Andrew Flintof: ఇంగ్లాండ్  క్రికెట్ జట్టు ప్రపంచానికి అందించిన ఆల్ రౌండర్లలో  దిగ్గజ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ అని  చెప్పడంలో సందేహమే అవసరం లేదు. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో యువరాజ్ సింగ్‌తో గొడవపడ్డాక అతడు  భారత అభిమానులకు కూడా సుపరిచితమయ్యాడు.  2000వ దశకంలో  ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఈ మాజీ ఆల్ రౌండర్‌ మీడియాలో కనిపించక చాలా కాలమైంది. గతేడాది  ఓ కారు ప్రమాదానికి గురైన ఫ్లింటాఫ్.. తొమ్మిది నెలల  తర్వాత   ప్రజల ముందుకువచ్చాడు. ముఖం మీద గాయాలతో అసలు గుర్తుపట్టరాకుండా అయిపోయిన ఫ్లింటాఫ్‌ను చూసి  క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 


ఆరు అడుగుల ఎత్తు,  అందుకు తగ్గ బరువుతో హాలీవుడ్  సినిమాలలో హల్క్‌లా ఉండే  ఫ్లింటాప్ ముఖమంతా పాలిపోయి   గాయాలతో ముక్కు,  పెదవి దగ్గర గాయాలతో  గుర్తుపట్టకుండా మారిపోయాడు.  ఐ సినిమాలో ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత మరుగుజ్జుగా  ఉండే విక్రమ్‌ను పోలి ఉన్నట్టు అనిపించక మానదు.  ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ మధ్య కార్డిఫ్ వేదికగా జరిగిన  తొలి వన్డేకు ఫ్లింటాఫ్ హాజరయ్యాడు.   పెవిలియన్‌లో ఉన్న బాల్కనీ నుంచి ఇంగ్లాండ్ కోచింగ్ స్టాఫ్  డ్రెస్ కోడ్ వేసుకుని  మ్యాచ్‌ను వీక్షించాడు. 


 






గతేడాది డిసెంబర్‌లో ఫ్లింటాఫ్  ప్రముఖ టీవీ ఛానెల్ బీబీసీ నిర్వహించిన ‘టాప్ గేర్’ షో లో  ఎపిసోడ్ షూట్ చేస్తుండగా ఫ్లింటాఫ్‌ కారు ప్రమాదానికి గురైంది.  తీవ్రమైన గాయాలతో  రక్తపు మడుగులో ఉన్న ఫ్లింటాఫ్‌ను  ప్రత్యేక హెలికాప్టర్‌లో తరలించి చికిత్స అందించారు.   ఈ ప్రమాదంలో  ఫ్లింటాఫ్  పక్కటెముకలు విరగడమే గాక  ముఖం, దవడలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రమాదం తర్వాత ఫ్లింటాఫ్  బయట ప్రజలకు కనిపించడం ఇదే ప్రథమం. 


ప్రస్తుతం ఇంగ్లాండ్ వన్డే జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న రాబ్ కీ.. ఫ్లింటాఫ్ మిత్రుడు. ఇంగ్లాండ్  జట్టు ప్రత్యేక ఆహ్వానం మేరకు ఫ్లింటాఫ్ కార్డిఫ్‌లో మ్యాచ్ చూసేందుకు వచ్చాడు.  ఈ సందర్భంగా కెమెరాలు ఫ్లింటాఫ్ మీదే దృష్టి సారించాయి. ఇక సోషల్ మీడియాలో ఫ్లింటాఫ్  ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  ఫ్లింటాఫ్ కార్డిఫ్‌కు రావడం, ఇంగ్లాండ్  కోచింగ్ సిబ్బందితో కలిసి మ్యాచ్ చూడటంతో  అతడు రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో జట్టుకు ఏమైనా సేవలందించనున్నాడా..? అన్న అనుమానాలు కూడా వెల్లువెత్తిన నేపథ్యంలో ఇంగ్లీష్ సారథి  జోస్ బట్లర్ స్పందించాడు. అలాంటిదేమీ లేదని, ఆయన కేవలం మ్యాచ్ చూడటానికే వచ్చారని  వెల్లడించాడు. 


 






కాగా ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ మధ్య శుక్రవారం జరిగిన తొలి వన్డేలో కివీస్  జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.  ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది.  డేవిడ్ మలన్  (54), జోస్ బట్లర్ (72), లివింగ్‌స్టన్ (52) మెరుపులు మెరిపించారు. గతేడాది ఆగస్టు తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి  ప్రపంచకప్ నేపథ్యంలో పునరాగమనం చేసిన   బెన్ స్టోక్స్.. 69 బంతుల్లో 3 బౌండరీలు, ఓ సిక్సర్ సాయంతో  52 పరుగులు చేశాడు. అయితే లక్ష్యాన్ని  కివీస్.. 45.4 ఓవర్లలోనే ఊదేసింది.  ఓపెనర్ డెవాన్ కాన్వే (111 నాటౌట్), డారిల్ మిచెల్ (118 నాటౌట్)లు కివీస్‌కు ఈజీ విక్టరీని అందించారు. 































ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial