AUS vs AFG match highlights: టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup) లో పెను సంచలన నమోదైంది. సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌(Afghanistan) అద్భుతం చేసింది. స్వల్ప స్కోరునే కాపాడుకుని సూపర్ ఎయిట్‌లో కంగారులకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. ఇక వన్డే ప్రపంచకప్‌ ఛాంపియన్‌లు అయిన ఆస్ట్రేలియా( Australia)... సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే రేపు భారత్‌(India)తో జరిగే పోరులో గెలిచి తీరాల్సిందే. లేకపోతే తట్టాబుట్టా సర్దుకుని ఆస్ట్రేలియా జట్టు వెనుదిరగకతప్పదు. ఈ మ్యాచ్‌లో బంతితో అఫ్గాన్‌ బౌలర్లు అద్భుతమే చేశారు. పటిష్టమైన ఫీల్డింగ్‌తో కంగారులను కంగారు పెట్టేశారు. దీంతో 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకు ఆస్ట్రేలియా చతకిలపడింది.



స్వల్ప లక్ష్యమే
    ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా... బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.  పిచ్‌ బౌలర్లకు సహకరిస్తుందన్న అంచనాలు ఉన్నా కంగారులు.. అఫ్గాన్‌ను బ్యాటింగ్ ఆహ్వానించడం ఆశ్చర్యం కలిగించింది. అఫ్గాన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ కూడా టాస్‌ సమయంలో తాము టాస్‌ గెలిస్తే తొలుత బ్యాటింగే చేసే వాళ్లమని చెప్పాడు. అఫ్గాన్‌ ఓపెనర్లు తొలి వికెట్‌ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. కంగారు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న అఫ్గాన్‌ ఓపెనర్లు.. రహ్మతుల్లా గుర్బాజ్‌, ఇబ్రహీం జర్దాన్‌ అర్ధ శతకాలతో ఈ స్లో పిచ్‌పై తమ జట్టుకు పోరాడే స్కోరు అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 16 ఓవర్లలో 118 పరుగులు జోడించారు. పిచ్‌ బౌలర్లకు అనుకూలిస్తున్న వేళ వీరిద్దరూ సమయోచితంగా బ్యాటింగ్‌ చేశారు. గుర్బాజ్‌ కాస్త ధాటిగా ఆడాడు. 49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో గుర్బాజ్‌ 60 పరుగులు చేసి 16 ఓవర్లో అవుటయ్యాడు. గుర్బాజ్‌ను స్టోయినీస్‌ అవుట్‌ చేశాడు. దీంతో 118 పరుగుల వద్ద  అఫ్గాన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అఫ్గాన్ ఓపెనింగ్‌ జోడీని విడదీసేందుకు కంగారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి సఫలీకృతం కాలేదు. చివరికి స్టోయినీస్‌ మరో నాలుగు ఓవర్లు ఉండగా ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత కాసేపటికే జద్రాన్ కూడా అవుటయ్యాడు. 48 బంతుల్లో ఆరు ఫోర్లతో 51 పరుగులు చేసిన జద్రాన్‌ను జంపా అవుట్‌ చేశాడు. ఆ తర్వాత అఫ్గాన్‌ బ్యాటర్లు ధాటిగా బ్యాటింగ్‌ చేయలేకపోయారు. 16ఓవర్ల వరకూ ఒక్క వికెట్‌ కూడా కోల్పోని అఫ్గాన్‌ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒమ్రాజాయ్‌ 2, కరీం జనత్‌ 13, కెప్టెన్ రషీద్‌ ఖాన్‌ 2, గుల్బదీన్‌ నైబ్‌ సున్నా పరుగులకే వెంటవెంటనే వెనుదిరిగారు. 118 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన అఫ్గాన్‌ ఆ తర్వాత 141 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా బౌలర్లు పుంజుకోవడంతో అఫ్గాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్ కమిన్స్‌ మూడు వికెట్లు తీశాడు.



అఫ్గాన్‌ బౌలర్ల పంజా
 142 పరుగుల సవాల్‌ విసిరే లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను అఫ్గాన్‌ బౌలర్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. తొలి ఓవర్‌లోనే ట్రావిస్‌ హెడ్‌ను బౌల్డ్‌ చేసిన నవీనుల్‌  హక్‌ కంగారులను తొలి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత గుల్బదీన్‌ నైబ్‌ కంగారులపై పంజా విసిరాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి కేవలం 20 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. మ్యాక్స్‌ వెల్‌ ఒక్కడే 59 పరుగులు చేసి ఆసిస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. మ్యాక్స్‌ వెల్‌ అవుటయ్యాకు కంగారుల పతనం వేగంగా సాగింది. ఎనిమిది మంది బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. అఫ్గాన్‌ ఫీల్డర్లు మైదానంలో పాదరసంలా కదిలారు. మెరుపు ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నారు. గుల్బదీన్‌ 4, నవీనుల‌్ హక్‌ మూడు వికెట్లతో చెలరేగడంతో ఆస్ట్రేలియా 127 పరుగులకే కుప్పకూలింది. అఫ్గాన్‌ జట్టులో ఎనిమిది మంది బౌలింగ్‌ చేయడం విశేషం. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి అఫ్గాన్‌ ఈ గెలుపుతో ప్రతీకారం తీర్చుకుంది.