగులు
- రోహిత్ : 27 మ్యాచ్‌లలో 939
- విరాట్ కోహ్లీ : 15 మ్యాచ్‌లలో 742
- ఎంఎస్ ధోని : 19 మ్యాచ్‌లలో 648
- గౌతం గంభీర్ : 13 మ్యాచ్‌లలో 573
ఓవరాల్‌గా టాప్ -5 బ్యాటర్లు :
- సనత్ జయసూర్య : 25 మ్యాచ్‌లలో 1,220 పరుగులు
- కుమార సంగక్కర : 24 మ్యాచ్‌లు 1,075
- సచిన్ : 23 మ్యాచ్‌లు 971
- రోహిత్ : 27 మ్యాచ్‌లు 939
- ముస్తాఫిజుర్ రెహ్మాన్ : 25 మ్యాచ్‌లు 830 (బంగ్లాదేశ్)
1990 - 91 సీజన్ నుంచి 1995 వరకూ అజారుద్దీన్ నాయకత్వంలో ఆసియా కప్ ఆడిన సచిన్.. 1997 లో భారత్‌కు సారథిగా కూడా వ్యవహరించాడు. కాగా రోహిత్ కు ఇది ఐదో ఆసియా కప్ ఫైనల్ కావడం గమనార్హం. ఆసియా కప్ చరిత్రలో ఐదు ఫైనల్స్ ఆడిన తొలి ఆటగాడు రోహిత్ మాత్రమే. 2008, 2010, 2016 (టీ20), 2018 ఫైనల్స్‌లో హిట్‌మ్యాన్ ప్రాతినిథ్యం వహించాడు. నేడు లంకతో మ్యాచ్‌లో 61 పరుగులు చేస్తే అతడు ఈ టోర్నీలో వెయ్యి పరుగులు పూర్తిచేసిన తొలి భారత క్రికెటర్ అవుతాడు.
గెలిస్తే ధోని, రణతుంగల రికార్డులు సమం..
ఆసియా కప్‌లో సారథిగా అత్యధిక విజయాల రికార్డును సొంతం చేసుకుని దిగ్గజ సారథులైన అర్జున రణతుంగ (శ్రీలంక), మహేంద్ర సింగ్ ధోని (భారత్)ల సరసన నిలిచేందుకు రోహిత్ ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. ఆసియా కప్ (వన్డేలు) చరిత్రలో ధోని 14 మ్యాచ్ లలో సారథిగా ఉండి 9 గెలిచి నాలుగింట్లో ఓడాడు. ఒక మ్యాచ్ టై అయింది. ఇక రణతుంగ.. 13 మ్యాచ్‌లలో సారథిగా ఉండి 9 విజయాలు సాధించి నాలుగు ఓడిపోయాడు. ఆ తర్వాత రోహిత్.. 10 మ్యాచ్‌లలో సారథిగా ఉండి 8 మ్యాచ్‌లలో గెలిచి ఒకదాంట్లో ఓడాడు. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక నేడు లంకతో ఫైనల్ పోరులో గెలిస్తే హిట్‌మ్యాన్.. ధోని, రణతుంగల సరసన చేరుతాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial