Independence Day Celebration:
అది రాష్ట్రాల బాధ్యతే..
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా పెరుగుతోంది. సంఖ్యగా చూస్తే స్వల్పంగానే కనిపిస్తున్నా...ఇది ఉన్నట్టుండి ఉద్ధృతమైతే మరో ముప్పు తప్పదేమో అని కలవర పడుతోంది కేంద్రం. కొవిడ్ కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాలకు ఆదేశాలిచ్చింది. స్వాతంత్య్ర వేడుకలు సమీపిస్తుండటం వల్ల కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. స్వాతంత్య్ర వేడుకల్లో అందరూ తప్పనిసరిగా కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. దేశవ్యాప్తంగా రోజూ కనీసం 15 వేల కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ సూచనలు చేసింది కేంద్ర ప్రభుత్వం. "ముందు జాగ్రత్త చర్యగా, స్వాతంత్ర్య దినోత్సవాల్లో పెద్ద ఎత్తున గుమికూడటం లాంటివి చేయకూడదు. కొవిడ్ గైడ్‌లైన్స్‌ని పాటించటం చాలా కీలకం" అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ "స్వచ్ఛ భారత్" కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపింది. రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి నెల రోజుల పాటు తమ ప్రాంతాల్లో "స్వచ్ఛ" కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. పర్యావరణ సంరక్షణలో భాగంగా అందరిలో అవగాహన పెంచేలా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో మొక్కలు నాటాలని సూచించింది.
దిల్లీలో మాస్క్ తప్పనిసరి..
24 గంటల్లో భారత్‌లో 16,561 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 49 మంది మృతి చెందారు. ఈ మృతుల్లో 10 మంది కేరళకు చెందిన వారే. ప్రస్తుతానికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 42 లక్షల, 23వేల 557కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్యలో మాత్రం తగ్గుదల కనిపించింది. ప్రస్తుతానికి 1,23,535 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం ఇప్పటి వరకూ కరోనా మృతుల సంఖ్య 5 లక్షల 26 వేల 928కి పెరిగింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.28%కాగా, రికవరీ రేటు 98.53%గా ఉంది. 24 గంటల్లోనే యాక్టివ్ కేసుల సంఖ్య 1,541 మేర తగ్గింది. డెయిలీ పాజిటివిటీ రేటు 5.44%కాగా, వీక్లీ పాజిటివిటీ రేటు 4.88%గా నమోదైంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే..దిల్లీలో ఓ కీలక నిబంధనను మరోసారి అమల్లోకి తీసుకొచ్చారు. మాస్క్ తప్పనిసరి చేశారు. పబ్లిక్ ప్లేసెస్‌లో మాస్క్ ధరించని వాళ్లకు రూ.500 జరిమానా విధించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రైవేట్ ఫోర్ వీలర్స్‌లో ప్రయాణించే వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పుడే కాదు. కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి దిల్లీ కొవిడ్ హబ్‌గా మారింది. మహారాష్ట్ర తరవాత ఇక్కడే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దేశంలో తొలిసారి "మాస్క్" నిబంధన తీసుకొచ్చింది దిల్లీలోనే. ఇప్పుడు మరోసారి ఇక్కడే కేసులు పెరుగుతున్నాయి. ఈ మధ్యే కొవిడ్ కేసులు తగ్గాయని మాస్క్ నిబంధనను తొలగించింది కేజ్రీవాల్ సర్కార్. ఇప్పుడు మళ్లీ తప్పనిసరి చేసింది. నిత్యం కొవిడ్ మార్గదర్శకాలు జారీ చేస్తూనే ఉంది దిల్లీ ప్రభుత్వం. అయితే...ఈ సారి కరోనాతో పాటు మంకీపాక్స్ కేసులూ నమోదవుతుండటం వల్ల ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఇప్పటికే దిల్లీ రెండు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.
Also Read: TDP YCP In BJP Trap : వైఎస్ఆర్‌సీపీ, టీడీపీలతో బీజేపీ పొలిటికల్ గేమ్ - తెలంగాణ కోసమే !
Also Read: ఈ బజారులో భర్తను కొనుక్కోవచ్చు, 700 ఏళ్లుగా ఇదే ఆచారం - ఎక్కడో కాదు ఇండియాలోనే!