Arshdeep Singh Bamboozles Babar Azam: ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్ 12 తొలి మ్యాచులో టీమ్‌ఇండియా అదరగొడుతోంది. పేసర్లు సూపర్‌గా బౌలింగ్ చేస్తున్నారు. పాకిస్థాన్‌ను ఇబ్బంది పెడుతున్నారు. యువ బౌలర్ అర్షదీప్ సింగ్ అద్భుతం చేశాడు. ఓపెనర్లు ఇద్దరినీ పెవిలియన్‌కు పంపించాడు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి సైతం అతడికి తోడుగా నిలిచారు.
టీమ్‌ఇండియా యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని అర్షదీప్ నిలబెట్టుకున్నాడు. కుర్రాడే అయినా చక్కని బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. పాకిస్థాన్ జట్టులో అత్యంత కీలకమైన ఓపెనర్లు బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్‌ను ఔట్ చేశాడు. ఆకాశంలో మబ్బులు ఉండటం, గాల్లో తేమ ఎక్కువగా ఉండటంతో అతడు బంతిని రెండువైపులా స్వింగ్ చేశాడు. అలాగే బౌన్సర్లు వేసి ఇబ్బంది పెట్టాడు. పాక్ ఇన్నింగ్సులో అందుకున్న తొలి బంతికే అతడు బాబర్ ఆజామ్‌ను ఎల్బీ చేశాడు. సర్రున దూసుకొచ్చిన బంతి బ్యాటును దాటుకొని బ్యాటర్ ప్యాడ్లకు తాకింది. రివ్యూ తీసుకున్నా ఫలితం దక్కలేదు. దాంతో ఒక్క పరుగు వద్దే పాక్ తొలి వికెట్ చేజార్చుకుంది.
మహ్మద్ రిజ్వాన్ (4) వికెట్ తీసిన విధానం ఇంకా అద్భుతం. అర్షదీప్ ఇన్‌స్వింగర్లు, ఔట్ స్వింగర్లతో మొదట బ్యాటర్‌ను సెటప్ చేశాడు. 3.5 బంతికే అతనాడిన బంతి ఫార్ట్‌పిచ్‌లో గాల్లోకి లేచింది. విరాట్ కోహ్లీ డైవ్ చేసి మరీ బంతి అందుకొనేందుకు ప్రయత్నించాడు. కాస్తలో మిస్సైంది. ఆ తర్వాత బంతిని అర్షదీప్ బౌన్సర్‌గా విసిరాడు. రిజ్వాన్ దానిని ఫైన్‌లెగ్‌లోకి ఆడాడు. గాల్లోకి లేచిన బంతిని భువనేశ్వర్ అందుకున్నాడు.
పాకిస్థాన్ జట్టులో కెప్టెన్ బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వానే అత్యంత కీలకం. 2020 తర్వాత వీరిద్దరూ జట్టు స్కోరులో 50 శాతం కంట్రిబ్యూట్ చేశారు. అంటే పాక్ వారిపై ఎంత ఆధారపడిందో తెలిసిందే. అందుకే వీరిద్దరినీ పెవిలియన్ పంపించడం ద్వారా ప్రత్యర్థిని అర్షదీప్ భారీ దెబ్బకొట్టాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అతడిపై పొగడ్తల వర్షం కురుస్తోంది.