ICC Mens Cricket ODI World Cup 2023: ఒకవైపు ఆసియా కప్ - 2023 పాకిస్తాన్ నుంచి తరిలిపోతుందని వార్తలు వస్తుండగా మరోవైపు  అలా అయితే తాము  టోర్నీని బహిష్కరిస్తామని  పాక్ క్రికెట్ బోర్డు  (పీసీబీ)  బెదిరిస్తుండటం, వన్డే వరల్డ్ కప్ లో కూడా ఆడేందుకు  ఇండియాకు రాబోమని చెబుతుండటం  క్రికెట్  వర్గాలలో  తీవ్ర చర్చకు దారి తీసింది.   గడిచిన రెండ్రోజులుగా దుబాయ్‌లోనే మకాం వేసిన  పీసీబీ చీఫ్ నజమ్ సేథీ.. తాజాగా వన్డే వరల్డ్ కప్ లో  పాకిస్తాన్ పాల్గొనడం,   బీసీసీఐ  సెక్రటరీ  జై షా తీరు గురించి ఆసక్తకిర వ్యాఖ్యలు చేశాడు.  


ఆసియా కప్‌ను మరోచోటకు తరలించడంపై పీసీబీ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ  ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న జై షాకు  నివేదిక అందజేశాడు నజమ్ సేథీ.  ఈ సందర్భంగా జై షాతో  తాను మాట్లాడినట్టు ఆయన చెప్పుకొచ్చాడు. సేథీ మాట్లాడుతూ.. ‘‘నాకు జై షా తో వ్యక్తిగత విబేధాలేమీ లేవు. మేము  చాలా విషయాలపై సుదీర్ఘ సెషన్స్ లో చర్చించుకున్నాం.   ఇద్దరమూ స్నేహపూర్వకంగానే ఉంటాం.. 


అయితే  నేను  జై షాను మీరు పాకిస్తాన్ కు ఎందుకు రారు..?  మా దేశానికి రాకపోవడానికి కారణమేంటని అడిగితే  అతడు చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకున్నాడు.  నేను మళ్లీ అదే ప్రశ్న అడగ్గా..  ‘సరే. పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు.  దీని గురించి ఇప్పుడు చర్చ వద్దు. ఈ సమస్య (ఆసియా కప్)కు ఒక పరిష్కారం  కనుగొందాం..’అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు’ అని  సేథీ తెలిపాడు.  


 






ఆసియా కప్‌ను  పాకిస్తాన్‌లో నిర్వహిస్తే తాము ఆడబోమని బీసీసీఐ గతంలోనే వెల్లడించగా  ఈ ఫిబ్రవరిలో హైబ్రిడ్ మోడల్ ను  ప్రతిపాదించిన విషయం తెలిసిందే. భారత్  ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలో నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. కానీ కొద్దిరోజుల క్రితమే  శ్రీలంక, బంగ్లాదేశ్ లు కూడా తాము పాకిస్తాన్ లో ఆడబోమని ఝలక్ ఇవ్వడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.  ఇక వన్డే వరల్డ్ కప్ లో  కూడా తాము భారత్ కు వచ్చేది లేదని, అందుకు తమ ప్రభుత్వం ఒప్పుకోదని, ప్రపంచకప్ లో పాకిస్తాన్ ఆడబోయే  మ్యాచ్ లను తటస్థ వేదికగా నిర్వహిస్తేనే తాము ఈ టోర్నీ ఆడతామని పీసీబీ  హెచ్చరిస్తున్నది. 


 






ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుంది..?   పాకిస్తాన్ మంకు పట్టును వీడకుంటే  ఆ జట్టు వరల్డ్ కప్ ఆడుతుందా..? అన్నది   క్రికెట్ వర్గాలలో ఆందోళన కలిగిస్తున్నది. ఏం చేసినా  ఈ విషయంలో పాకిస్తాన్.. బీసీసీఐ, ఐసీసీ సలహాలు పాటించకుంటే ఆ క్రికెట్ బోర్డుకే నష్టమన్నది విశ్లేషకులు చెబుతున్న మాట...!