Chess World Cup 2023: 


చదరంగం యువరాజు ఆర్‌ ప్రజ్ఞానంద అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ కప్‌‌ సెమీస్‌ చేరిన తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించాడు. హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ ఫైనల్లో తన మిత్రుడు ఎరిగైసి అర్జున్‌ను ఓడించాడు. కనీసం 50,000 డాలర్ల ప్రైజ్‌ మనీని ఖాయం చేసుకున్నాడు. అలాగే అంతకన్నా ముఖ్యమైన 2024 క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీకి అర్హత సాధించాడు. అక్కడ గెలిస్తే ప్రపంచ కిరీటం కోసం చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌తో తలపడతాడు.


ప్రపంచ చెస్‌ పోటీలకు అజర్‌ బైజాన్‌ రాజధాని బాకు వేదిక. గురువారం జరిగిన క్వార్టర్లో అర్జున్‌ను ప్రజ్ఞానంద ఎంతో శ్రమించి ఓడించాడు. ఇక సెమీస్‌లో అమెరికా ఆటగాడు ఫాబియానో కరువానాతో తలపడనున్నాడు. మొదట నిర్వహించిన ర్యాపిడ్‌ పోటీలు డ్రాగా ముగియడంతో అర్జున్‌, ప్రజ్ఞానంద పది నిమిషాల గేమ్స్‌ ఆడారు. అక్కడ నువ్వా నేనా అన్నట్టుగా తలపడటంతో టైబ్రేక్‌ డ్రామా జరిగింది. వీరి పోటీలను వీక్షించిన వెటరన్‌ గ్రాండ్‌మాస్టర్ పీటర్‌ లెకో 'సంచలన మ్యాచ్‌. పొరపాట్లు చేశారు కానీ.. ఇద్దరు ఆటగాళ్లూ తమ సత్తాను బయట పెట్టారు' అని ప్రశంసించాడు.


మ్యాచ్‌ గెలవడం సంతోషంగా ఉందని ప్రజ్ఞానంద అన్నాడు. 'ఇదంత సులభమని అనుకోవడం లేదు. తెల్ల పావులతో సరిగ్గా ఆడలేకపోవడంతో మేం గట్టిగా పోరాడాం. బహుశా తెల్లపావులతో ఆడితే కొత్త ఐడియాలు రావడం కష్టమేమో! నా వరకైతే అంతే. తెల్ల, నల్ల పావులతో ఆడటంలో అర్జున్‌కు మంచి అనుభవం ఉంది. నల్ల పావులతో అయితే మరీ భీకరంగా ఆడతాడు. నేను క్యాండిడేట్స్‌ గురించి ఆలోచించలేదు. కేవలం మ్యాచుల పైనే శ్రద్ధ వహించాను. ఏమీ చేయకుండానే 30 సెకన్ల కాలాన్ని చేజార్చుకోవడం నిరాశకు గురి చేసింది. కానీ ఎలాగోలా పుంజుకున్నాను' అని అతడు తెలిపాడు.


అర్జున్‌, ప్రజ్ఞానంద మధ్య తొలి గేమ్‌ డ్రాగా ముగియడంతో రెండో దానికి దారితీసింది. అందులో గెలిచిన వాళ్లు సెమీస్‌ చేరుకుంటారు. అనూహ్యంగా అదీ డ్రా అయింది. దాంతో 10 నిమిషాల నిడివి ఉండే రెండు గేమ్స్‌ ఆడాల్సి వచ్చింది. విచిత్రంగా నల్ల పావులతో ఆడినవాళ్లే నాలుగు గేమ్స్‌ గెలిచారు. మూడో గేమ్‌ ఓడాక అర్జున్‌ కచ్చితంగా గెలవాల్సిన నాలుగో గేమ్‌లో విజయం అందుకున్నాడు.


అప్పుడు ఇద్దరు ఆటగాళ్లు ఐదు నిమిషాల గేమ్స్‌ ఆడాల్సి వచ్చింది. ఐదో గేమ్‌లో ఓడిన ప్రజ్ఞానంద ఆరోది గెలిచాడు. మ్యాచ్‌ టైబ్రేక్‌ అవ్వడంతో నిర్ణయాత్మక గేమ్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఇందులో 5-4 తేడాతో అర్జున్‌ను ప్రజ్ఞానంద ఓడించాడు. మూడు నిమిషాల ఈ మ్యాచులో ఆరంభంలో అతడు 30 సెకన్లు నష్టపోయాడు. అయినా పుంజుకొని చరిత్ర సృష్టించాడు.


Also Read: నేను రిలాక్స్‌డ్‌గా ఉన్నా! ఎంజాయ్‌ చేసేందుకే వస్తున్నా - బుమ్రా!