Uganda off-spinner Frank Nsubuga: సాధారణంగా ఏ ఆటగాడైనా అతి పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి రికార్డు సృష్టిస్తాడు. పిన్న వయసులోనే చరిత్ర సృష్టించాడని.. మనం ఎన్నోవార్తలు కూడా వినుంటాం. కానీ ఓ  ఆటగాడు అత్యంత పెద్ద వయసులో... అదీ టీ 20 ప్రపంచకప్‌ జట్టులోకి ఎంపికై రికార్డు సృష్టించాడు. అది ప్రతిష్టాత్మకమైన టీ 20 ప్రపంచకప్‌లో ఈ ఘనత సాధించి ఔరా అనిపించాడు. ప్రతిష్టాత్మక టీ 20 ప్రపంచకప్‌నకు ఉగాండ జట్టు టీ 20 జట్టును ప్రకటించింది. ఇందులో 43 ఏళ్ల ఉగాండా ఆఫ్‌స్పిన్నర్‌ ఫ్రాంక్‌ సుబుగాకు చోటు దక్కింది. ఉగాండా క్రికెట్‌ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో సుబుగాకు స్థానం లభించింది. అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్‌లో ఆడిన ఆటగాడిగా సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. ఉగాండ జట్టుకు బ్రయాన్‌ మసాబా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆఫ్రికా క్వాలిఫయర్స్‌ రీజనల్‌లో ఫైనల్‌లో రెండో స్థానంలో నిలవడం ద్వారా ఉగాండా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. గ్రూప్‌-సిలో ఉన్న ఉగాండా, తన తొలి మ్యాచ్‌లో జూన్‌ 3న అఫ్గానిస్థాన్‌తో తలపడుతుంది.

 




ఉగాండ జట్టులో బ్రయాన్‌ మసాబా, రిజాత్‌ అలీ షా, కెన్నెత్‌ వైస్వా, దినేశ్‌ నక్రాని, ఫ్రాంక్‌ సుబుగా, రోనక్‌ పటేల్‌, రోజర్‌ ముకాసా, కోస్మాస్‌ క్యెవుటా, బిలాల్‌ హసున్‌, ఫ్రెడ్‌ అచెలమ్‌, రాబిన్సన్‌ ఒబుయా, సిమోన్‌ సెసాజి, హెన్నీ సెన్యోండో, అల్పేష్‌ రాజ్‌మణి, జుమా మియాజి ఉన్నారు.

 

ఉగ్రముప్పుపై స్పందించిన ఐసీసీ     

జూన్ 1 నుంచి అమెరికా-వెస్టిండీస్ కలిసి నిర్వహిస్తున్న ట్వంటీ-20 ప్రపంచ కప్ టోర్నీకి ఉగ్ర ముప్పు పొంచి ఉంది. ఉత్తర పాకిస్థాన్ లో పనిచేస్తున్న తీవ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు వచ్చినట్టు వెస్టిండీస్ లోని ఓ దేశమైన ట్రినిడాడ్ అండ్ టుబాగో ప్రధాని కీత్ రౌలే వెల్లడించారు. ఉగ్రమూకలు ఎలాంటి దాడులకైనా పాల్పడే ప్రమాదం ఉందని, వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. టోర్నీ ఆసాంతం మ్యాచ్ లు జరిగే వేదికలు, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ఇప్పటికే.. తమ దేశ ఇంటెలిజెన్స్ , సెక్యూరిటీ ఏజెన్సీలు ఆ కార్యక్రమంలో నిమగ్నమైనట్టు కీత్ రౌలే స్పష్టం చేశారు.  ఈ పరిస్థితులను గమనిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి-ICCఆతిథ్య దేశాల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు వెల్లడించింది. 

 

భారత్‌ తొలి మ్యాచ్‌ ఎప్పుడంటే..

జూన్‌ 1 నుంచి పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో కెనడా తలపడబోతోంది. జూన్‌ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్‌ జూన్‌ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్‌ ఏ లో భారత్‌(Team India), పాకిస్థాన్‌(Pakistan) జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్‌ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది.