ICC Rankings Latest Updates: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంకును నిలుపుకోవడంతోపాటు కెరీర్ బెస్ట్ అయిన 904 పాయింట్ల మార్కును చేరుకున్నాడు. 2016లో మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే ఈ పాయింట్లను చేరుకుని రికార్డులకెక్కాడు. ఇప్పుడు బుమ్రా కూడా ఈ పాయింట్ ను చేరుకుని అశ్విన్ రికార్డును సమం చేశాడు. ఆసీస్ తో జరుగుతున్న ఐదు టెస్టుల బోర్డర్ -గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో బుమ్రా అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో మొత్తం 21 వికెట్లకు కేవలం 10 సగటుతో తీసి, సత్తా చాటాడు. దీంతో సిరీస్ లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ముఖ్యంగా బ్రిస్బేన్ లోజరిగిన మూడో టెస్టులో 9 వికెట్లు తీసి తన ర్యాంకింగ్ పాయింట్లను మరింతగా పెంచుకున్నాడు. సిరీస్ లో మరె రెండు టెస్టులు మిగిలి ఉన్న నేపథ్యంలో బుమ్రా.. మరిన్ని పాయింట్లు సాధించి కొత్త బెంచ్ మార్కును నమోదు చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.  రెండు, మూడో టెస్టుల్లో సెంచరీలు బాదిన ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ నాలుగో ర్యాంకును దక్కించుకున్నాడు. మూడో టెస్టులో సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్ పదో ర్యాంకులో నిలిచాడు. ఇక ఆల్ రౌండర్లలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాప్-10 ర్యాంకు దక్కించుకున్నాడు. 






సడెన్ రిటైర్మెంట్ పై విచారం లేదు..
బ్రిస్బేన్ టెస్టు ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటనపై విచారం లేదని తెలిపాడు. టెస్టుల్లో 537 వికెట్లు సాధించిన తర్వాత కూడా దేని గురించో బాధ పడటంలో అర్థం లేదని తెలిపాడు. ఇక తనకు వీడ్కోలు సిరీస్ లాంటి వాటిపై నమ్మకం లేదని తెలిపాడు. తన కోసం ప్రత్యేకంగా వీడ్కోలు టెస్టులాంటివి నిర్వహించడం, గార్డ్ ఆఫ్ ఆనర్ లాంటి వాటికి తను వ్యతిరేకం అన్నాడు. మరోవైపు తను అంతర్జాతీయ క్రికెట్ కి మాత్రమే వీడ్కోలు పలికానని, ఐపీఎల్ వంటి లీగ్ లకి అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. అలాగే ఇక మీదట యూట్యూబ్ లో క్రికెట్ సంబంధించిన చర్యా కార్యక్రమాలు నిర్వహించడం, కోచింగ్ లాంటి పనులు చేస్తానని వెల్లడించాడు. మొత్తానికి తనకు రిటైర్మెంట్ పై బాధ లేదని, ఇప్పటివరకు దీనిపై ఒక్కసారి కూడా ఏడవలేదని చమత్కరించాడు. తన రిటైర్మెంట్ కు ఎవరూ బాధ్యులు కాదని, ఎవరైనా ఉన్నట్లయితే, దాని గురించి తనకు తెలియదని వ్యాఖ్యానించాడు. మరోవైపు టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచిన అశ్విన్ కు కనీసం వీడ్కోలు సిరీస్ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుండేదని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అభిప్రాయ పడ్డాడు. 


పది స్థానాలు ఎగబాకిన రాహుల్..
బ్రిస్బేన్ టెస్టులో 84 పరుగులతో సత్తా చాటిన ఓపెనర్ కేఎల్ రాహుల్ పది స్థానాలు మెరుగుపర్చుకుని 40వ ర్యాంకును దక్కించుకున్నాడు. ఈ సిరీస్ లోనే అత్యంత నిలకడగా రాణిస్తున్న బ్యాటర్ తనే. భారత్ తరపున అత్యధిక పరుగులు (235 రన్స్) చేసిన ప్లేయర్ కూడా అతనే. అలాగే బ్యాటింగ్ కు ఇతర బ్యాటర్లు కష్టపడుతుంటే, సిరీస్ లోనే అత్యధిక బంతులు ఎదుర్కొన్న బ్యాటర్ గా నిలిచాడు. 


Also Read: Melbourne Test: ఆ వ్యక్తిగత రికార్డులపై బుమ్రా, జడేజా గురి.. నాలుగో టెస్టులో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్న భారత ప్లేయర్లు