ప్రపంచకప్‌లో నాకౌట్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌తో శ్రీలంక తలపడనుంది. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు లహిరు కుమార దూరం కావడంతో లంకకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కుమార కండరాల గాయంతో అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యాడు. కుమార స్థానంలో పేసర్ దుష్మంత చమీర జట్టులోకి వచ్చాడు. ఈ ప్రపంచకప్‌లో అంచనాలను అందుకోవడంలో విఫలమైన లంకేయులు ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీఫైనల్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని చూస్తున్నారు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక, అఫ్గానిస్థాన్ చెరో రెండు విజయాలతో సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకున్నాయి. శ్రీలంక, అఫ్గాన్‌ సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి.

 

సమఉజ్జీల సమరంలో పైచేయి ఎవరిదో..?

ప్రపంచకప్‌లో వరుసగా మూడు పరాజయాల తర్వాత, నెదర్లాండ్స్, ఇంగ్లండ్‌పై రెండు అద్భుతమైన విజయాలతో శ్రీలంక మళ్లీ గాడినపడింది. అఫ్గాన్‌పైనా గెలిచి సెమీస్‌ అవకాశాలను చేజారనివ్వద్దని లంక భావిస్తోంది. కానీ అఫ్గాన్‌లపై లంక గెలుపు అంత తేలిక కాదు. ఈ ప్రపంచకప్‌లో రెండు అద్భుత విజయాలతో అఫ్గాన్‌ మంచి ఫామ్‌లో ఉంది. ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌లపై అద్భుత విజయాలతో ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘానిస్తాన్ సంచలన విజయాలు నమోదు చేసింది. ఇప్పటికే అగ్ర జట్లకు షాక్‌ ఇచ్చిన అఫ్గాన్‌.. ఇప్పుడు లంకకు షాక్‌ ఇవ్వాలని చూస్తోంది. ఇప్పటికే అఫ్గాన్‌పై ప్రశంసల జల్లు కురుస్తుండగా ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే ప్రపంచకప్‌లో మూడు విజయాలు నమోదు చేసి చరిత్ర సృష్టిస్తుంది.  ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక బౌలింగ్ చాలా పటిష్టంగా కనిపించింది. పేసర్ కుమార నేతృత్వంలోని జట్టు బౌలింగ్, ఫీల్డింగ్‌లలో మెరుగ్గా రాణించి ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. కుమార గైర్హాజరీ లంకేయుల విజయావకాశాలను ప్రభావితం చేస్తుంది. కానీ ఏంజెలో మాథ్యూస్ తిరిగి జట్టులో చేరడం కొంచెం ఉపశమనం ఇస్తోంది. పేసర్ చమీరాపై కూడా లంక ఆశలు పెట్టుకుంది. దిల్షాన్ మధుశంక 11, కుసన్ రజిత 7 వికెట్లతో ఈ ప్రపంచకప్‌లో పర్వాలేదనిపించారు. మహేష్ తీక్షణ  అనుకున్నంత రాణించడం లేదు. 

 

పాతుమ్ నిస్సంక, సదీర సమరవిక్రమ ఈ ప్రపంచకప్‌లో మెరుగ్గా రాణిస్తున్నారు. ఇంగ్లండ్‌పై అద్భుతమైన ఛేజింగ్‌ కూడా చేశారు. ఈ టోర్నమెంట్‌లో వరుసగా నాలుగో అర్ధ సెంచరీతో నిస్సంక సత్తా చాటాడు. సమరవిక్రమ, కుశాల్ మెండిస్ శతకాలు కూడా సాధించారు. మరోవైపు అఫ్గాన్‌ టాపార్డర్‌ కూడా మెరుగ్గా రాణిస్తోంది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 224 పరుగులతో  ఈ ప్రపంచకప్‌లో అఫ్గాన్ తరపున అత్యుత్తమ బ్యాటర్‌గా ఉన్నాడు. ఇబ్రహీం జద్రాన్, హష్మతుల్లా షాహిదీ, రహమత్ షా కూడా గత మ్యాచ్‌లో రాణించారు. లంకపైనా రాణించాలని అఫ్గాన్‌ బ్యాటర్లు భావిస్తున్నారు. నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూఖీలు ప్రారంభంలో వికెట్లు పడగొడితే అఫ్గాన్‌కు గెలుపు అంత కష్టం కాదు. రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ వంటి మెరుగైన స్పిన్నర్లు అఫ్గాన్‌కు ఉన్నారు. వీరితో లంకకు ముప్పు తప్పదు. ఇప్పటివరకూ జరిగిన 11 వన్డేల్లో శ్రీలంకపై అఫ్గాన్‌ మూడు సార్లు మాత్రమే విజయం సాధించింది. 

 

శ్రీలంక జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్‌), కుశాల్ పెరీరా, పాథుమ్ నిస్సాంక, దుష్మంత చమీర, దిముత్ కరుణరత్నే, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, మహేశ్ తీక్షణ, దునిత్ వెల్లలాగే, కసున్ రజిత, ఏంజెలో డుషాన్ మథ్యూస్‌క , చమిక కరుణరత్నే. 

 

 

అఫ్గానిస్తాన్ జట్టు: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మద్, ఉర్ రహ్మద్ , అబ్దుల్ రెహ్మాన్ నవీన్ ఉల్ హక్.