Asia Cup 2023: ఆసియా కప్ - 2023 పాకిస్తాన్‌లో జరుగుతుందా..? లేక ఈ టోర్నీని శ్రీలంకకు తరలిస్తారా..? ఒకవేళ పాకిస్తాన్‌లోనే జరిగితే అక్కడికి వెళ్లనని పట్టుబడుతున్న టీమిండియా హైబ్రిడ్ మోడల్‌కు ఓకే చెబుతుందా..? సుమారు ఏడెనిమిది నెలలుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య సా...గుతున్న వివాదానికి త్వరలోనే ముగింపు కార్డు పడే అవకాశం ఉందని సమాచారం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 ఎడిషన్ ఫైనల్ జరుగబోయే అహ్మదాబాద్ ఇందుకు వేదిక కానుంది.
ఈనెల 28న ఐపీఎల్ - 16 ఫైనల్ అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు గాను అహ్మదాబాద్‌కు రావాలని బీసీసీఐ.. ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్‌సీ) అధినేతలకు ఆహ్వానం పంపింది. ఐపీఎల్ ఫైనల్ జరిగే రోజే ఆసియా కప్ - 2023 వేదికపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా ఓ ప్రకటనలో.. ‘బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, శ్రీలంక క్రికెట్ బోర్డులకు చెందిన ప్రతినిధులు మే 28న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగబోయే ఐపీఎల్ - 16 ఫైనల్స్‌కు హాజరవుతారు. ఇదే రోజు మేం ఆసియా కప్ భవితవ్యంపై ఒక నిర్ణయం తీసుకుంటాం..’ అని పేర్కొన్నారు.
బీసీసీఐ సెక్రటరీనే గాక ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కు కూడా అధ్యక్షుడిగా ఉన్న జై షా..ఈ ప్రకటన చేయడంతో ఆసియా కప్ నిర్వహణ వివాదంపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాగా జై షా ప్రకటన కంటే ముందే.. పాకిస్తాన్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌కు బీసీసీఐ అంగీకారం తెలిపిందన్న వార్తలను బోర్డు కొట్టేపారేసింది. దీనిపై జై షా స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత కూడా ఇలాంటి రూమర్స్‌కు చోటులేదని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆసియా కప్‌ను పాకిస్తాన్ లో నిర్వహించాల్సి ఉండగా భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా ఆ దేశానికి రాబోదని బీసీసీఐ గతేడాది టీ20 ప్రపంచకప్ సమయంలోనే తేల్చి చెప్పింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ ఆడబోయే మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించాలని అలా అయితేనే ఆసియాకప్ ఆడతామని బీసీసీఐ కోరినట్టు.. దానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి. అయితే కొద్దిరోజుల క్రితం మళ్లీ.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ బోర్డులు కూడా తాము పాకిస్తాన్ వెళ్లబోమని అనడంతో ఈ టోర్నీని పాక్ లో కాకుండా శ్రీలంకలో నిర్వహిస్తారన్న వాదనలూ వినిపించాయి. అదే క్రమంలో ఈ నిర్ణయాన్ని పీసీబీ తిరస్కరించిందని, ఇదే జరిగితే తాము ఆసియా కప్ ను బహిష్కరిస్తామని, భారత్ లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ కూడా ఆడబోమని హెచ్చరించడంతో బీసీసీఐ వెనక్కితగ్గిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ అన్నింటికీ ఐపీఎల్ ఫైనల్ రోజు చెక్ పడబోతోంది..!