ఆసియా కప్- 2022 ను భారత్ గెలుచుకుంటుందని.. ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు.  శ్రీలంకలో జరగాల్సిన ఈ టోర్నమెంట్ యూఏఈకి మారిన సంగతి తెలిసిందే. దుబాయ్, షార్జాలలో జరిగే ఈ మ్యాచ్ లు ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానున్నాయి.


ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్ తో జరిగిన ఐసీసీ రివ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నాడు వాట్సన్. పాకిస్థాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ ను ఓడించగలనని అనుకుంటోందని వాట్సన్ అన్నాడు. వారి మధ్య పోరు చాలా ప్రత్యేకంగా ఉంటుందని తెలిపాడు. ఆ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారే కప్ అందుకుంటారని జోస్యం చెప్పాడు. అయితే తాను మాత్రం టీమిండియానే పాక్ తో మ్యాచ్ గెలవటంతో పాటు ట్రోఫీని అందుకుంటుందని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. భారత్ బ్యాటింగ్ ఆర్డర్ చాలా బలంగా ఉందని.. వారిని నియంత్రించడం ఏ జట్టుకైనా కష్టమేనన్నాడు. 


ఇప్పటివరకు భారత్ 7 సార్లు ఆసియా కప్ ను అందుకుంది. 2016లో టీ20 ఫార్మాట్ లో, 2018లో వన్డే ఫార్మాట్ లో ఛాంపియన్ గా నిలిచి ట్రోఫీని కాపాడుకుంది. 2018 లో కప్ గెలిచినప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నాడు. మరలా ఇప్పుడు రోహితే జట్టును నడిపించనున్నాడు. 


ఆగస్టు 28న చిరకాల ప్రత్యర్థి పాక్ తో మ్యాచ్ తో భారత్ ఆసియా కప్ లో ఖాతా తెరవనుంది. ఈ టోర్నమెంట్ లో 3 సార్లు పాకిస్థాన్ ను టీమిండియా ఓడించింది. అయితే 2021 టీ20 ప్రపంచ కప్ లో భారత్ పై పాక్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్ తర్వాత ఈ రెండు జట్లు తలపడడం ఇదే మొదటిసారి. భారత్, పాక్ తో పాటు శ్రీలంక, అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ లు ఆసియా కప్ లో పాల్గొంటున్నాయి. ఆరో జట్టుగా సింగపూర్, కువైట్, యూఏఈ, హాంకాంగ్ నుంచి ఒక జట్టును ఎంపిక చేయనున్నారు. 


రోహిత్ శర్మ కెప్టెన్సీలో యూఏఈలో 8వ ఆసియా కప్ టైటిల్ ను కైవసం చేసుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. పాకిస్థాన్ రెండు సార్లు కప్ ను అందుకుంది. శ్రీలంక 5 సార్లు టైటిల్ ను ముద్దాడి రెండో స్థానంలో ఉంది. 


ఆసియా కప్‌కు భారత జట్టు


రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్