Hafeez on Rohit sharma: రోహిత్ శర్మ భారత జట్టును ఎక్కువకాలం నడిపించలేడని పాకిస్థాన్ మాజీ ఆటగాడు మహ్మద్ హఫీజ్ అభిప్రాయపడ్డాడు. అతను ఎందుకో భయంగా, ఆందోళనగా కనిపిస్తున్నాడని అన్నాడు. హాంకాంగ్ తో మ్యాచ్ గెలిచిన తర్వాత రోహిత్ బాడీ లాంగ్వేజ్ గమనిస్తే ఎందుకో తేడాగా అనిపించిందని హఫీజ్ అన్నాడు. 


టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలి ఫామ్ అంతగా బాలేదు. ఈమధ్య చర్చంతా విరాట్ కోహ్లీపై జరుగుతోంది కాబట్టి.. రోహిత్ ఫాంను ఎవరూ పట్టించుకోవడంలేదు. ఐపీఎల్ 2022 లోనూ రాణించలేదు. ఆసియా కప్ లోనూ 2 మ్యాచుల్లో కలిపి కేవలం 33 పరుగులే చేశాడు. హాంకాంగ్ తో మ్యాచ్ లో దూకుడుగా ఆడినప్పటికీ.. పాక్ తో మ్యాచ్ లో పూర్తిగా తేలిపోయాడు. దీనిపైనే మహ్మద్ హఫీజ్ స్పందించాడు. 


రోహిత్ ఇటీవల పెద్ద ఇన్నింగ్స్ ఆడట్లేదని.. ఇలా అయితే రాబోయే టీ20 ప్రపంచకప్ లో భారత్ కు కష్టాలు తప్పవని హఫీజ్ హెచ్చరించాడు. ఆసియా కప్ లోనూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడని అన్నాడు. అతని మీద కెప్టెన్సీ భారం పడుతున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. 


హాంకాంగ్ తో మ్యాచ్ కు ముందు టాస్ వేయడానికి వచ్చినప్పుడు తాను రోహిత్ శర్మను గమనించానని హఫీజ్ పేర్కొన్నాడు. అప్పుడు అతనెందుకో అలసిపోయినట్లుగా అనిపించాడని చెప్పాడు. బలహీనంగా, అలసిపోయినట్లుగా ఉన్నాడని.. ఇదివరకెప్పుడూ అతనిలో అలాంటి ఎక్స్ ప్రెషన్స్ చూడలేదన్నాడు.  మీడియాతో మాట్లాడేటప్పుడు చాలా విషయాల గురించి మాట్లాడుతున్నాడు కానీ.. అది అతని బాడీ లాంగ్వేజ్ లో కనిపించట్లేదని ఈ పాకిస్థానీ మాజీ ప్లేయర్ అన్నాడు.


 కెప్టెన్సీ భారమో, ఫాం లేమో, వయసు ప్రభావమో  తెలియదు కానీ రోహిత్ చాలా  బలహీనంగా కనిపిస్తున్నాడని అన్నాడు. మాట్లాడడం చాలా తేలిక.. చేయడమే కష్టమని వ్యాఖ్యానించాడు.  టీమిండియా జట్టును ఎక్కువకాలం రోహిత్ నడిపించలేడని.. దీనిపై జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తోందని హఫీజ్ అభిప్రాయపడ్డాడు.