భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ సంచలనాలు సృష్టిస్తోంది. ఈ వన్డే వరల్డ్ కప్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్లకు షాక్ ఇచ్చి అదరగొట్టింది. నాలుగు విజయాలు నమోదు చేసి సెమీస్ రేసులో ఇంకా కొనసాగుతోంది. శుక్రవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో కొనసాగుతూ సత్తా చాటుతోంది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో విజయంతో 2023 వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక విజయాలు సాధించిన రెండో ఆసియా జట్టుగా అఫ్ఘాన్ నిలిచింది. ఇండియా ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌లలో గెలుపొందగా.. అఫ్ఘానిస్తాన్ 4 మ్యాచ్‌లలో విజయం సాధించింది. పాకిస్థాన్ మూడు, శ్రీలంక రెండు, బంగ్లాదేశ్ ఒక్క మ్యాచ్‌లో గెలుపొందాయి. అయితే డచ్ జట్టుపై మ్యాచ్ అనంతరం అఫ్గాన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిది చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల కళ్లు చెమర్చేలా చేశాయి. నెదర్లాండ్స్ మీద విజయాన్ని శరణార్థులకు అంకితం ఇస్తున్నట్లు హజ్మతుల్లా షాహిది తెలిపాడు.
నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌లో తాము అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించినట్లు అఫ్గాన్ కెప్టెన్ తెలిపాడు. ఈ ప్రపంచకప్‌లో లక్ష్యాన్ని ఛేదించడం తమకు ఇది మూడోసారని షాహిదీ గుర్తు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో పరిస్థితులకు తగినట్లుగా ఆడుతూ తమ జట్టు విజయాలు సాధిస్తోందని అన్నాడు. సెమీస్‌లో స్థానం కోసం తమ శక్తిమేరకు ప్రయత్నిస్తామని, సెమీస్ చేరుకోగలిగితే అది తమకు చాలా పెద్ద ఘనతని అఫ్గాన్ కెప్టెన్ అన్నాడు. మూడు నెలల కిందట మా అమ్మ చనిపోయిందని, తమ కుటుంబం మొత్తం బాధల్లో ఉందని, అఫ్ఘానిస్తాన్ సెమీస్ చేరుకుంటే దేశానికి, తన కుటుంబానికి కూడా అది పెద్ద ఘనత అవుతుందని భావోద్వేగంతో అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది శరణార్థులు కష్టాల్లో ఉన్నారని, వారి బాధను చూస్తే కన్నీళ్లు ఆగడం లేదని అందుకే తమ విజయాన్ని వారికి అంకితం చేస్తున్నానని హస్మతుల్లా షాహిది బావోద్వేగానికి గురయ్యాడు.
ఇక లక్నోలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ అదరగొట్టింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దూసుకెళ్లింది. ఈ విజయంతో వన్డే ప్రపంచకప్‍లో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవటంతో పాటుగా చరిత్రలో తొలిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం అఫ్ఘానిస్తాన్ అర్హత సాధించింది. బౌలర్లు, ఫీల్డర్ల అద్భుత ప్రదర్శనతో ఈ మ్యాచ్‌లో తొలుత నెదర్లాండ్స్‌ను 179 పరుగులకే అఫ్ఘానిస్థాన్ ఆలౌట్ చేసింది. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్ఘాన్ టీమ్.. 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అఫ్ఘాన్ ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జర్దాన్ త్వరగానే అవుటైనప్పటికీ.. కెప్టెన్ హజ్మతుల్లా షాహిది సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. రహ్మత్ షా, షాహిది హాఫ్ సెంచరీలో సత్తా చాటడంతో అఫ్ఘాన్ మరో 19 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. మూడు వికెట్లు తీసిన మహ్మద్ నబీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
నెదర్లాండ్స్‌పై విజయంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానం నుంచి ఐదుకు చేరిన అఫ్ఘానిస్తాన్.. తొలిసారిగా ఛాంపియన్స్ ట్రోఫికి సైతం అర్హత సాధించింది. 2015లో పాకిస్థాన్‍లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఇప్పటి వరకూ ఇండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అఫ్ఘానిస్తాన్, పాకిస్థాన్ అర్హత సాధించాయి.