Ashes Series 2023: ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియాల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక జట్టు (ఆసీస్) విజయం దిశగా సాగుతోంది. ఇంగ్లాండ్ బజ్‌బాల్ దూకుడుకు ఆసీస్ షాకిచ్చేట్టే కనిపిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 280 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. ఆట ఆఖరి రోజు అయిన మంగళవారం కంగారూల విజయానికి 174 పరుగులు అవసరం కాగా ఇంగ్లాండ్ గెలవాలంటే ఏడు వికెట్లు తీయాలి. విజేత ఎవరైనా ఈ మ్యాచ్‌లో ఆసక్తికర ముగింపు మాత్రం తథ్యం..
నిలబడ్డ ఖవాజా..
280 పరుగుల లక్ష్య ఛేదనను ఆస్ట్రేలియా మెరుగ్గానే ఆరంభించింది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన డేవిడ్ వార్నర్ (57 బంతుల్లో 36, 4 ఫోర్లు) రెండో ఇన్నింగ్స్ లో ఫర్వాలేదనిపించాడు. ఉస్మాన్ ఖవాజా (81 బంతుల్లో 34, 6 ఫోర్లు) తో కలిసి తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించాడు. సెంచరీ భాగస్వామ్యం దిశగా సాగుతున్న ఈ జోడీని రాబిన్సన్ విడదీశాడు. అతడు వేసిన 18వ ఓవర్లో నాలుగో బంతిని వార్నర్.. వికెట్ కీపర్ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చాడు.
వార్నర్ నిష్క్రమించిన తర్వాత ఆసీస్‌కు వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ రెండు భారీ స్ట్రోకులిచ్చాడు. టెస్టులలో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ (15 బంతుల్లో 13, 3 ఫోర్లు) తో పాటు స్టీవ్ స్మిత్ (13 బంతుల్లో 6, 1 ఫోర్) ను పెవిలియన్‌కు పంపాడు. వార్నర్, స్మిత్, లబూషేన్ నిష్క్రమించినా తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖవాజా మాత్రం క్రీజులో ఉన్నాడు.
వీళ్లు నిలబడితే..
ఆఖరి రోజు ఆసీస్ విజయానికి 90 ఓవర్లలో 174 పరుగులు కావాలి. చేతిలో ఇంకా ఏడు వికెట్లున్నాయి. ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ లు మెయిన్ బ్యాటర్స్. ఆసీస్ సారథి పాట్ కమిన్స్ కూడా బ్యాటింగ్ చేయగలడు. వీరితో పాటు నైట్ వాచ్‌మెన్ గా ఉన్న స్కాట్ బొలాండ్ (13 నాటౌట్) కాసేపు ఖవాజాకు తోడుగా ఉంటే ఈ లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదు. అదీగాక పిచ్ కూడా బ్యాటింగ్ కు అనుకూలంగానే ఉండటంతో ఆసీస్ విజయంపై ధీమాగా ఉంది.
మరోవైపు ఇంగ్లాండ్ విజయం ఆ బౌలింగ్ త్రయం జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్ తో పాటు బెన్ స్టోక్స్ మీద ఆధారపడి ఉంది. మోయిన్ అలీ కూడా ఆఖరి రోజు కీలకంగా మారుతాడు. వీళ్లంతా ఆసీస్ ను నిలువరిస్తేనే ఇంగ్లాండ్ ‘బజ్ బాల్’ పరువు నిలుస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో ఫస్ట్ రోజే 78 ఓవర్లకే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన ధైర్యం, తెగువ.. ఆఖరి రోజు వికెట్లు తీయడంలో కూడా చూపితేనే ఆ జట్టుకు మంచిది. లేదంటే బజ్ బాల్ నవ్వులపాలు కావడం ఖాయం..!
ఇంగ్లాండ్ ఆలౌట్..
మూడో రోజు 27 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్‌కు జో రూట్ (55 బంతుల్లో 46, 5 ఫోర్లు, 1 సిక్సర్), ఓలీ పోప్ (16 బంతుల్లో 14, 2 ఫోర్లు) మూడో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హ్యారీ బ్రూక్ (55 బంతుల్లో 46, 5 ఫోర్లు) తో కలిసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను నడిపించిన రూట్‌ను స్పిన్నర్ నాథన్ లియాన్ పెవిలియన్ చేర్చాడు. కొద్దిసేపటికే బ్రూక్ కూడా లియాన్ బౌలింగ్‌లోనే లబూషేన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (66 బంతుల్లో 43, 5 ఫోర్లు) నెమ్మదించగా బెయిర్‌స్టో (39 బంతుల్లో 20, 2 ఫోర్లు) ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. బెయిర్‌స్టోను లియాన్ వికెట్ల ముందు బలిగొనగా.. స్టోక్స్‌ను కమిన్స్ ఎల్బీగా వెనక్కిపంపాడు. మోయిన్ అలీ (31 బంతుల్లో 19, 2 ఫోర్లు, 1 సిక్స్) రాబిన్సన్ (44 బంతుల్లో27, 2 ఫోర్లు) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. జేమ్స్ అండర్సన్ (12) ను కమిన్స్ ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 273 పరుగుల వద్ద ముగిసింది.