AFG vs PAK T20I: గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన  పాకిస్తాన్  క్రికెట్ జట్టుకు  ఊహించని షాక్.  పసికూన అఫ్గానిస్తాన్  చేతిలో  పాక్ క్రికెట్ జట్టుకు ఘోర పరాభవం.  వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడి  పరువుతో పాటు  టీ20 సిరీస్‌నూ  పోగొట్టుకుంది  పాకిస్తాన్.  సమిష్టిగా ఆడిన అఫ్గానిస్తాన్.. మూడు మ్యాచ్‌ల సీరిస్ లో  వరుసగా రెండు టీ20లు గెలిచి  మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్ పై ఏ ఫార్మాట్ లో అయినా అఫ్గాన్ కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం గమనార్హం. 


ఆదివారం రాత్రి  షార్జా  క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన   మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్.. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో  6 వికెట్ల నష్టానికి  130 పరుగులు చేసింది.   ఆ జట్టులో  ఓపెనర్లు సయీమ్ అయూబ్ (0), మహ్మద్ హరీస్ (15) లతో పాటు వన్ డౌన్ బ్యాటర్  షఫీక్ (0), తయ్యబ్ తాహిర్  (13) లు మరోసారి విఫలమయ్యారు. ఇమాద్ వసీం  (57 బంతుల్లో  64 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ షాదాబ్ ఖాన్ (25 బంతుల్లో  32, 3 ఫోర్లు)  రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో ఫరూఖీ  రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్, కరీమ్ జనత్ లు తలా ఓ వికెట్ తీశారు.  


ఛేదన ఉత్కంఠగా... 


స్వల్ప లక్ష్యమే అయినా  పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.  అఫ్గాన్ ఓపెనర్  రహ్మనుల్లా గుర్బాజ్ (49 బంతుల్లో 44,  2 ఫోర్లు, 1 సిక్సర్)   రాణించినా  మరో ఓపెనర్ ఉస్మాన్ ఘనీ  (7) విఫలమయ్యాడు.  మూడో స్థానంలో వచ్చి మెరుపులు మెరిపించే ఇబ్రహీం జద్రాన్  (40 బంతుల్లో 38,  3 ఫోర్లు)   బాల్ కు ఒక పరుగు అన్నరీతిలో ఆడాడు.   15 ఓవర్లకు ఆ జట్టు  85 పరగులే చేసింది. కానీ రెండు ఓవర్ల వ్యవధిలో క్రీజులో సెట్ అయిన రహ్మనుల్లా, జద్రాన్ లు ఔటయ్యారు.   చివరి 3 ఓవర్లలో  21 పరుగులు అవసరం ఉండగా.. ఇహసనుల్లా వేసిన 18వ ఓవర్లో  8 పరుగులొచ్చాయి. నసీమ్ షా వేసిన  19వ ఓవర్లో  నబీ (9 బంతుల్లో 14 నాటౌట్, 1 సిక్సర్) తో పాటు  నజీబుల్లా జద్రాన్ (12 బంతుల్లో 23 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్సర్) లు చెరో సిక్సర్ బాదారు. ఆ ఓవర్లో 17 పరుగులొచ్చాయి. ఆఖరి ఓవర్లో ఐదు పరుగులు  అసవరం కాగా.. తొలి నాలుగుబంతులకు  నాలుగు పరుగులొచ్చాయి.  ఐదో బంతికి  నజీబుల్లా థర్డ్ మ్యాన్ దిశగా షాట్ ఆడి బౌండరీతో అఫ్గాన్ కు సూపర్ విక్టరీని అందించాడు.  


 






ఇరు జట్ల మధ్య  మూడు రోజుల క్రితం జరిగిన  తొలి టీ20లో  పాకిస్తాన్ పై అఫ్గాన్.. ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.   రెండు జట్ల మధ్య నామమాత్రమైన మూడో టీ20 ఇదే వేదికపై  నేడు జరుగునుంది. మరి ఈ మ్యాచ్ లో అయినా  పాకిస్తాన్ గెలిచి పరువు కాపాడుకుంటుందో  చూడాలి.