ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌(Film Maker) విధు వినోద్ చోప్రా  కుమారుడు అగ్ని చోప్రా(Agni Chopra) దేశవాళి ప్రతిష్టాత్మ టోర్నీ రంజీ ట్రోఫీ(Ranji Trophy 2024)లో చెలరేగిపోతున్నాడు. వరుసగా సెంచరీలు బాదేస్తూ టీమిండియా(Team India)లో స్థానం సంపాదించే దిశగా దూసుకెళ్తున్నాడు. రంజీ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్‌లోనే శతకంతో చెలరేగిన అగ్ని చోప్రా... రెండో మ్యాచ్‌లోనూ శతకంతో మెరిశాడు.


రంజీ ట్రోఫీలో భాగంగా మిజోరం తరఫున ఆడుతున్న ఈ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌.. వరుసగా రెండు సెంచరీలు చేశాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో సిక్కీంతో తొలి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 166, రెండో ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేసిన అగ్ని చోప్రా... నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా శతకంతో మెరిశాడు. మిజోరం తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన చోప్రా.. 150 బంతుల్లో 21 బౌండరీలు, 3 భారీ సిక్సర్ల సాయంతో 164 పరుగులు చేశాడు.


మ్యాచ్‌ సాగిందిలా..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నాగాలాండ్‌.. మిజోరం బౌలర్లు రాణించడంతో  211 పరుగులకు ఆలౌట్‌ అయింది. మిజోరం బౌలర్‌ మోహిత్‌ జాంగ్రా ఆరు వికెట్లతో నాగాలాండ్‌ పతనాన్ని శాసించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మిజోరం...అగ్ని చోప్రా భారీ శతకంతో 356 పరుగుల భారీ స్కోరు చేసింది. అగ్ని చోప్రా  150 బంతుల్లో 21 బౌండరీలు, 3 భారీ సిక్సర్ల సాయంతో 164 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో  ఆరు వికెట్లతో రాణించిన మోహిత్‌ జాంగ్రా.. బ్యాటింగ్‌లోనూ సెంచరీ చేసి రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో నాగాలాండ్‌ బలంగా పుంజుకుని భారీ స్కోరు చేసింది. రుపేరో 349 బంతుల్లో 179 పరుగులు చేసి నాగాలాండ్‌ను ఓటమి నుంచి కాపాడాడు. నాగాలాండ్‌ 463 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మిజోరం 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. నాలుగు రోజుల  ఆట సమయం ముగియడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా మోహిత్‌ జాంగ్రా 61 పరుగులతో రాణించాడు. 


అరంగేట్రంలోనే సెంచరీ 
అగ్ని చోప్రా(Agni Chopra) రంజీ ట్రోఫీలో అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత శతకం సాధించి తన సత్తా చాటాడు. మిజోరం తరఫున ఆడుతున్న ఈ 25 కుర్రాడు సిక్కింతో జరిగిన తొలి మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో179 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స్‌లతో 166 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 74బంతుల్లో 92 పరుగులు చేసి అబ్బుర పరిచాడు. కానీ ఈ మ్యాచ్‌లో మిజోరం నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ప్రస్తుతం నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ అగ్ని చోప్రా అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 150 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్‌లతో 164 పరుగులు చేసి మరోసారి భారీ శతకం సాధించాడు. దీంతో మిజోరం 356 పరుగులకు ఆలౌటైంది. 1998లో అమెరికాలోని మిచిగాన్‌లో జన్మించిన అగ్ని చోప్రా.. అక్కడే క్రికెట్‌లో ఓనమాలు దిద్దాడు. అండర్‌ – 19 స్థాయిలో ముంబై తరఫున ఆడిన అతడు.. ఇటీవలే రంజీలలోకి ఎంట్రీ ఇచ్చాడు. ముంబై క్రికెట్‌లో ఉన్న పోటీ కారణంగా అగ్ని ప్రస్తుతం రంజీ సీజన్‌లో మిజోరం టీమ్‌కు ఆడుతున్నాడు. గతేడాది జరిగిన సయీద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీతో మిజోరం టీమ్‌కు అరంగేట్రం చేసిన అతడు.. రంజీలలో  ఇరగదీస్తున్నాడు.