Gavaskar On KL Rahul: టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కు మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మద్దతుగా నిలిచారు. హాంకాంగ్ తో మ్యాచ్ లో నిదానంగా బ్యాటింగ్ చేసినందుకు రాహుల్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన గావస్కర్ అతనికి అండగా నిలిచారు. అతను ఇప్పుడే గాయం నుంచి కోలుకుని వచ్చాడని.. త్వరలోనే ఫామ్ అందుకుంటాడని ఆశాభావం వ్యక్తంచేశారు. 


ఆసియా కప్ లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 39 బంతుల్లో కేవలం 36 పరుగులు చేశాడు. ముందు రెండు అద్భుతమైన సిక్సర్లు కొట్టినప్పటికీ.. ఇన్నింగ్స్ అంతటా అదే ఊపు కొనసాగించలేకపోయాడు. క్రీజులో ఉన్నంతసేపు తడబడ్డాడు. దీనిపై విమర్శలు ఎదుర్కొన్నాడు. 


ఫాంలోకి వస్తే ప్రత్యర్థికి వణుకే


అతని బ్యాటింగ్ తీరుపై సునీల్ గావస్కర్ స్పందించాడు. రాహుల్ 5 నెలల విరామం తర్వాత బ్యాట్ పట్టుకున్నాడని.. అంత గ్యాప్ తర్వాత మునుపటిలా బ్యాటింగ్ చేయడం తేలిక కాదన్నాడు. రాహుల్ కు టీ20ల్లో మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. మిగతా వారికి జట్టు యాజమాన్యం అవకాశాలిస్తున్నప్పుడు.. రాహుల్ కు కూడా మద్దతుగా ఉండాలని కోరాడు. అతను గాడిలో పడడానికి కేవలం ఒక్క మంచి ఇన్నింగ్స్ సరిపోతుందని అన్నాడు. అతను ఒక్కసారి ఫాంలోకి వస్తే ప్రత్యర్థి జట్లకు నిద్రపట్టని ఇన్నింగ్స్ ఆడతాడని అన్నాడు. 


సమయం ఇవ్వాలి


కేఎల్ రాహుల్ క్లాస్ ప్లేయర్ అని గావస్కర్ అభినందించాడు. ఎన్నో సంవత్సరాలుగా అతను దేశంకోసం పరుగులు చేస్తున్నాడని గుర్తుచేశారు. ఒక్క మ్యాచ్ లో బాగా ఆడనంత మాత్రాన అతను చెత్త ప్లేయర్ అవ్వడని అన్నాడు. అతను టీమిండియాకు వైస్ కెప్టెన్ అని.. అతను ఎంత బాగా ఆడగలడు అనే విషయం అందరికీ తెలుసునని గావస్కర్ చెప్పాడు. గాయం తర్వాత రిథమ్ అందుకోవడానికి సమయం పడుతుందని.. అది అతనికి ఇవ్వాలని సూచించారు. 


రాహుల్ టచ్ కోల్పోలేదు


మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా రాహుల్ కు మద్దతుగా నిలిచారు. అతను బంతిని టైమింగ్ చేసిన విధానం చూస్తే.. పూర్తిగా టచ్ కోల్పోయినట్లుగా అనిపించట్లేదని అన్నాడు. తిరిగి ఫాంలోకి రావడానికి పెద్దగా సమయం పట్టదని అభిప్రాయపడ్డాడు. అతను అనుభవమున్న ఆటగాడని, గాడిన పడడానికి ఒక మంచి ఇన్నింగ్స్ సరిపోతుందని అన్నాడు. ఇప్పుడు మిగతా ఆటగాళ్లు రాణిస్తున్నందున రాహుల్ ఫాంపై ఆందోళన అవసరం లేదని అన్నాడు. 


ఐపీఎల్ 2022 తర్వాత కేఎల్ రాహుల్ జర్మనీలో హెర్నియా శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అనంతరం వెస్టిండీస్ సిరీస్ కు ముందు కరోనా బారిన పడ్డాడు. వీటన్నింటితో 5 నెలలు ఆటకు దూరమయ్యాడు. జింబాబ్వే పర్యటనలో జట్టుకు నాయకత్వం వహించినప్పటికీ పెద్దగా రాణించలేదు.