ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ విరాట్ కోహ్లీ మనస్తత్వం గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. ఐపీఎల్ సందర్భంగా విరాట్ నెట్స్ లో రెండున్నర గంటలు ప్రాక్టీస్ చేయడం చూసి తాను విస్మయానికి గురయ్యానని చెప్పాడు.


సన్ రైజర్స్ ఆడగాడైన రషీద్ ఖాన్ ఈ ఏడాది కొత్త జట్టయిన గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడాడు. గుజరాత్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్ సవేరా పాషాతో మాట్లాడుతూ.. అప్పుడు జరిగిన ఒక సంఘటనను  పంచుకున్నాడు. 
 
ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా ముందురోజు తామంతా ప్రాక్టీస్ చేశామని చెప్పాడు. అక్కడే మరో నెట్స్ లో కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడని.. అతను అక్కడ గడిపిన సమయాన్ని తాను లెక్కపెట్టానని రషీద్ తెలిపాడు. తమ ప్రాక్టీస్ అయ్యాక కూడా విరాట్ అక్కడే ఉన్నాడని.. మొత్తం రెండున్నర గంటలు నెట్స్ లో తీవ్రంగా శ్రమించాడని చెప్పుకొచ్చాడు. అతడి అంకితభావాన్ని, మనస్తత్వాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయానని రషీద్ అన్నాడు. మరునాడు మ్యాచ్ లో తమ జట్టుపై 70 పరుగులు చేశాడని తెలిపాడు.


ఇటీవల కోహ్లీ ఫామ్ పై పెద్ద చర్చ జరుగుతోంది. దాదాపు మూడేళ్లుగా ఏ ఫార్మాట్ లోనూ అతడి ఖాతాలో శతకం నమోదవలేదు. చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. అయితే దీనిపై రషీద్ స్పందిస్తూ.. కోహ్లీ కొట్టే షాట్లు చూస్తుంటే అతను ఫాం లో లేడు అనే భావన తనకు కలగట్లేదని అన్నాడు.


గతంలో చాహల్!


Chahal On Kohli: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి (Virat Kohli) మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌ (Yuzvendra Chahal) అండగా నిలిచాడు. కొన్నేళ్లుగా అతడు భారత జట్టుకు సేవలు అందిస్తున్నాడని పేర్కొన్నాడు. తన భాగస్వామ్యాలతో విజయాలు అందిస్తున్నప్పటికీ జనాలంతా సెంచరీ గురించే మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నాడు. అతడి వెనక 15-20 పరుగులుంటే బౌలింగ్‌ చేయడానికి ఏ బౌలరైనా భయపడతాడని వెల్లడించాడు.


'విరాట్‌ కోహ్లీకి టీ20ల్లో 50 పైగా సగటు ఉంది. రెండుసార్లు ప్రపంచకప్పుల్లో మ్యాన్‌ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అన్ని ఫార్మాట్లలో కలిసి 70 సెంచరీలు చేశాడు. అన్ని ఫార్మాట్లలో అతడి సగటు పరిశీలించండి. మనకు కనిపిస్తున్న సమస్య కేవలం సెంచరీ చేయకపోవడమే! అతడు చేసే విలువైన 60-70 పరుగుల గురించి మనం అస్సలు మాట్లాడుకోవడం లేదు. ఎందుకంటే అతడు నెలకొల్పిన ప్రమాణాలు అలాంటివి' అని యూజీ అన్నాడు. కింగ్‌ కోహ్లీ 15-20 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడంటే ప్రపంచంలోని ఏ బౌలరైనా అతడికి బంతులేసేందుకు భయపడతారని వెల్లడించాడు.