IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్వాలిఫయర్ వన్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. ముంబై ఇండియన్స్ కూడా ఫైనల్స్ వైపు అడుగులు వేస్తుంది.


ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 81 పరుగుల తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌పై విజయం సాధించింది. ఇప్పుడు క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ ఢీకొననుంది. దీంతో ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఎందుకు నిలిచాడో రోహిత్ శర్మ మరోసారి నిరూపించుకున్నాడు.


దారుణమైన ఆరంభం
ముంబై ఇండియన్స్‌కు టోర్నీ ఆరంభం చాలా దారుణంగా ఉంది. లీగ్ దశలో సగానికి పైగా మ్యాచ్‌లు ముగిసే సమయానికి ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. కానీ ఇక్కడ నుండి జట్టు బలమైన పునరాగమనం చేసింది. తర్వాతి ఎనిమిది మ్యాచ్‌లలో 6 గెలిచింది. ఈ అద్భుత ప్రదర్శన కారణంగా ముంబై ఇండియన్స్‌కు రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్ గెలిచే అవకాశం ఉంది.


ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్టు. ముంబై ఇండియన్స్ సాధించిన ఈ విజయంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ కీలకమైనది. 2013 సీజన్‌ మధ్యలో రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్‌కు బాధ్యతలు స్వీకరించే అవకాశం లభించింది. కెప్టెన్సీ చేసిన తొలి సీజన్‌లోనే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను విజేతగా నిలిపాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ వెనుదిరిగి చూడలేదు. 2014లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు వెళ్లగలిగింది. 2015, 2017, 2019, 2020లో రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది.


అయితే గత రెండేళ్లుగా ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ కమ్‌బ్యాక్ చేసి టైటిల్ దిశగా అడుగులు వేసింది. ముంబై ఇండియన్స్‌కు రికార్డు స్థాయిలో ఆరోసారి ఐపీఎల్ ట్రోఫీని పేరు పెట్టే అవకాశం ఉంది.


ఐపీఎల్‌ 2023 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ భారీ విజయం సాధించి క్వాలిఫయర్ 2కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 16.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ముంబై ఇండియన్స్ 81 పరుగులతో విజయం సాధించింది. మే 26వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు మే 28వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్స్ ఆడనుంది.


లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లలో మార్కస్ స్టోయినిస్ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్ తన స్పెల్‌లో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. ఇక ముంబై బ్యాటర్లలో కామెరాన్ గ్రీన్ (41: 23 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.