Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతూ పతకాల వేట కొనసాగిస్తున్నారు. మొదట భారత వెయిట్ లిఫ్టర్లు పతకాల భారాన్ని మోయగా, ప్రస్తుతం రెజ్లర్లు బంగారం కుస్తీ పడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే భారత్ ఖాతాలో 3 స్వర్ణాలు చేరగా, అవన్నీ రెజ్లింగ్ లోనే రావడం విశేషం. నిన్న మొదట బజరంగ్ పునియా పురుషుల 65 కిలోల విభాగంలో స్వర్ణాన్ని నెగ్గగా, అనంతరం సాక్షి మాలిక్, దీపక్ పునియాలు సైతం కోట్లాది భారతీయుల ఆశల్ని నిజం చేస్తూ బంగారు పతకం నెగ్గారు. దివ్య కాక్రన్, మోహిత్ గ్రేవాల్ కాంస్య పతకాలు సాధించారు.
స్వర్ణ సాక్షి మాలిక్.. (Sakshi Malik Wins Gold Medal at CWG 2022)
భారత మహిళా స్టార్ రెజ్లర్ మరో కామన్వెల్త్ గేమ్స్ లో సత్తా చాటింది. వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్ లో పతకాన్ని సాధించింది. గతంలో జరిగిన రెండు కామన్వెల్త్ గేమ్స్ లో రజతం, కాంస్యం సొంతం చేసుకున్న రెజ్లర్ సాక్షి మాలిక్ బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో స్వర్ణం సాధించింది. మహిళల 62 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్లో కెనడాకు చెందిన అనా గొడినెజ్‌పై విజయం సాధించింది.
2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని గెలుచుకుంది. 2018లో జరిగిన గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈసారి ఎలాగైనా స్వర్ణం నెగ్గాలన్న కసితో బరిలోకి దిగిన సాక్షి మాలిక్ తన కలను సాకారం చేసుకుంది. ఓ దశలో 0-4తో వెనుకంజలో ఉన్నా, అనుభవాన్ని ఉపయోగించి కెనడా ప్రత్యర్థి అనా గొడినెజ్‌పై గెలుపొంది బంగారు పతకాన్ని ముద్దాడింది.
దీపక్ పునియా.. (Deepak Punia Wins Gold Medal at CWG 2022)
భారత్ కు మరో బంగారు పతకం రెజ్లర్ దీపక్ పునియా రూపంలో లభించింది. పురుషుల 86 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్‌లో భారత రెజ్లర్ దీపక్ పునియా స్వర్ణం సాధించాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌కు చెందిన రెజ్లర్ మహమ్మద్ ఇనామ్‌పై బంగారం కుస్తీ పట్టాడు. పాక్ రెజ్లర్ ను ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు దీపక్ పునియా. వ్యక్తిగతంగా దీపక్ పునియా మూడో టోర్నీలో పతకం సాధించాడు. వరల్డ్ ఛాంపియన్ షిప్స్ లో రజతంతో సరిపెట్టుకున్న దీపక్ పునియా ఈసారి ఎలాగైనా పసిడితోనే భారత్ కు తిరిగి వెళ్లాలన్న తీరుగా పాక్ రెజ్లపై కుస్తీ పట్టి విజయం సాధించాడు.
Also Read: Bajrang Punia Wins Gold: బంగారు భజరంగ్ - రెజ్లింగ్‌లో స్వర్ణం సాధించిన భారత రెజ్లర్!