Aimal Khan: పాకిస్థాన్ వర్ధమాన క్రికెటర్ ఐమల్ ఖాన్ ఇప్పుడు చర్చల్లో నలుగుతున్నాడు. అయితే అది ఆటలో అతను చూపిన ప్రతిభ వల్ల కాదు. అతని వయసు కారణంగా. అసలేం జరిగిందంటే..
పాకిస్థాన్ సూపర్ లీగ్ లో నిన్న ఇస్లామాబాద్ యునైటెడ్- క్వెట్టా గ్లాడియేటర్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో క్వెట్టా తరఫున యువ బౌలర్ 16 ఏళ్ల ఐమల్ ఖాన్ అరంగేట్రం చేశాడు. అయితే ఇప్పుడు అతని వయసుపై చర్చ జరుగుతోంది. రికార్డుల ప్రకారం అతని వయసు 16 ఏళ్లుగా ఉన్నప్పటికీ.. చూడడానికి మాత్రం ఐమల్ 20 ఏళ్ల వయసుగల వాడిగా కనిపిస్తున్నాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పాక్ జర్నలిస్ట్ సాజ్ సాదిక్ ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ మ్యాచ్ లో ఇస్లామాబాద్ యునైటెడ్స్ గెలుపొందింది. క్వెట్టా తరఫున ఆడిన ఐమల్ ఖాన్ భారీగా పరుగులిచ్చుకున్నాడు. 4 ఓవర్ల కోటాలో 55 పరుగులు సమర్పించుకున్నాడు. ఒకే ఒక వికెట్ తీశాడు. క్రికెట్ రికార్డుల ప్రకారం ఐమల్ ఖాన్ వయసు 16 సంవత్సరాల 246 రోజులుగా నమోదై ఉంది. 2006 జూన్, 24న పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంక్వాలో అతడు జన్మించాడు. ఇక్కడ పఠాన్ల జనాభా ఎక్కువ. రికార్డుల ప్రకారం ఐమల్ ఖాన్ వయసు 16 సంవత్సరాలే అయినప్పటికీ.. అతడిని చూస్తే 20ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అయితే ఇది పఠాన్ ల సాధారణ సమస్య అని కొందరంటున్నారు. వారు తమ వయసు కంటే పెద్దవారిగా కనిపిస్తారని వారంటున్నారు.
సైంటిఫిక్ టెస్ట్ ద్వారా నిర్ధారణ
ఇకపోతే పాకిస్థాన్ క్రికెట్ లో ఏజ్ స్కామ్ కొత్తదేమీ కాదు. షాహిద్ అఫ్రిది, ఇఫ్తికార్ అహ్మద్ లాంటి వారి వయసుల విషయంలోనూ విమర్శలు తలెత్తాయి. రమీజ్ రజా పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ గా ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఆపాలనుకున్నాడు. దానికోసం ఓ ప్రాజెక్ట్ ను తీసుకురావాలని నిర్ణయించారు. ఆటగాళ్ల వయసును నిర్ధారించడానికి సైంటిఫిక్ టెస్ట్ చేయించాలని అనుకున్నాడు. అయితే ఇప్పుడు రమీజ్ రజా పీసీబీ ఛైర్మన్ నుంచి తప్పుకున్నాడు. మరి ప్రస్తుతం ఉన్న బోర్డు పెద్దలు ఆ ప్రాజెక్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.