ప్రపంచకప్‌లో అద్భుతాల అఫ్ఘానిస్థాన్ పోరాటం ముగిసింది. ఎటుచూసినా అంధకారమే ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి అంచనాలు లేకుండా భారత్‌లో అడుగుపెట్టిన అఫ్గాన్.. అద్భుత ప్రదర్శన చేసింది అబ్బురపరిచింది. మూడు ప్రపంచ ఛాంపియన్ జట్లను చిత్తు చేసి మరో ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించినంత పని చేసింది. అఫ్గాన్‌తో మ్యాచ్ అంటే అగ్ర జట్ల కూడా భయపడేలా... సమగ్ర వ్యూహంతో బరిలోకి దిగేలా చేసింది. ఈ వరల్డ్ కప్‌లో సెమీస్ చేరేందుకు మిగిలిన నాలుగో బెర్తు కోసం చివరి క్షణం వరకు అఫ్గాన్ రేసులో నిలిచిందంటే భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో ఆ జట్టు పోరాటం ఆకట్టుకుంది. ఒకప్పుడు బౌలింగ్‌లో సత్తా చాటి బ్యాటింగ్‌లో చేతులెత్తేసి ఓటమి పాలవ్వడం అప్గాన్‌కు సాంప్రదాయంగా ఉండేది. కానీ ఈ వరల్డ్‌కప్‌లో అప్గాన్ బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. ప్రపంచకప్ చరిత్రలోనే ఓ అఫ్గాన్ బ్యాటర్ సెంచరీ చేసి సత్తా చాటాడు. అంతేనా ఈ పోరాటాలతో అఫ్గాన్ ఇక పసికూన జట్టు కాదని.. అగ్ర జట్టని మాజీ క్రికెటర్లు తీర్మానం చేసేశారు.
ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంకను అప్గాన్ మట్టికరిపించింది. ఏదో ఒక జట్టుపై విజయం సాధిస్తే అది గాలివాటం అనుకోవచ్చు. కానీ అఫ్గాన్ జట్టు మూడు ప్రపంచ ఛాంపియన్ జట్లను చిత్తు చేసింది. అంతేనా ఆస్ట్రేలియాపై దాదాపు విజయం సాధించినంత పని చేసి కంగారులను కంగారు పెట్టింది. ఈ ప్రపంచకప్‌లో ఆటగాళ్ల ప్రదర్శన అఫ్గాన్‌కు కొత్త ఊపిరి పోసింది. భవిష్యత్‌పై ఆశలు పెంచింది. ఇంగ్లాండ్‌ను 69 పరుగుల తేడాతో ఓడించింది. లక్ష్యాన్ని ఛేదిస్తూ పాకిస్థాన్, శ్రీలంకపై విజయం సాధించింది. చివరి మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికాను వణికించింది. ఎప్పుడూ బౌలర్లు మాత్రమే అఫ్గాన్‌లో మెరుస్తుండేవారు. కానీ ఈసారి అలా కాదు. ప్రపంచ అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొంటూ అఫ్గాన్ బ్యాటర్లు సత్తా చాటారు. ఇబ్రహీం జాద్రాన్ 9 మ్యాచ్‌ల్లో 47 సగటుతో 376 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో అఫ్గాన్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఇబ్రహీం జద్రానే. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ 8 ఇన్నింగ్స్‌ల్లో 70.60 సగటుతో 353 పరుగులు చేశాడు. రహ్మత్ షా 320 పరుగులు, గుర్బాజ్ 280 పరుగులు, కెప్టెన్ హష్మతుల్లా షాహిది 310 పరుగులు చేశారు.
అఫ్గాన్ అంటే బౌలింగ్‌లో సత్తాచాటుతుందన్న అంచనాలు ఉన్నాయి. దాన్ని నిజం చేస్తూ బౌలింగ్‌లో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 11 వికెట్లు, మహమ్మద్ నబి 8, నవీనుల్ హక్ 8, ముజీబుర్ రెహ్మాన్ 8 వికెట్లు తీసుకుని రాణించారు. మిగిలిన బౌలర్లు కూడా తమ వంతు రాణించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలో పేసర్లు వికెట్లు తీసి సత్తా చాటారు. కేవలం 91 పరుగులకే ఏడు వికెట్లు తీసి కంగారులను ఓటమి అంచులకు తీసుకెళ్లారు. కానీ మ్యాక్స్‌వెల్ అద్భుత డబల్ సెంచరీతో విజయం అఫ్గాన్ చేతుల నుంచి జారీపోయింది. ముఖ్యంగా నలుగురు స్పిన్నర్లతో దాడి కొనసాగించిన అఫ్గాన్ ఫలితాలు రాబట్టింది. ఒక్క ఆటగాడిపైనే ఆధారపడకుండా.. సమష్టి ఆటతీరుతో అఫ్ఘానిస్థాన్ విజయాలు సాధించింది. పెద్ద జట్లను చూసి భయపడి వెనక్కి తగ్గడం కాదు.. సవాలు విసిరే పోరాటంతో గెలవడం అలవాటుగా మార్చుకుంది. ఏకంగా మూడు పెద్ద జట్లపై అఫ్గాన్ విజయాలే అందుకు నిదర్శనం. ఈ విజయాలు కూడా ఏదో గాలివాటం కాదు. పూర్తి ఆధిపత్యంతో, సాధికారికంగా సాధించినవే.