AUS vs ENG 4th Test: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ నాలుగో టెస్టును నాలుగు రోజుల్లోనే ముగించి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని భావించిన ఇంగ్లాండ్ జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భాగంగా ఆట నాలుగో రోజు వరుణుడు అడ్డుకోవడం ఇంగ్లాండ్‌కు చికాకు తెప్పించింది. వరుణుడి స్పెషల్ అప్పీయరెన్స్‌కు తోడు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబూషేన్ (173 బంతుల్లో 111, 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో విసిగించి ఇంగ్లాండ్ విజయాన్ని అడ్డుకున్నాడు.
ఓవర్ నైట్ స్కోరు 113-4తో నాలుగో రోజు ఆట ఆరంభం కావాల్సి ఉండగా మాంచెస్టర్‌లో తొలి మూడు రోజులు ఆటను అడ్డుకోని వరుణుడు నాలుగో రోజు మాత్రం ఆసీస్‌కు అండగా నిలిచాడు. వర్షం కారణంగా తొలి సెషన్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది.
వర్షం కాస్త తెరిపినివ్వడంతో లంచ్ తర్వాత ఆట ఆరంభమైంది. 44 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ స్టార్ బ్యాటర్ లబూషేన్.. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థంగా అడ్డుకున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడకపోయిన లబూషేన్.. ఆసీస్‌కు అత్యంత కీలక సమయంలో ఆడటం గమనార్హం. బెన్ స్టోక్స్ తన బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా లబూషేన్ వికెట్‌ను కాపాడుకున్నాడు. మిచెల్ మార్ష్ (107 బంతుల్లో 31 నాటౌట్, 4 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 103 పరుగులు జోడించాడు. ఈ జోడీ జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, మోయిన్ అలీలను సమర్థవంతంగా ఎదుర్కుంది.
సెంచరీ తర్వాత లబూషేన్.. జో రూట్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. లబూషేన్ స్థానంలో కామెరూన్ గ్రీన్ (15 బంతుల్లో 3 నాటౌట్) క్రీజులోకి వచ్చాడు. అయితే టీ విరామానికి ఆస్ట్రేలియా.. 71 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. టీ తర్వాత మాంచెస్టర్‌లో మళ్లీ వరుణుడు తన ప్రతాపాన్ని చూపెట్టాడు. దీంతో మూడో సెషన్‌లో ఒక్క బంతి కూడా పడలేదు. నిన్న రోజు మొత్తం 30 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ప్రస్తుతం మార్ష్, గ్రీన్ క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్.. ఇంకా 61 పరుగులు వెనుకబడి ఉంది.
నాలుగో రోజుతో పాటు ఆట చివరిరోజైన నేడు కూడా మాంచెస్టర్‌లో వర్షం తప్పేలా లేదు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఆదివారం కూడా మాంచెస్టర్‌లో మధ్యాహ్నం 12- 2 గంటల వరకూ.. సాయంత్రం నాలుగింటి నుంచి రాత్రి 8 గంటల వరకూ వర్షం కురిసే అవకాశాలున్నాయి. ఆదివారం కూడా ఆట సాగేది కష్టమేనని తెలుస్తున్నది. ఇది ఆస్ట్రేలియాకు గుడ్ న్యూసే అయినా ఇంగ్లాండ్‌ను మాత్రం తీవ్రంగా నిరాశపరిచేదే. ఈ సిరీస్‌లో వరుసగా రెండు టెస్టులు ఓడి తర్వాత లీడ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో గెలిచి.. మాంచెస్టర్ టెస్టు కూడా గెలుచుకునేందుకు బాటలు వేసుకున్న ఇంగ్లాండ్‌ను ఇది తీవ్రంగా నిరాశపరిచేదే..!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial