Boxer Amit Panghal Clinches Paris Olympics Spot: పారిస్ ఒలింపిక్స్(Paris Olympics)కు భారత్‌కు చెందిన మరో బాక్సర్ అర్హత సాధించాడు. వరల్డ్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌లో సత్తా చాటిన అమిత్ పంగాల్(Amit Panghal)... పారిస్ ఒలింపిక్స్ బెర్తును సొంతం చేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత కూడా అయిన అమిత్ పంగాల్... వరల్డ్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ (Boxing World Qualifiers) లో క్వార్టర్ ఫైనల్‌లో విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్‌లో చైనాకా చెందిన చువాంగ్ లియుపై 5-0 తేడాతో పంగాల్ విజయం సాధించాడు. తొలుత 1-4తో వెనుకబడిన పంగాల్ రెండో రౌండ్‌లో సానుకూలంగా ఆడి విజయాన్ని సాధించాడు.
ఈ విజయంతో పంగాల్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఇప్పటికే నిశాంత్ దేవ్ (71 కేజీలు), నిఖత్ జరీన్ (50 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), లోవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు) ఒలింపిక్స్ బెర్తులు ఖాయం చేసుకోగా... తాజాగా అమిత్ కూడా ఈ జాబితాలో చేరాడు. 2022లో కామన్వెల్త్ గేమ్స్‌లో పంగాల్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ప్రతిష్టాత్మక స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్‌లోనూ అమిత్ పంగాల్ విజేతగా నిలిచాడు. ఇప్పటికే భారత స్టార్ రెజ్లర్, రెండుసార్లు ఒలింపియన్ వినేశ్ ఫొగాట్ వరుసగా మూడోసారి ఒలింపిక్ బెర్తును ఖాయం చేసుకుంది.
ఆసియా ఒలింపిక్స్ అర్హత పోటీల్లో 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరుకోవడం ద్వారా వినేశ్ పారిస్ ఒలింపిక్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇప్పటికే 53 కిలోల విభాగంలో అంతిమ్ పంగల్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రెండో భారత మహిళ రెజ్లర్‌గా వినేశ్ ఫొగాట్ నిలిచింది. 2016 రియో గేమ్స్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్న వినేశ్.. వరుసగా మూడోసారి ఒలింపిక్ బెర్తు సాధించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా కొనసాగిన ఉద్యమంలో వినేశ్ కీలక పాత్ర పోషించింది.