Sandeep Lamichane: సందీప్ లామిచానే.. నేపాల్ క్రికెటర్. ఆ దేశ జాతీయ జట్టుకు కెప్టెన్. ఐపీఎల్, బిగ్ బాష్, సీపీఎల్ వంటి లీగుల్లోనూ ఆడతాడు. దిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ జట్టు అభిమానులకు అతను సుపరిచితమే. లెగ్ స్పిన్ వేసే లామిచానే 2018 నుంచి 2020 వరకు దిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఇప్పుడతను ఓ కేసు విషయమై పరారీలో ఉన్నాడు. అత్యాచారం ఆరోపణలు రావడం, వివరణ తీసుకోకుండా అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో నేపాల్ క్రికెట్ లో కలకలం రేపుతోంది.
ఇదీ ఆరోపణ
22 ఏళ్ల సందీప్ లామిచానే 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. అతనిపై నేపాల్ లో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈ ఆరోపణలతో జాతీయ జట్టు నుంచి అతడిని సస్పెండ్ చేశారు. అతడిని పట్టుకునేందుకు నేపాల్ ప్రభుత్వం తాజాగా ఇంటర్ పోల్ సాయం కోరింది. దాంతో ఇంటర్ పోల్ సందీప్ సమాచారం తెలియజేయాలంటూ సభ్య దేశాలకు నోటీసులు జారీచేసింది. అతన్ని పట్టుకునేందుకు సమన్వయంతో వ్యవహరించాలని ఆయా దేశాలను కోరింది. ప్రస్తుతం లామిచానే కరీబియన్ దీవుల్లో సీపీఎల్ టోర్నీలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
దీనిపై పోరాడతాను
తనపై వచ్చిన ఆరోపణలపై సందీప్ లామిచానే స్పందించాడు. అవన్నీ నిరాధారమైనవని.. వాటిపై పోరాడతానని చెప్పాడు. త్వరలోనే నేపాల్ కు వస్తానని స్పష్టం చేశాడు. తనపై అరెస్ట్ వారెంట్ జారీ కావడం తీవ్రంగా కలచివేసిందని అన్నాడు. తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని నిరూపిస్తానని అన్నాడు. ప్రస్తుతం తన మానసిక, శారీరక ఆరోగ్యం బాగా లేనందున ఐసోలేషన్ లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపాడు. అయితే తనెక్కడున్నది చెప్పలేదు.
క్రికెట్ లో రికార్డులు
సందీప్ లామిచానే పేరున పలు క్రికెట్ రికార్డులు ఉన్నాయి. ప్రపంచంలోని లీగులన్నింటిలోనూ ఆడిన ఏకైక ఆటగాడిగా రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇందులో ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్, సీపీఎల్ వంటివి ఉన్నాయి. అంతేకాదు, వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసుకున్న రెండో బౌలర్‌గా, టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ ఏడాది ఆగస్టులో కెన్యాతో చివరిసారి టీ20 సిరీస్‌లో ఆడాడు. ఆ తర్వాత అతడు సీపీఎల్‌లో జమైకా తల్లావాస్‌కు ఆడాల్సి ఉన్నప్పటికీ మైదానంలో కనిపించలేదు. సందీప్‌పై విచారణ పూర్తయ్యే వరకు అతడిపై సస్పెన్షన్ కొనసాగుతుందని నేపాల్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.