Asia Cup 2022: ప్రస్తుతం సోషల్ మీడియా మరీ చెత్తగా తయారైందని.. దానిలో వచ్చే వాటి గురించి తామసలు పట్టించుకోమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. క్రికెట్‌లో గెలుపోటములు సహజం అని.. ఒకసారి తాము గెలిస్తే మరోసారి ప్రత్యర్థి జట్టు విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించాడు. సామాజిక మాధ్యమాల్లో అర్హదీప్ పై జరుగుతున్న ట్రోలింగ్ పై రోహిత్ స్పందించాడు. 


సూపర్- 4 లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచులో అర్హదీప్ ముఖ్యమైన క్యాచ్ వదిలేశాడు. దీంతో అతనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. చాలామంది ఆ బౌలర్ ను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై కెప్టెన్ రోహిత్ స్పందిస్తూ.. అర్హదీప్ కు మద్దతుగా నిలిచాడు. ఒత్తిడి సమయంలో క్యాచ్‌లు జారవిడవడం సహజమేనన్నాడు. క్యాచ్ చేజారినందుకు అర్హదీప్ నిరుత్సాహానికి గురయ్యాడని.. అయితే సోషల్ మీడియా ట్రోల్స్ గురించి పట్టించుకోలేదని తెలిపాడు. అర్హదీప్ యువకుడు అయినప్పటికీ.. చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడని ప్రశంసించాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ లో క్యాచ్ వదిలేసినప్పటికీ ఆఖరి ఓవర్ వేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకొచ్చాడని అభినందించాడు. అలానే ఆ ఓవర్లో అసిఫ్ అలీని ఔట్ చేయడమే కాక అద్భుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు. మానసికంగా దృఢంగా లేకపోతే అది సాధ్యం కాదని రోహిత్ అన్నాడు. 


జట్టులోకి వచ్చిన కొద్ది కాలంలోనే అర్హదీప్ సింగ్ మంచి బౌలర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 టీ20ల్లో 7.60 ఎకానమీతో 13 వికెట్లు తీసుకున్నాడు. అవకాశం వచ్చిన ప్రతిసారి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అందుకే ఆఖరి ఓవర్లలో బౌలింగ్ చేసే అవకాశాన్ని దక్కించుకుంటున్నాడు. 


భువనేశ్వర్ కుమార్ ఫామ్ పైనా రోహిత్ మాట్లాడాడు. భువి అనుభవమున్న బౌలర్ అని.. 2 మ్యాచుల్లో బాగా రాణించనంత మాత్రాన ఏం కాదన్నాడు. అతని నేతృత్వంలో ఆసియా కప్ లో కుర్రాళ్లు ఎంతో నేర్చుకుంటున్నారని చెప్పాడు. గత రెండు మ్యాచుల్లో భువీ 8 ఓవర్లు వేసి 70 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక వికెట్ మాత్రమే తీశాడు. ముఖ్యంగా పాక్, శ్రీలంకలతో మ్యాచుల్లో 19వ ఓవర్ వేసి ధారాళంగా పరుగులు ఇచ్చాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సీనియర్ బౌలర్ కు కెప్టెన్ అండగా నిలిచాడు.