Jasprit bumrah injury: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ముందు టీమ్‌ఇండియాకు షాక్‌! ఆస్ట్రేలియాలో జరిగే ఈ మెగాటోర్నీకి పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చని తెలిసింది. అతడి వెన్నెముక గాయం తీవ్రంగా ఉందని సమాచారం. ఇప్పటికే అతడు ఆసియా కప్‌నకు దూరమయ్యాడు.


పొట్టి క్రికెట్‌ ప్రపంచకప్‌ గెలవాలని టీమ్‌ఇండియా పట్టుదలతో ఉంది. ఆస్ట్రేలియాలో ట్రోఫీని ముద్దాడాలని హిట్‌మ్యాన్‌ సేన కలగంటోంది. ఈ కల సాకారం అవ్వాలంటే బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో జట్టు సమతూకంగా ఉండాలి. ఒకవేళ జస్ప్రీత్‌ బుమ్రా దూరమైతే బౌలింగ్‌ దాడిలో పదును తగ్గుతుంది.


ప్రస్తుతం జస్ప్రీత్‌ బుమ్రా బెంగళూరులోని ఎన్‌సీఏలో రిహబిలిటేషన్‌కు వెళ్లాడు. 2019లో ఇబ్బంది పెట్టిన గాయమే ఇప్పుడూ తిరిగబెట్టిందని సమాచారం. పేసుగుర్రం గురించి ఆందోళన చెందుతున్నామని బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌కు తెలిపారు.


'అవును, బుమ్రా గాయం గురించి ఆందోళన చెందుతున్నాం. అతడు జాతీయ అకాడమీకి వచ్చాడు. అత్యుత్తమ వైద్య సిబ్బంది అతడిని పర్యవేక్షిస్తున్నారు. అతడు మళ్లీ పాత గాయంతోనే బాధపడుతుండటం మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు ఇంకా రెండు నెలల సమయమే ఉంది. కాకూడని సమయంలో అతడికి గాయమైంది. ప్రపంచంలోనే అత్యత్తుమ, ప్రమాదకరమైన బౌలర్‌ కావడంతో మేం జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాం' అని ఆ అధికారి వెల్లడించారు.


జస్ప్రీత్‌ బుమ్రా లేకపోవడంతో ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా బౌలింగ్‌ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. భువనేశ్వర్‌ మినహా అనుభవం ఉన్న పేసర్లు కనిపించడం లేదు. బాగానే బౌలింగ్‌ చేస్తున్నా అర్షదీప్‌ సింగ్‌, అవేశ్‌ ఖాన్ ఇంకా యువకులే. గాయం వల్ల హర్షల్‌ పటేల్‌ సైతం దూరమయ్యాడు.


ఆసియా కప్‌కు భారత జట్టు


రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్


నోట్‌:  శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్‌లు స్టాండ్ బైగా ఉన్నారు.