India vs Pakistan, Asia Cup 2022, Super 4 Match: ఆసియా కప్‌ 2022లో తొలి సూపర్‌-4 మ్యాచుకు దాయాదులు సిద్ధం! తిరుగులేని ఆధిపత్యం ఇలాగే కొనసాగించాలని టీమ్‌ఇండియా అనుకుంటోంది. లీగు మ్యాచులో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్‌ పట్టుదలగా ఉంది. రెండు జట్లలోనూ ప్రధాన పేసర్లు గాయాలతో దూరమయ్యారు. నేటి మ్యాచుకు అవేశ్‌ ఖాన్‌ డౌట్‌ఫుల్‌! మరి గెలుపెవరిది? తుది జట్లలో ఎవరుంటారు? ఎవరి వ్యూహాలేంటి?


వెంటవెంటనే


2018, ఆసియాకప్‌ తర్వాత దాయాదులు వెంటవెంటనే రెండు మ్యాచుల్లో తలపడటం ఇదే తొలిసారి. సూపర్‌-4లో తొలి రెండు స్థానాల్లో నిలిస్తే వచ్చే ఆదివారం ఫైనల్లో మళ్లీ చూస్తాం. మరో రెండు నెలల వ్యవధిలో మళ్లీ 2 మ్యాచులు చూసే అవకాశం ఉంది. ప్రస్తుత మ్యాచులో టీమ్‌ఇండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. జస్ప్రీత్‌ బుమ్రా, హర్షల్‌ పటేల్‌ లేనప్పటికీ యువ పేస్‌ విభాగం రాణిస్తోంది. ఆసియాకప్‌లో భారత్, పాక్‌ తలపడ్డ చివరి నాలుగు మ్యాచుల్లో హిట్‌మ్యాన్‌ సేనదే విజయం. ప్రతిసారీ ఛేదన ద్వారానే గెలిచింది. ఇప్పటి వరకు టోర్నీ చరిత్రలో వీరిద్దరూ 14 సార్లు తలపడగా టీమ్‌ఇండియా 9 సార్లు గెలిచింది.


అవేశ్‌ ఆడతాడా?


టీమ్‌ఇండియాకు ఈ మ్యాచ్‌ అనుకున్నంత సులువేం కాదు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ లోపలికి వచ్చే బంతులకు ఇబ్బంది పడుతున్నారు. నసీమ్‌తో మళ్లీ వీరికి ప్రమాదం పొంచి ఉంది. హిట్‌మ్యాన్‌కు అయితే పాక్‌పై సగటు, స్ట్రైక్‌రేట్‌ మరీ ఘోరంగా ఉంది. పాక్‌పై చివరి 8 ఇన్నింగ్సుల్లో అతడు 3 సార్లు 2 బంతుల్లోపే ఔటయ్యాడు. విరాట్‌ కోహ్లీ ఫామ్‌లోకి రావడం శుభ పరిణామం. సూర్య కుమార్‌, హార్దిక్‌ పాండ్య వీరోచిత ఫామ్‌లో ఉన్నారు. దినేశ్‌ కార్తీక్‌ ఆడటం ఖాయమే! రిషభ్ పంత్‌ పరిస్థితి తెలియడం లేదు. ఒకవేళ రాహుల్‌ బదులు అతడిని ఆడిస్తే ఆశ్చర్యమే! జడ్డూ లేకపోవడంతో అక్షర్‌ ఆడతాడు. బంతి, బ్యాటుతో ఫామ్‌లో ఉన్నాడు. అవేశ్ ఖాన్‌ జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ మ్యాచ్‌ ఆడతాడో లేదో తెలీదు. అలాంటప్పుడు అశ్విన్ జట్టులోకి వస్తాడు. అర్షదీప్‌, యూజీ, భువీ రాణిస్తున్నారు. భారత్‌ మళ్లీ షార్ట్‌పిచ్‌ బంతుల వ్యూహమే అనుసరించొచ్చు.


ఎవరైనా ఆడొచ్చు!


పాకిస్థాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఇండియా బౌలర్లకు సవాల్‌ విసురుతున్నాడు. బాబర్‌ ఆజామ్‌ షార్ట్‌పిచ్‌ బంతులకు ఇబ్బంది పడుతున్నాడు. ఫకర్‌ జమాన్‌, కుష్ దిల్‌షా ఫామ్‌లోకి వచ్చారు. నాలుగో స్థానంలో ఇఫ్తికార్‌ రాణిస్తే ఫర్వాలేదు. మిడిలార్డర్లో మాత్రం ఇబ్బందులున్నాయి. హాంకాంగ్‌ మ్యాచులో బౌలర్లు షాబాద్‌ కాన్‌ (4-8), మహ్మద్‌ నవాజ్ (3-5) అదరగొట్టారు. షార్జాతో పోలిస్తే దుబాయ్‌లో ప్రభావం చూపకపోవచ్చు. గాయం కారణంగా మరో పేసర్‌ షానవాజ్‌ దహానీ మ్యాచుకు దూరమయ్యాడు. నసీమ్‌ షా, హ్యారిస్‌ రౌఫ్‌తో టీమ్‌ఇండియా జాగ్రత్తగా ఉండాల్సిందే.


పిచ్‌ ఎలా ఉందంటే?


దుబాయ్‌లో మధ్యాహ్నం 40 డిగ్రీల ఎండ ఉండనుంది. సాయంత్రానికి 2-3 డిగ్రీలు తగ్గొచ్చు. అప్పటికీ ఉక్కపోతతో ఇబ్బందే. పిచ్‌ పేసర్లకు అనుకూలించొచ్చు. పాతబడింది కాబట్టి స్పిన్నర్లూ ప్రభావం చూపుతారు. టాస్‌ గెలిచిన వారు సగం మ్యాచ్‌ గెలిచినట్టే.


భారత్‌ x పాక్‌ తుది జట్లు (అంచనా)


భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్ పంత్‌ / దినేశ్ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్ కుమార్‌, అవేశ్ ఖాన్‌ / అశ్విన్‌, అర్షదీప్‌ సింగ్‌, యుజ్వేంద్ర చాహల్‌


పాకిస్థాన్‌ : బాబర్‌ ఆజామ్‌ (కెప్టెన్‌), మహ్మద్‌ రిజ్వాన్‌, ఫకర్‌ జమాన్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, కుష్‌దిల్‌ షా, షాబాద్‌ ఖాన్‌, అసిఫ్‌ అలీ, మహ్మద్‌ నవాజ్‌, నసీమ్‌ షా, హ్యారిస్‌ రౌఫ్, హసన్‌ అలీ / మహ్మద్‌ హస్నైన్‌