Asia Cup 2023 Final: మూడు వారాల క్రితం ముల్తాన్ (పాకిస్తాన్) వేదికగా మొదలై  పాక్‌లో ఎండ, ఉక్కపోత..  లంకలో కుండపోత వాన మధ్య  సాగుతున్న ఆసియా కప్ తుది అంకానికి చేరింది.  ఇదివరకే ఫైనల్ చేరిన భారత్ - శ్రీలంకలు నేడు కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి.  2018లో ఆసియా కప్ తర్వాత  మేజర్ టోర్నీ ఒక్కటి కూడా గెలవని భారత్‌..  కొద్దిరోజుల్లో స్వదేశంలో జరుగబోయే  వన్డే వరల్డ్ కప్ ముందు ఈ టోర్నీని దక్కించుకుని మెగా టోర్నీలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నది.  మరోవైపు ఆసియా కప్ అంటేనే  దుమ్మురేపే లంకేయులూ  భారత్‌కు షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 


స్పిన్ యుద్ధమే.. 


ఫైనల్ వేదిక కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో గడిచిన  ఏడు  రోజుల్లో ఇది ఆరో మ్యాచ్.  భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌లో బ్యాటర్లకు  బాగా అనుకూలించిన ఈ పిచ్.. తర్వాత  నెమ్మదించింది.  స్పిన్నర్లకు స్వర్గధామంగా మారిన ప్రేమదాసలో లంక.. గత మ్యాచ్‌లో భారత్‌కు తన స్పిన్ రుచి చూపించింది.  దునిత్ వెల్లలాగే ఐదు వికెట్లతో చెలరేగగా పార్ట్ టైమ్ స్పిన్నర్లు అయిన చరిత్ అసలంక,  ధనంజయ డి సిల్వలు భారత బ్యాటర్లను ముప్పుతిప్పులు పెట్టారు.  ఈ మ్యాచ్‌లో లంకకు కీలక  స్పిన్నర్ మహీశ్ తీక్షణ లేకపోవడం పెద్ద ఎదురుదెబ్బే అయినా ఉన్నవాళ్లతోనే కెప్టెన్ శనక అద్భుతాలు చేస్తున్నాడు.  లంక స్పిన్నర్లు భారత బ్యాటర్లను మరోసారి ఇబ్బంది పెట్టేందుకు   అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.  


సూపర్ - 4లో భాగంగా  ఇటీవలే భారత్‌తో ముగిసిన మ్యాచ్‌లో టీమిండియా పదికి పది వికెట్లు స్పిన్నర్ల ఖాతాలోకే వెళ్లాయి.   పాకిస్తాన్‌తో భారీ స్కోరు చేసిన  ఇండియా.. లంకతో మాత్రం అష్టకష్టాలు పడుతూ 213 పరుగులకే  చాపచుట్టేసింది.  నేడూ అదే స్పిన్‌తో భారత్‌ను  తిప్పేయాలని భావిస్తున్నది. గత మ్యాచ్‌లో విజయానికి దగ్గరగా వెళ్లిన లంక.. బ్యాటింగ్ వైఫల్యంతో ఓడింది. కానీ నేడు మాత్రం దానిని  పునరావృతం చేయకూడదని  పట్టుదలతో ఉంది. 


భారత్ బలం బ్యాటింగ్.. 


రోహిత్  శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్,  కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ వంటి స్టార్  ప్లేయర్లతో  భారత బ్యాటింగ్ బలంగానే ఉంది. అయితే గత మ్యాచ్‌లో వీళ్లలో హిట్‌మ్యాన్ తప్ప మిగిలినవారు విఫలమయ్యారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఓడటం భారత్‌కు కొంచెం చిరాకు కలిగించేదే అయినా  ఈ మ్యాచ్‌లో గడ్డు పరిస్థితులు ఎదురైనా గిల్ నిలబడి పరుగులు రాబట్టడం సానుకూలాంశమే.  భారత స్పిన్ బాధ్యతలను  కుల్‌‌దీప్  అద్భుతంగా మోస్తున్నాడు.  ఈ టోర్నీలో ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లలో 9 వికెట్లు తీసిన కుల్‌దీప్.. నేటి మ్యాచ్‌లో లంక  బ్యాటర్లను ఏ మేరకు కట్టడి చేస్తాడో చూడాలి.  లంక మిడిలార్డర్‌లో కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, అసలంక, ధనంజయ డిసిల్వ తో పాటు  ఏడో నెంబర్ బ్యాటర్ దునిత్ వెల్లలాగే కూడా  బ్యాటరే. వీరిని ఆదిలోనే ఔట్ చేస్తేనే భారత్‌కు మ్యాచ్‌పై పట్టు చిక్కుతుంది.  


బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రెస్ట్ ఇచ్చిన కోహ్లీ, హార్ధిక్, కుల్‌‌దీప్, బుమ్రాలు ఫైనల్‌లో ఆడతారు. భారత్‌కు బుమ్రాతో పాటు సిరాజ్, హార్ధిక్ పాండ్యాలు  అద్భుత ఆరంభాలు ఇస్తుండగా దానిని  కుల్‌దీప్ కొనసాగిస్తున్నాడు.  ఇక బంగ్లాతో మ్యాచ్‌లో గాయపడ్డ  అక్షర్ పటేల్ స్థానంలో  అక్షర్ పటేల్‌ను ఆడిస్తారా..? లేక వాషింగ్టన్ సుందర్ ఆడతాడా..? అన్నది  ప్రస్తుతానికైతే సస్పెన్సే..  శ్రేయస్ అయ్యర్  నేటి మ్యాచ్‌లో కూడా బెంచ్‌కే పరిమితం కావొచ్చు. షమీకి కూడా తుది జట్టులో చోటు అనుమానమే.. 


వర్షం ముప్పు : 


కొలంబోలో గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలు  నేడు కూడా మ్యాచ్‌కు ఆటంకం కలిగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నేడు కూడా వాన పడే అవకాశం 80 శాతం దాకా ఉంది. అయితే  నేటి మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంది. 


తుది జట్లు  (అంచనా) : 


భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా 


శ్రీలంక : కుశాల్ పెరెరా, పతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ  డి సిల్వ,  దసున్ శనక (కెప్టెన్),  దునిత్ వెల్లలాగె, దుషన్ హేమంత, మతీశ పతిరాన, కసున్ రజిత 


మ్యాచ్ వెన్యూ, టైమింగ్స్: 


- కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో  ఆడే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం  మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుంది.  


లైవ్ చూడండిలా.. 


- ఈ మ్యాచ్‌ను టెలివిజన్‌లో అయితే  స్టార్ నెట్‌వర్క్స్ ఛానెల్స్‌లో చూడొచ్చు. ఇక మొబైల్ యాప్, వెబ్‌సైట్స్‌లో అయితే డిస్నీ హాట్ స్టార్ నుంచి ఉచితంగా వీక్షించొచ్చు. 










ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial