Bihar Politics:
ఒంటరిగా నిలిచి గెలిచేందుకు ఇదే అవకాశం..
బిహార్‌లో మరోసారి మహాఘట్‌బంధన్ కూటమి ఏర్పాటైంది. జేడీయూతో మళ్లీ కలిసేదే లేదని గతంలోనే తేల్చి చెప్పిన RJD చీఫ్ తేజస్వీ యాదవ్...ఉన్నట్టుండి రూట్ మార్చారు. మళ్లీ పాతమైత్రికే జైకొట్టారు. నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా, తేజస్వీ యాదవ్ డిప్యుటీ సీం పదవిని చేపట్టారు. భాజపాను లక్ష్యంగా చేసుకునే ఇద్దరు నేతలు విభేదాలు మరిచి మళ్లీ కలిశారని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అటు కాంగ్రెస్ శ్రేణులూ సోనియా గాంధీ వల్లే ఇదంతా సాధ్యమైందని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే భాజపా అప్రమత్తమైంది. టార్గెట్ 2024లో భాగంగా బిహార్‌లో జరిగిన ఈ రాజకీయ మార్పుని జాగ్రత్తగా గమనిస్తోంది. ఏ వ్యూహంతో ముందుకెళ్లాలనే ఆలోచనలో పడింది. నితీష్, తేజస్వీని ఢీకొట్టే ప్లాన్‌ను సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం అధికారాన్ని కోల్పోయినందుకు భాజపా పైకి బాధ పడుతున్నప్పటికీ...ప్రత్యర్థులతో ప్రత్యక్షంగా పోరాడేందుకు ఇదో మంచి అవకాశం అని భావిస్తోంది. ఎవరి అండ లేకుండా ఏకపక్షంగా గెలిచి బిహార్‌పై పట్టు సాధించాలని చూస్తోంది. ఇన్నాళ్లూ నితీష్ కుమార్ వల్లే తమ పార్టీ ఇక్కడ బలంగా నిలబడలేకపోయిందన్న భావన కాషాయవర్గాల్లో ఉంది. ఇప్పుడు లైన్ కూడా క్లియర్ అవటం వల్ల ముఖాముఖి పోరుకు పావులు కదుపుతోంది.
కోటను కూల్చడమే తక్షణ కర్తవ్యం..
ఆర్‌జేడీ, జేడీయూ కలిసి కట్టుకున్న కోటను కూల్చటమే భాజపా తక్షణ కర్తవ్యం. బిహార్‌లో ప్రభుత్వం మారిన వెంటనే భాజపా కోర్ కమిటీ సమావేశమైంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ జైస్వాల్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో చర్చించారు. తదుపరి వ్యూహాలపై ప్రణాళికలు రచించారు. బిహార్‌లో నితీష్ ఫ్యాన్ బేస్ తగ్గిపోయిందని ప్రచారం చేయటం..భాజపా ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే జేడీ(యూ)ని
ఢీకొట్టి విజయం సాధించటం సులువే అని పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపుతోంది. గత ఎన్నికల్లో ప్రత్యర్థులు నితీష్ పార్టీకి దాదాపు అన్ని చోట్లా గట్టి పోటీ ఇచ్చారని, కాస్త శ్రమిస్తే జేడీయూని పడగొట్టడం పెద్ద కష్టమేమీ కాదని అంటోంది. సంస్థాగతంగా చూసుకుంటే రాష్ట్రంలో భాజపా బలంగానే ఉందన్నది కొందరి విశ్లేషణ. అందుకే నితీష్‌ను లక్ష్యంగా చేసుకుని "పల్టీమార్" రాజకీయాలు అనే అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటోంది.ప్రచారంలో ఇదే పదాన్ని పదేపదే వాడుతూ...నితీష్ చరిష్మాను దెబ్బ తీయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా జిల్లా, బ్లాక్ స్థాయుల్లో జేడీ(యూ)కి వ్యతిరేకంగా మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని వ్యూహ రచన చేస్తోంది. JDU వెన్నుపోటు పొడిచిందనే విషయాన్నే ప్రధానంగా ప్రస్తావించే అవకాశముంది.
ఆర్‌జేడీ అవినీతి పాలనపైనా విమర్శలు చేస్తూ...ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది. నేరాల నియంత్రణలో నితీష్ కుమార్ విఫలమయ్యారనే అస్త్రాన్నీ సంధించనుంది భాజపా. తేజస్యీ యాదవ్ పార్టీ బాధ్యతలు చేపట్టాక..ఆర్‌జేడీ ముస్లిం,యాదవ్ ఓటు బ్యాంకుని కోల్పోయిందన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. ఈ అంశాన్నీ తెరపైకి తీసుకొచ్చి...భాజపా తమకు అనుకూలంగామలుచుకునే అవకాశం లేకపోలేదు. లోక్ జనశక్తి పార్టీ (LJP) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ భాజపా క్యాంప్‌లో చేరటం వల్ల దళిత ఓటు బ్యాంకు భాజపా ఖాతాలో చేరిపోతాయి. ఇలా తమదైన వ్యూహాలతో నితీష్ సర్కార్‌ను ఎదుర్కొనేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది కాషాయ పార్టీ.
Also Read: Telangana Loans : "అప్పుల రూల్స్" తెలంగాణకు మాత్రమేనా ? కేంద్రం వివక్ష చూపిస్తోందా ? ఇవిగో డీటైల్స్
Also Read: Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?